ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ASSEMBLY: రాబోయే రెండున్నరేళ్లూ అచ్చెన్న, నిమ్మలకు మాట్లాడే అవకాశం ఇవ్వరట - ఏపీ తాజా వార్తలు

తెదేపా శాసనసభాపక్ష ఉప నేతలు కింజరాపు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు ఇద్దరికీ వచ్చే శాసనసభలో మాట్లాడే అవకాశం ఇవ్వకూడదని ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ హక్కుల సంఘం తీర్మానించింది. దీన్ని రెండున్నరేళ్ల పాటు... అంటే ఈ శాసనసభ ఉన్నన్నాళ్లూ అమలుచేయాలని సిఫార్సు చేయనుంది. వచ్చే సమావేశాల్లో ఈ తీర్మాన ప్రతిని శాసనసభ ముందు ఉంచనున్నారు. ఈ చర్య తీసుకోవాలని వైకాపా ఎమ్మెల్యే వరప్రసాద్‌ ప్రతిపాదించగా, మరో ఎమ్మెల్యే విష్ణు బలపరిచినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు, తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ ధ్రువీకరించారు. ఇదే విషయాన్ని ఆయన మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు.

achenna
achenna

By

Published : Sep 22, 2021, 7:25 AM IST

సభా హక్కుల సంఘం శాసనసభ కమిటీ హాలులో మంగళవారం సమావేశమైంది. ఛైర్మన్‌ కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. గతంలో శాసనసభలో చర్చ సందర్భంగా మద్యం దుకాణాల సంఖ్యపై సభా వేదికగా తప్పుడు సమాచారాన్ని ఇచ్చారని అచ్చెన్నాయుడిపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశారు. పింఛన్ల సంఖ్య విషయంలో రామానాయుడిపై స్వయంగా ముఖ్యమంత్రి సభలోనే సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ ఫిర్యాదులపై వారిద్దరూ సరైన వివరణ ఇవ్వనందున వారిపై చర్యలు తీసుకోవాలని కమిటీ నిర్ణయించినట్లు మాత్రమే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాకు తెలిపారు. సభాపతి తమ్మినేని సీతారాంపై చేసిన వ్యాఖ్యలపై ఫిర్యాదు విషయంలో అచ్చెన్నాయుడు గత సమావేశానికి వ్యక్తిగతంగా హాజరై విచారం వ్యక్తం చేశారు. దాన్ని పరిగణనలోకి తీసుకున్న కమిటీ ఈ ఫిర్యాదును కొట్టేసింది.

నిమ్మగడ్డకు ఆ సమాచారం పంపండి:

మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇంటినుంచి బయటకు రాకూడదంటూ ఉత్తర్వులు ఇవ్వలేదని, అలాంటి ఆదేశాలు తానిచ్చినట్లు ఉంటే ఆ వివరాలను పంపాలని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ కోరారని సమావేశంలో ప్రస్తావించారు. గతంలో ఆయనిచ్చిన ఉత్తర్వులు, మంత్రులు కోర్టుకెళ్లి అనుమతి తెచ్చుకోవడం వంటి వివరాలతో కూడిన సమాచారాన్ని నిమ్మగడ్డకు పంపాలని కమిటీ అధికారుల్ని ఆదేశించింది.

శాసనసభ్యుల అభిప్రాయం మేరకు వారిద్దరిపై చర్యలు:

సమావేశం అనంతరం కాకాణి గోవర్ధన్‌రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ‘శాసనసభను తప్పుదారి పట్టించారన్న ఫిర్యాదులపై అచ్చెన్నాయుడు, రామానాయుడిపై చర్యలకు శాసనసభకు సిఫారసు చేస్తాం. శాసనసభ్యుల అభిప్రాయం మేరకు సభాపతి తదుపరి చర్యలు తీసుకుంటారు’ అని తెలిపారు. అంతేతప్ప ఆయన ‘మైక్‌కట్‌’ అంశాన్ని ప్రస్తావించలేదు. ‘ఆగస్టు 31న జరిగిన సమావేశానికి వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌ అందుబాటులో లేనని.. నోటీసు అందలేదని గైర్హాజరైనట్లు సభాపతి వ్యక్తిగత కార్యదర్శి కమిటీకి ఫిర్యాదు చేశారు. ఆ రోజు రవికుమార్‌ అందుబాటులో లేనట్లుగా నిరూపించుకోవాలి. లేకపోతే ధిక్కారం కింద ఆయనపై చర్యలు తీసుకోవాలని అసెంబ్లీకి సిఫారసు చేయాలని నిర్ణయించాం. అందుబాటులో ఉండి రవి గైర్హాజరు అయ్యారనడానికి ఆధారాలను సమర్పించాలని సభాపతి వ్యక్తిగత కార్యదర్శికి చెప్పాం’ అని వివరించారు.

నిమ్మగడ్డ అవగాహన లోపంతో చెప్పొచ్చు:

కమిటీ ఇచ్చిన నోటీసుపై మరింత సమాచారం కావాలని మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ లేఖ రాశారని కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెల్లడించారు. ‘శాసనసభ, సభ్యులపై గౌరవం ఉందని, మరింత సమాచారం ఇస్తే వాటిపైనా వివరణ ఇస్తామని బదులిచ్చారు. ఆయన కోరిన సమాచారం అందిస్తాం’ అని వివరించారు. ‘న్యాయస్థానంలో విచారణ జరుగుతోంది కాబట్టి ప్రివిలేజ్‌ కమిటీ విచారించడం కుదరదని చెప్పడానికి వీల్లేదు. నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ అనుభవరాహిత్యం, అవగాహనలోపంతో చెప్పొచ్చు. ఆయన చెప్పినంత మాత్రాన దాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకే వ్యవస్థలో విచారణ జరగాలని ఎక్కడా లేదు. రమేశ్‌కుమార్‌ వివరణ వచ్చాక ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు, వ్యవహరించిన తీరు అన్నింటినీ పరిశీలించి ఫిర్యాదును వదిలేయాలా.. లేక చర్యలకు సిఫారసు చేయాలా అనే దానిపై కమిటీ తీర్మానం చేస్తుంది’ అని తెలిపారు. తదుపరి సమావేశం ఎప్పుడో ఇంకా ఖరారు చేయలేదన్నారు. అసెంబ్లీ సమావేశాలు దగ్గర్లో లేకపోతే సమావేశం ఏర్పాటుచేసి అన్నింటిని ముగించాలని నిర్ణయించామని తెలిపారు.

తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నా: ఎమ్మెల్యే అనగాని
తెదేపా శాసనసభాపక్ష ఉప నేతలు అచ్చెన్నాయుడు, రామానాయుడికి మైక్‌ ఇవ్వరాదని శాసనసభ హక్కుల సంఘం చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నానని సంఘం సభ్యుడు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌ మంగళవారం రాత్రి ట్వీట్‌ చేశారు. ‘ఇద్దరు నేతలూ ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా దూషించారనే ఆరోపణలపై కమిటీ ఇలా తీర్మానం చేసింది’ అన్నారు. రామానాయుడ్ని సీఎం డ్రామానాయుడు అన్నందుకే రామానాయుడు మాట్లాడారని కమిటీ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. కావాలంటే రికార్డులు పరిశీలించాలని కమిటీ సభ్యులకు సూచించినట్లు సత్యప్రసాద్‌ వెల్లడించారు.

ఇదీ చదవండి : DRUGS CASE : సుధాకర్‌ పాత్రపై డీఆర్‌ఐ అధికారుల ఆరా

ABOUT THE AUTHOR

...view details