'మండలి'పై శాసనసభలో చర్చ! - ఏపీ అసెంబ్లీ సమావేశాలు తాజా వార్తలు
శాసనమండలిలో నిన్నటి పరిణామాలపై అసెంబ్లీలో చర్చ జరిగింది. పెద్దల సభకి గౌరవం ఉండాలని మంత్రులు అన్నారు. ప్రభుత్వం ఏటా మండలికి 60 కోట్లు ఖర్చు పెడుతోందని మంత్రి బుగ్గన తెలిపారు. నిన్న తెదేపా అధినేత చంద్రబాబు 4 గంటలపాటు మండలి గ్యాలరీలో ఉండి.. ఛైర్మన్‌ను చంద్రబాబు ప్రభావితం చేశారని కన్నబాబు ఆరోపించారు. నిబంధనలు ఉన్నప్పుడు పాటించాలని... లేదంటే చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగాన్ని గౌరవించకపోతే.. ప్రజలు నిస్సహాయులుగా మిగిలిపోతారని మంత్రి ధర్మాన అన్నారు.
పరిపాలన వికేంద్రీకరణకు సంబంధించిన బిల్లుపై చర్చ సందర్భంగా... శాసనమండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో చర్చ జరుగింది. రెండు బిల్లులను శాసనమండలికి పంపామని, బిల్లులను మండలి ఆమోదించాలని, లేదంటే తిప్పి పంపాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. రూల్ 71పై చర్చకు మండలి చైర్మన్ షరీఫ్ అనుమతి ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపాలని లేఖలు పంపారని... బిల్లులను ప్రవేశపెట్టినప్పుడే సవరణలు సూచించాలని అన్నారు. ఈ విషయంలో నిబంధనలు చాలా స్పష్టంగా ఉన్నాయని ఆయన తెలిపారు. సెలక్ట్ కమిటీ అంశంలో విచక్షణాధికారం ఉండదన్నారు. సంఖ్యాబలం ఉందని ఛైర్మన్‌పై తెదేపా సభ్యులు ప్రభావం చూపారని ఆరోపించారు. ఛైర్మన్‌కు ఎదురుగా గ్యాలరీలో తెదేపా అధినేత చంద్రబాబు కూర్చున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపే అధికారం చైర్మన్‌కు లేదని స్పష్టం చేశారు.