ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మృతి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు శాసనసభ సంతాపం తెలిపింది. దీనికి సంబంధించిన సంతాప తీర్మానాలను స్పీకర్ తమ్మినేని సీతారాం సభలో చదివి వినిపించారు. ఆ తర్వాత సభ్యులు సభలో కొద్దిసేపు మౌనం పాటించి సంతాపం తెలిపారు. అనంతరం ఇటీవల బద్వేలు ఉప ఎన్నికలో విజయం సాధించిన దాసరి సుధ ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేశారు. స్పీకర్ తమ్మినేని సీతారాం ఆమెతో ప్రమాణం చేయించారు.
అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశమైంది. సీఎం జగన్‌తో పాటు మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్, చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. తెదేపా తరఫున ఆ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడు హాజరయ్యారు. ఈనెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. తొలుత ఒక్కరోజే సభ నిర్వహించాలని భావించినప్పటికీ పలు బిల్లులకు ఆమోదం తెలపాల్సిన దృష్ట్యా సమావేశాలను 26 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.
మీ నాయకుడిని చూడాలని ఉంది...
‘మీ నాయకుడినీ సభకు తీసుకురావాలని మా రిక్వెస్ట్. కుప్పం ఎన్నికల ఫలితాలపై మాట్లాడినప్పుడు ఆయన ముఖం ఎలా ఉంటుందో చూడాలని ఉంది’ ఇది తెదేపా అధినేత చంద్రబాబును సభకు రమ్మని చెప్పండంటూ... ఏపీ ముఖ్యమంత్రి జగన్ వ్యంగ్యోక్తి! ‘కుప్పంలో ఎలా గెలిచారో మీ మనస్సాక్షికి తెలుసు. గెలుపోటములు సహజం. మాకేమీ ఇబ్బంది లేదు’ ఇది తెదేపా శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడి కౌంటర్. ఇలా వ్యంగ్యోక్తులు, వాగ్బాణాలతో శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం ఆసక్తికరంగా సాగింది. ముఖ్యమంత్రి పలుసార్లు అచ్చెన్నను..‘పెద్దాయన’ అని సంబోధించారు. శాసనసభ సమావేశాల్ని ఈ నెల 26 వరకు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. బీఏసీ గురువారం ఉదయం శాసనసభాపతి తమ్మినేని సీతారాం అధ్యక్షతన సమావేశమైంది. జగన్, మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, అనిల్‌కుమార్, కన్నబాబు, ప్రభుత్వ చీఫ్‌విప్ శ్రీకాంత్‌రెడ్డి, తెదేపా నుంచి అచ్చెన్నాయుడు హాజరయ్యారు. సీఎం వస్తూనే... అచ్చెన్నను చూసి ‘అచ్చెన్నాయుడు ద గ్రేట్’ అంటూ పలకరించారు. శాసనసభ సమావేశాలు గురువారం ఒక్క రోజే నిర్వహిస్తున్నట్టు అధికారపక్షం తొలుత చెప్పగా... అచ్చెన్నాయుడు అభ్యంతరం తెలియజేశారు. కనీసం 15 రోజులైనా సమావేశాలు నిర్వహించాలని కోరారు. 15 రోజులు సాధ్యం కాదని మంత్రులు చెప్పగా ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ‘పెద్దాయన అడుగుతున్నారు కదా’ అంటూ జేబులోంచి చిన్న క్యాలెండర్ తీసి తేదీలు చూశారు. ఈ నెల 26 వరకు ఏడు రోజులు సమావేశాలు నిర్వహిద్దామని తెలిపారు.
ఇవీచదవండి.