లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా వ్యాప్తి నేపథ్యంలో 2 రోజులకే పరిమితమైన ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో.. ద్రవ్యవినిమయ బిల్లు సహా ఇతర కీలకమైన 13 బిల్లులకు ఒకే రోజు ఆమోదం లభించింది. గవర్నర్ ప్రసంగం అనంతరం మద్యాహ్నం 1 గంటకు అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశ పెట్టారు. దీనిపై ఎలాంటి చర్చా లేకుండానే సభ ఆమోదించింది. గవర్నర్ ప్రసంగం సమయంలోనే తెదేపా సభ్యులు వాకౌట్ చేయటంతో మొత్తం 12 బిల్లులు ఎలాంటి చర్చలు, అభ్యంతరాలు లేకుండానే ఆమోదం పొందాయి. పాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనసభ ఆమోదించింది. డీజిల్, పెట్రో ధరలను రాష్ట్రంలో సవరించేందుకు వీలుగా ఏపీ వ్యాట్ చట్టాన్ని సవరిస్తూ తీసుకువచ్చిన బిల్లుకు పచ్చజెండా ఊపింది.
పంచాయతీరాజ్ చట్టంలో గిరిజన ప్రాంతాల్లోని వారికే 100 శాతం రిజర్వేషన్ కల్పించేలా సవరణ చేసిన చట్టానికి అమోదం తెలిపింది. జీఎస్టీ కౌన్సిల్ సూచించిన అంశాలను రాష్ట్రంలో ర్యాటిఫై చేసే బిల్లు, పురపాలక చట్టాల సవరణ బిల్లు, తితిదే సన్నిధిలో గొల్లలను సన్నిధి యాదవులుగా సవరిస్తూ చేసిన చట్ట సవరణ బిల్లులు ఆమోదం పొందాయి. ఏపీ ఉన్నత విద్య, పర్యవేక్షణ, నియంత్రణ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. అధ్యాపకుల సర్వీసు నిబంధనలు, ఫీజుల క్రమబద్ధీకరణ చేయడం వంటి కీలక అంశాలను ఈ బిల్లులో చేర్చారు. పేద విద్యార్థులు ఉన్నత విద్య చదివే అవకాశం ఈ చట్టం ద్వారా కలుగనుంది.