ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రుల శాఖలకు సంబంధించి ఓ సెంటిమెంట్ ఉండేది. దేవాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఎవరికీ కూడా రాజకీయంగా కలిసి రాలేదు. ఆశాఖ మంత్రిగా పనిచేసిన పలువురు తదుపరి ఎన్నికల్లో ఓటమి పాలవ్వడం, పదవులు దక్కకపోవడం ఉండేది. ఆ శాఖ బాధ్యతలు తీసుకోవాలంటేనే కాస్తా వెనకా ముందూ ఆలోచించే వాళ్లు. రాష్ట్ర విభజన వరకు ఈ సెంటిమెంట్ కొనసాగింది.
అదే సెంటిమెంటా..!
తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తరహా సెంటిమెంట్ వైద్య, ఆరోగ్య శాఖకు ఉన్నట్లు కనిపిస్తోంది. ఆశాఖ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఇరువురు బర్తరఫ్ అయ్యారు. 2014లో కేసీఆర్ కేబినెట్లో ఉన్న డాక్టర్ రాజయ్య ఉపముఖ్యమంత్రి హోదాలో వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. ఆర్నెళ్ల పాటే పదవిలో ఉన్న రాజయ్యకు సీఎం కేసీఆర్ ఉద్వాసన పలికారు. ఆయనను మంత్రివర్గం నుంచి తప్పించి కడియం శ్రీహరిని కేబినెట్లోకి తీసుకున్నారు. తాజాగా 2018లో రెండోసారి అధికారంలోకి వచ్చాక వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు అప్పగించారు. మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటి నుంచే పరిస్థితులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవనే చెప్పుకోవచ్చు. అప్పటినుంచి చోటుచేసుకున్న పలు పరిణామాలు, ఉదంతాలు దినదిన గండంగానే గడుస్తూ వచ్చాయి.