రాష్ట్ర ఉప ఖజానా కార్యాలయాల్లో మరో కుంభకోణం వెలుగుచూసింది. టీడీఎస్ మినహాయించిన సొమ్ముల కంటే అదనంగా క్లెయిమ్ చేసి రూ.కోట్లు స్వాహా చేశారు. సాధారణంగా ఆదాయ పన్ను చెల్లింపుదారులు తాము కట్టాల్సిన సొమ్ము కంటే అదనంగా చెల్లించినప్పుడు, ఆ అదనపు మొత్తాన్ని తిరిగి వెనక్కి తీసుకునే (క్లెయిమ్) వెసులుబాటు ఉంటుంది. అయితే బోగస్ క్లెయిమ్‌లతో కొందరు భారీగా సొమ్ములు రాబట్టినట్లు ఖజానా అధికారుల పరిశీలనలో బయటపడింది. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ఓ కుంభకోణం ఆధారంగా దేశవ్యాప్తంగా డేటాను పరిశీలిస్తుండగా ఈ అక్రమం వెలుగుచూడటం విశేషం.
ఉమ్మడి చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె ఉప ఖజానా కార్యాలయంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో సమకూరిన ఆదాయపు పన్ను రూ.2.10 కోట్లు మాత్రమే. ఇక్కడ రిటర్నులు సమర్పించాక అధిక మొత్తం చెల్లించామంటూ వెనక్కి తీసుకున్న సొమ్ము ఏకంగా రూ.25.83 కోట్లు. అంటే రూ.23.73 కోట్ల మేర కుంభకోణం జరిగింది. అంతకుముందు ఏడేళ్లుగా ఏం జరిగిందో కూడా ఖజానా అధికారులు ఆరా తీస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని కాకినాడ, రాజమహేంద్రవరం, కొత్తపేట, పాలకొల్లు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, వాల్మీకిపురం ఉప ఖజానా కార్యాలయాల్లోనూ ఇలాంటి అక్రమాలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. చివరికి లెక్కలు తేలేసరికి ఐటీ శాఖకు ఎంత టోకరా వేశారో అంచనాకు రాగలమని చెబుతున్నారు.
ఇలా బయటపడింది:కేరళలో ఈ తరహా కుంభకోణం తొలిసారి వెలుగుచూసింది. బోగస్ రిఫండ్ క్లెయిమ్‌లు దాఖలు చేసి, అకౌంట్స్ ఆఫీసు ఐడెంటిఫికేషన్ నంబరు (ఏఐఎన్)ను దుర్వినియోగం చేసి పెద్దమొత్తంలో నిధులు కాజేసినట్లు గుర్తించారు. దీంతో ఆదాయపు పన్నుశాఖ కోజికోడ్ జాయింట్ కమిషనర్ దేశవ్యాప్తంగా అనేక ఏఐఎన్‌లను పరిశీలించారు. అనుమానంగా ఉన్న ఏఐఎన్‌లను పరిశీలించి 2021 డిసెంబరు 21న ఓ నివేదిక సిద్ధం చేశారు. అందులో తంబళ్లపల్లెకు చెందిన ఏఐఎన్‌తో జరిగిన ఐటీ రిటర్నుల లావాదేవీలపై అనుమానం వ్యక్తమైంది. ఇక్కడ ఏడేళ్లుగా నమోదైన రిటర్నుల మొత్తానికి, 2020-21లో రిటర్నుల మొత్తానికి భారీ వ్యత్యాసం కనిపించడంతో అనుమానించి నివేదికలో ఆ విషయాన్ని ప్రస్తావించారు. ఆ నివేదిక ఆధారంగా కూపీ లాగగా ఏపీలోనూ బోగస్ క్లెయిమ్‌ల కుంభకోణం వెలుగుచూసింది.