భారతమాల ప్రాజెక్టు కింద జాతీయ రహదారుల సంస్థ రోడ్ల విస్తరణ చేపట్టింది. ఇందులో భాగంగా.. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి సమీపంలోని కంది నుంచి మహారాష్ట్ర- తెలంగాణ సరిహద్దులోని పింపాల్‌గావ్ వరకు నాలుగు వరుసల మార్గాన్ని నిర్మించనుంది. 135.75 కిలోమీటర్ల నిడివిగల ఈ మార్గాన్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ మూడు ప్యాకేజీలుగా విభజించింది. నిర్మాణానికి రూ.3,170 కోట్లను వెచ్చించనుంది. రెండు ప్యాకేజీలను 2018లో మంజూరు చేయగా.. ఇప్పటికీ ఆ పనులు సాగుతున్నాయి.
మరో ప్యాకేజీ టెండర్లను జాతీయ రహదారుల సంస్థ ఖరారు చేసింది. దీని పరిధిలో కంది(సంగారెడ్డి) నుంచి రాంసానపల్లె వరకు 39.98 కి.మీ. మార్గాన్ని రూ.1,000 కోట్లతో విస్తరించేందుకు తాజాగా అనుమతి లభించింది. మహారాష్ట్ర - తెలంగాణ సరిహద్దులోని పింపాల్‌గావ్ నుంచి మొదలయ్యే ఈ మార్గం కంది వరకు వస్తుంది. ఇక్కడి నుంచి హైదరాబాద్ - పుణె జాతీయ రహదారిలో కలుస్తుంది. తెలంగాణ నుంచి మహారాష్ట్రకు వాణిజ్య నడవగా ఈ రహదారి ఉపయోగపడాలన్నది కేంద్రం యోచన.