ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

WEATHER UPDATE: తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు - అండమాన్ తీరంలో మరో అల్పపీడనం

Another low pressure area is likely along the Andaman coast
తీరం దాటిన వాయుగుండం.. రాష్ట్రంలో భారీ వర్షాలు

By

Published : Nov 11, 2021, 1:23 PM IST

Updated : Nov 12, 2021, 9:02 AM IST

13:21 November 11

చెన్నై తీరాన్ని దాటిన వాయుగుండం

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చెన్నైకి సమీపంలో తీరాన్ని దాటింది. గడచిన 6 గంటలుగా గంటకు 4 కిలోమీటర్లవేగంతో కదిలిన వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ చెన్నైకి దిగువన తీరాన్ని దాటినట్టు వాతావరణశాఖ స్పష్టం చేసింది. వాయుగుండం భూభాగంపైకి వచ్చిన అనంతరం క్రమంగా బలహీనపడుతుందని వాతావరణశాఖ స్పష్టం చేసింది. 

దీని ప్రభావంతో కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలతో పాటు చిత్తూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. వీరఘట్టం, సారవకోట, ఆమదాలవలస, సరుబుజ్జిలి, నరసన్నపేట, కోటబొమ్మాళి, లావేరు మండలాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అటు అనంతపురం జిల్లావ్యాప్తంగా రెండ్రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కడప జిల్లా రాయచోటిలో బుగ్గవంక నీటి ప్రవాహంలో కారు చిక్కుకుపోయింది. ఈ ఘటనలో.. నీటిలో కొట్టుకుపోతున్న చందు(30)ను తాడు సాయంతో పోలీసులు రక్షించారు.

కాగా.. రాగల 24 గంటల్లోనూ రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మరోవైపు వాయుుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్టు రాష్ట్రవిపత్తు నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు వెల్లడించారు. అత్యవసర సహాయ చర్యల కోసం చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పంపించినట్టు స్పష్టం చేశారు.

మరోవైపు ఈ నెల 13 తేదీన అండమాన్ తీరప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు వెల్లడించారు. నవంబరు 17 తేదీనాటికి ఇది మరింత బలపడి కోస్తాంధ్ర వద్ద తీరాన్ని దాటే అవకాశమున్నట్టు విపత్తు నిర్వహణశాఖ స్పష్టం చేసింది.

పొంగుతున్న వాగులు వంకలు..
ప్రస్తుతం ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్రలో చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు అవుతున్నాయి. ప్రత్యేకించి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు కురిశాయని వాతావరణశాఖ స్పష్టం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. గడచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లా వరదయ్యపాలెంలో అత్యధికంగా 19.5 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు రాష్ట్ర ప్రణాళికా విభాగం వెల్లడించింది.

నెల్లూరు జిల్లా ముత్తుకూరు లో 19 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లా తడలో 18.9 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు అయినట్టు పేర్కొంది. వాకాడులో 18.2, నాయుడు పేటలో 15 సెంటిమీటర్లు నమోదైంది. సత్యవేడులో 15.5 సెంటిమీటర్లు, వడమాలపేటలో 15.1 సెంటిమీటర్ల వర్షపాతం కురిసినట్టు తెలిపింది. పుత్తూరులో 10 సెంటిమీటర్లు, తూర్పుగోదావరి జిల్లా అల్లవరంలో 6.1 సెంటిమీటర్ల వర్షపాతం రికార్డు అయ్యింది. కడప జిల్లా చిట్వేలులో 4.8 సెంటిమీటర్ల వర్షపాతం, రాయచోటిలో 2.2 సెంటిమీటర్ల వర్షపాతం, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో 2.1 సెంటిమీటర్ల వర్షపాతం కురిసింది. ఒంగోలు, ఉలవపాడులలో 1.5 సెంటిమీటర్ల వర్షపాతం, మచిలీపట్నంలో 1.3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైనట్టు ఏపీ ప్రణాళికా విభాగం తెలిపింది.

ఇదీ చదవండి

HEAVY RAINS: దక్షిణ కోస్తా, రాయలసీమకు వాయు‘గండం’.. నేడు, రేపు భారీ వర్షాలు

Last Updated : Nov 12, 2021, 9:02 AM IST

ABOUT THE AUTHOR

...view details