ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మృతుల స్థానాల్లో ఎన్నికలకు త్వరలో మరో ప్రకటన - ఏపీ పరిషత్ ఎన్నికలు తాజా వార్తలు

పరిషత్‌ ఎన్నికల్లో నామినేషన్లు వేశాక.. కొన్ని రోజులకే 116 మంది మృతి చెందారు. వీరిలో 16 మంది ఏకగ్రీవమయ్యారు. వారి స్థానాల్లో ఎన్నికలు నిర్వహించుటకు.. మళ్లీ ప్రత్యేక ప్రకటన ఇవ్వనున్నారు.

Another announcement for the Parishad elections soon
ఏపీ పరిషత్ ఎన్నికలు

By

Published : Apr 4, 2021, 11:00 AM IST

ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేశాక చనిపోయిన వారి స్థానాల్లో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక ప్రకటన(నోటిఫికేషన్‌) ఇవ్వనున్నారు. మృతి చెందిన అభ్యర్థుల వివరాలను పంచాయతీరాజ్‌శాఖ నుంచి ఎన్నికల సంఘం సేకరించింది. జడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు వేసిన వారిలో 15 మంది, ఎంపీటీసీ స్థానాలకు పోటీ చేస్తున్న వారిలో 101 మంది మృతి చెందారు. ఈ స్థానాల్లో ఎన్నికల నిర్వహణ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌(ఎస్‌ఈసీ) నీలం సాహ్ని శనివారం పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజాశంకర్‌తో చర్చించారు. ఈనెల 15లోగా ఎన్నికలు నిర్వహించాలనే యోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకటన ఎప్పుడు ఇస్తారో సోమవారం తరువాత స్పష్టత రానుంది.

ఏకగ్రీవమైన ఆనందం తీరకుండానే...
జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన 16 మంది మృతి చెందారు. వీరిలో ఇద్దరు జడ్పీటీసీలు, 14 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల జడ్పీటీసీగా ఏకగ్రీవమైన ఎర్రబోతుల వెంకట్‌రెడ్డి కరోనాతో మృతి చెందారు. ఆయన జడ్పీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యే అవకాశం ఉండేది. ఆశ తీరకముందే వెంకట్‌రెడ్డి చనిపోయారు. గుంటూరు జిల్లా కారంపూడి జడ్పీటీసీ సభ్యుడిగా ఏకగ్రీవమైన షేక్‌ ఇమామ్‌ సాహెబ్‌ గుండెపోటుతో మరణించారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఎంపీటీసీ సభ్యుల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఆరుగురు మృతి చెందారు. నెల్లూరు, కడప జిల్లాల్లో ఇద్దరు చొప్పున, పశ్చిమ గోదావరి, విజయనగరం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. ఈ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించనున్నారు.

ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌
పరిషత్‌ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయంలో కాల్‌ సెంటర్‌ ప్రారంభించారు. ఎన్నికల సంబంధిత ఫిర్యాదులను 0866 2466877 నంబరుకు ఫోన్లో తెలియజేస్తే సిబ్బంది నమోదు చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. పంచాయతీ, పురపాలక ఎన్నికల సమయంలో కాల్‌ సెంటర్‌ ప్రారంభించి తర్వాత మూసి వేశారు. పరిషత్‌ ఎన్నికల ఫిర్యాదుల స్వీకరణకు కాల్‌ సెంటర్‌ అవసరమన్న ఎస్‌ఈసీ ఆదేశాలతో అధికారులు తిరిగి ప్రారంభించారు.

ఇదీ చూడండి.అందరం కలిసి అక్క రత్నప్రభను గెలిపించుకుందాం : పవన్ కల్యాణ్

ABOUT THE AUTHOR

...view details