ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అన్నదాత' మాజీ సంపాదకుడు వాసిరెడ్డి కన్నుమూత - వాసిరెడ్డి నారాయణరావు కన్నుముత

అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు(93) కన్నుమూశారు. న్యూమోనియాతో తెలంగాణలోని హైదరాబాద్​ కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వాసిరెడ్డి నారాయణరావు అకాల మరణం పట్ల ఈనాడు గ్రూపు ఛైర్మన్‌ రామోజీరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

annadata ex editor narayanarao passed away
'అన్నదాత' మాజీ సంపాదకుడు వాసిరెడ్డి కన్నుమూత

By

Published : Jun 12, 2020, 11:09 AM IST

Updated : Jun 12, 2020, 9:11 PM IST

నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచి నిరంతరం పని చేయడంలోనే సాంత్వన పొందిన అన్నదాత మాజీ సంపాదకుడు డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు (93) గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఛాతీ నొప్పి లక్షణాలతో గురువారం తెలంగాణలోని హైదరాబాద్​ కేర్‌ ఆస్పత్రిలో చేరిన ఆయన శుక్రవారం ఉదయం 5గంటలకు తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

బీవీఎస్​సీ డిగ్రీ

కృష్ణా జిల్లా వీరులపాడులో 1927 ఆగస్టు 13న వాసిరెడ్డి లక్ష్మయ్య, నాగరాజమ్మ దంపతులకు జన్మించిన డా.నారాయణరావు... నందిగామ, గుంటూరులో ఉన్నత విద్యను అభ్యసించి 1952లో మద్రాసు వెటర్నరీ కళాశాలలో బీవీఎస్​సీ డిగ్రీ పొందారు. ఇజత్‌నగర్‌లోని ఇండియన్‌ వెటరినరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్​లో పీజీ చేశారు. కొలంబోప్లాన్‌ కింద 1960లో పశుపోషణలో అధ్యయనం కోసం భారత ప్రభుత్వం వీరిని ఆస్ట్రేలియా పంపించింది. అక్కడ డెయిరీ ఫారాల నిర్వహణపై శిక్షణ పొందారు.

అన్నదాత సంపాదకులుగా

1952 నుంచి ఆంధ్రప్రదేశ్‌ పశుసంవర్ధకశాఖలో వివిధ స్థాయిల్లో పనిచేశారు. పశుసంవర్ధక శాఖ సంచాలకులుగా పని చేసి 1985లో పదవీ విరమణ చేశారు. పనిలోనే సంతోషాన్ని వెతుక్కోవాలనే లక్ష్యంతో విశ్రాంత జీవితంలోనూ రైతు సేవలో తరించాలని భావించి 1985 నుంచి ఈనాడు గ్రూపులో చేరారు. 1987 నుంచి 2017 అక్టోబరు వరకు మూడు దశాబ్దాల పాటు దేశంలో అత్యధిక సర్క్యులేషన్‌ ఉన్న వ్యవసాయదారుల మాసపత్రిక "అన్నదాత" సంపాదకులుగా అపారమైన సేవలు అందించారు.

జాతీయ స్థాయిలో గుర్తింపు

వీరు నిర్వహించిన కార్యక్రమాల ఫలితంగానే భారత దేశంలో ఘనీభవించిన వీర్య ఉత్పత్తి, వినియోగంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే రెండోస్థానంలో నిలిచింది. పశు సంవర్ధక రంగంలో తన అనుభవాల ఆధారంగా దూడల పెంపకంపై పుస్తకం రచించారు. ఈనాడు, అన్నదాత పత్రికల్లో వందలాది వ్యాసాలు రాశారు. వీరి కృషిని గుర్తించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో సంస్ధలు అవార్డులు ప్రధానం చేశాయి. రైతుల అభ్యున్నతి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా 1994లో ప్రతిష్ఠాత్మక డాక్టర్‌ నాయుడమ్మ అవార్డును, డా.సికే.రావు ట్రస్టు పురస్కారం, డా.రఘోత్తమరెడ్డి అవార్డు తదితర ఎన్నో పురస్కారాలు అందుకున్నారు.

రైతు సేవలో విరామమెరుగని నిత్యకృషీవలుడుగా, రైతు బాంధవుడిగా అన్నదాతల మనసులను గెలుచుకున్న డాక్టర్‌ వాసిరెడ్డి నారాయణరావు అకాలమరణం పట్ల ఈనాడు గ్రూపు ఛైర్మన్‌ రామోజీరావు తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి సంతాపం

వాసిరెడ్డి నారాయణరావు మృతికి ముఖ్యమంత్రి జగన్​ సంతాపం తెలిపారు. అన్నదాత సేవలో విశేష కృషి చేశారని కొనియాడారు.

ఇదీ చదవండి:అచ్చెన్నాయుడి కిడ్నాప్​కు జగన్ బాధ్యత వహించాలి: చంద్రబాబు

Last Updated : Jun 12, 2020, 9:11 PM IST

ABOUT THE AUTHOR

...view details