- కాకినాడలో వంద పడకల ఆసుపత్రికి ఉద్యోగి కార్మిక రాజ్య బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) సూత్రప్రాయంగా ఆమోదించిందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ తెలిపారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
- విశాఖ ఉక్కు కర్మాగారంలో ఉద్యోగాలు దక్కని నిర్వాసితుల వారసుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం పునరావాస కార్డులో నమోదు చేస్తుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. విశాఖపట్నం, అనకాపల్లి ఎంపీలు ఎం.వి.వి.సత్యనారాయణ, బీశెట్టి వెంకటసత్యవతి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
- విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమైన ముడి ఇనుము సరఫరాకు సంబంధించి గనుల రిజర్వేషన్ బాధ్యతను ఉక్కు శాఖ తీసుకుందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. ముడి ఇనుము నిల్వలను రిజర్వు చేయాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలకు విశాఖ ఉక్కు కర్మాగారం విజ్ఞప్తి చేసిందని అన్నారు.
- 2016-17 నుంచి 2018-19 వరకు దేశంలో ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీలో 25,99,347, మెడికల్ సైన్సెస్‌లో 6,16,880, న్యాయశాస్త్రంలో 2,21,612, ఇతర విభాగాల్లో 1,59,12,901 మంది పట్టభద్రులయ్యారని కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ తెలిపారు. నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.
పోలవరానికి 1.11 లక్షల ఎకరాల సేకరణ:
పోలవరం నిర్మాణానికి 1.67 లక్షల ఎకరాలను గుర్తించగా 1.11 లక్షల ఎకరాలను సేకరించినట్లు కేంద్రం తెలిపింది. భూసేకరణకు రూ.11,317 కోట్ల అంచనా వ్యయం కాగా రూ.5570 కోట్లు ఖర్చు చేసినట్లు కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర జల్‌శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సోమవారం రాజ్యసభలో తెలిపారు. 1,05,601 కుటుంబాలకు పునరావాసం, పరిహారం కల్పించాల్సి ఉందని, ఇది 3922 కుటుంబాలకు పూర్తయిందని తెలిపారు. ఎర్త్‌కం రాక్‌ఫిల్ డ్యాం (ఈసీఆర్‌ఎఫ్ గ్యాప్-1) పనులు ఫిబ్రవరి 2021 నుంచి అక్టోబరు 2021 మధ్య చేయాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం సమాచారమిచ్చిందని తెలిపారు.
నిపుణుల కమిటీ నివేదిక:
ఏపీలో మేజర్ పోర్టు ఏర్పాటుకు సంబంధించి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చినట్లు కేంద్రం తెలిపింది. పోర్టు ఏర్పాటుకు సంబంధించి తగిన స్థలాలు గుర్తించాలని.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తే మంచిదని పేర్కొందని భాజపా సభ్యుడు వైఎస్ చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి మన్సుఖ్‌లాల్ మాండవీయ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.