కరోనా ప్రభావం రాష్ట్ర రెవెన్యూపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి రెండు త్రైమాసికాల్లో రాష్ట్ర రెవెన్యూ గణనీయంగా పడిపోయింది. గతేడాది ఇదే కాలానికి పోలిస్తే ప్రస్తుతం పదివేల కోట్ల రూపాయల మేర తగ్గుదల నమోదైంది. అసలే అప్పుల కుప్పగా మారుతున్న రాష్ట్రానికి ఆదాయం కోల్పోవటం తలనొప్పిగా పరిణమిస్తోంది. దీంతో ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రభుత్వం వివిధ మార్గాల్ని అన్వేషిస్తోంది.
2020-21 ఆర్ధిక సంవత్సరంలో ఏప్రిల్ నెలకుగానూ వివిధ శాఖల ద్వారా వచ్చిన ఆదాయం 3062 కోట్లుగా నమోదైంది. 2019తో పోలిస్తే దాదాపు 100 కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది. ఇక మే 2020కి వచ్చిన ఆదాయం 3683 కోట్లుగా తేలింది. అటు జూన్ నెలకు 5 వేల 785 కోట్లు రెవెన్యూ రాబడి వచ్చింది. జూలైలో 6583 కోట్లు, ఆగస్టులో 5883 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఐదు నెలల కాలానికి 24 వేల 998.50 కోట్ల రూపాయల రెవెన్యూ వసూలు అయితే... 2019-20లో ఇదే కాలానికి 34939 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. దీంతో రాష్ట్ర రెవెన్యూ వసూళ్లు దాదాపు 10 వేల కోట్ల రూపాయల మేర తగ్గాయి.