ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తొలగింపు నుంచి..తిరిగి బాధ్యతలు చేపట్టేవరకు..! - ఏపీ ఎన్నికల కమిషనర్ వార్తలు

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్​ మళ్లీ నియమితులయ్యారు. అనూహ్య పరిస్థితుల్లో కమిషనర్ పదవి నుంచి తొలగింపునకు గురైన ఆయన .. హైకోర్టు తీర్పుతో తిరిగి అదే స్థానానికి వచ్చారు. హడావిడిగా ప్రత్యేక ఆర్డినెన్స్ తెచ్చి మరీ నిమ్మగడ్డను తొలగించిన ప్రభుత్వానికి హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. ఆర్డినెన్స్ ను కొట్టివేస్తూ.. తీర్పిచ్చిన హైకోర్టు.. ఈ విషయంలో జారీ అయిన జీవోలన్నీ రద్దవుతాయని చెప్పింది. కోర్టు తీర్పుతో కొత్త ఎస్ఈసీ కనగరాజ్ పదవి నుంచి తొలగినట్లే. అసలు ప్రభుత్వం అంత హడావిడిగా రమేశ్​కుమార్ ను ఎందుకు తొలగించింది...? వివాదానికి కారణమేంటి..? తొలగించిన తర్వాత పరిణామాలేంటి.. ? ఇవన్నీ ఆసక్తికరం..

andhrapradesh high court
andhrapradesh high court

By

Published : May 29, 2020, 1:53 PM IST

Updated : May 30, 2020, 9:40 AM IST

రాష్ట్ర ఎన్నికల కమిషనర్​ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎస్‌ఈసీ నియామకం విషయంలో నిబంధనలు మారుస్తూ ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్​ను రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రభుత్వం తెచ్చిన జీవోలన్నీ రద్దు చేసింది. రమేశ్ కుమార్​ను తిరిగి కమిషనర్​గా నియమించాలని ఆదేశించింది. ఆర్టికల్ 213 ప్రకారం ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్డినెన్స్‌ ఇచ్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది.

వివాదం మొదలైంది ఇక్కడే....!

కరోనా వైరస్‌ విస్తరిస్తుండటంతో రాష్ట్రంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు ఎస్​ఈసీ రమేశ్ కుమార్ మార్చి 15న ప్రకటించారు. ఆయన నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్ స్వయంగా మీడియా సమావేశం నిర్వహించి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ప్రభుత్వంలోని మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తీవ్ర పదజాలంతో విమర్శల వర్షం గుప్పించారు. ప్రభుత్వాన్ని, వైద్యఆరోగ్యశాఖను సంప్రదించకుండా ఎస్‌ఈసీ ఏకపక్షంగా ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఎస్​ఈసీగా ఉన్న రమేశ్​కుమార్​ను ఆ పదవి నుంచి ఎలా తొలగించాలో తమకు తెలుసంటూ...ప్రభుత్వ సలహాదారు సజ్జల, వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు వ్యాఖ్యలు కూడా చేశారు.

పదవీకాలం తగ్గిస్తూ ఆర్డినెన్స్​..!

నిమ్మగడ్డ రమేశ్​ను ఎస్​ఈసీ పదవి నుంచి తొలగించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్​ ప్రయోగించింది. ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన సెక్షన్-200లో మార్పులు చేస్తూ ఆర్డినెన్స్‌ తెచ్చింది. అందులోని వివరాలను పొందుపరుస్తూ జీవో-617 ద్వారా నోటిఫికేషన్ విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వారు మాత్రమే ఎస్​ఈసీ పదవికి అర్హులని ప్రభుత్వం పేర్కొంది. ఐదేళ్ల పదవీకాలం మూడేళ్లకు కుదించిన ప్రభుత్వం... మూడేళ్ల పాటు ఎన్నికల కమిషనర్‌గా పని చేసినవారు మరో మూడేళ్లు కొనసాగే వెసులుబాటు కల్పించింది. ఆరేళ్లకు మించి పదవిలో కొనసాగేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

పదవీ కాలం ముగిసింది...

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీకాలం అర్ధంతరంగా ముగిసింది. ఆర్డినెన్స్‌, నోటిఫికేషన్‌ ప్రకారం ఆయన పదవీకాలం ముగిసిందంటూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పంచాయతీరాజ్‌ చట్టంలోని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నియామకానికి చేసిన సవరణ ఆర్డినెన్స్‌కు సంబంధించి కూడా ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది.

వెంటనే గవర్నర్ ఆమోదం

ఎస్​ఈసీ పరిణామాలపై ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ గవర్నర్‌ను కలిసి ఈ అంశాలను వివరించారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్ర వేయడం, ఉత్తర్వుల జారీ చకచకా జరిగిపోయాయి. ఇక కొత్త ఎస్​ఈసీగా పొరుగు రాష్ట్రానికి చెందిన విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కనగరాజ్ పేరును సూచిస్తూ... గవర్నర్‌ ఆమోదం కోసం పంపింది. వెంటనే ఆయన ఆమోదముద్ర వేశారు.

కోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ

ఎస్​ఈసీ పదవి నుంచి తనని తొలగించడంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్​ హైకోర్టును ఆశ్రయించారు. తనను దురుద్దేశంతోనే బాధ్యతల నుంచి తప్పించారని పిటిషన్​లో పేర్కొన్నారు. నిష్పాక్షిక ఎన్నికల నిర్వహణకు ఆర్డినెన్స్ తెచ్చామన్న ప్రభుత్వ వాదనలో వాస్తవం లేదని వివరించారు. ఎస్​ఈసీ పదవీ కాలంపై ప్రభుత్వం వేసిన అఫిడవిట్‌కు హైకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్​ రిప్లై అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్‌ఈసీ పదవీకాలం కుదింపు ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని అఫిడవిట్​లో పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్, పదవీకాలానికి రాజ్యాంగ రక్షణ ఉంటుందని ప్రస్తావించారు.

ఎస్​ఈసీ విషయంలో ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందని హైకోర్టులో వాదించింది. కొత్త ఎస్‌ఈసీ జస్టిస్‌ వి.కనగరాజ్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.ఎస్‌.ప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌ చట్ట నిబంధనలకు లోబడి ఉందన్నారు. ఇంప్లీడ్‌ పిటిషనర్ల తరఫున న్యాయవాదులు.. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ వాదనలు వినిపించారు.

నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డీవీ సీతారామమూర్తి, ఇతర పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, ఎ.సత్యప్రసాద్‌, పి.వీరారెడ్డి ప్రతి సమాధానంగా(రిప్లై) వాదనలు వినిపించారు. ''ఆర్డినెన్స్‌ తీసుకొచ్చే అత్యవసర పరిస్థితులు లేవన్నారు. ప్రభుత్వం తన చర్యను ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. రమేశ్‌కుమార్‌ను ఎస్‌ఈసీగా తొలగించడం కోసమే ఆర్డినెన్స్‌ తెచ్చారన్నారు. ఆర్డినెన్స్‌, తదనంతర జీవోలను రద్దు చేయాలని'' కోరారు.

సంచలన తీర్పు...

ఇరువైపు వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు..ఇవాళ తుది తీర్పును వెలువరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం ఆర్డినెన్స్​ను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఎస్​ఈసీ నియామకం చెల్లదంటూ చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్​ కుమార్ నే కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

విధుల్లో చేరిన రమేశ్ కుమార్...

కోర్టు ఆదేశాలకనుగుణంగా రమేశ్ కుమార్ తిరిగి ఎస్​ఈసీగా బాధ్యతలు చేపట్టారు. గతంలోనే మాదిరిగానే తన విధులను నిష్పక్షపాతంగా నిర్వర్తిస్తానని ఓ ప్రకటనలో తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు తిరిగి నేను విధుల్లో చేరాను. గతంలో వ్యవహరించిన మాదిరిగానే నేను నా విధులను నిష్ప క్షపాతంగా నిర్వర్తిస్తాను. పరిస్థితులు చక్కబడిన వెంటనే రాష్ట్రంలో ఆగిపోయిన ఎన్నికల ప్రక్రియను తిరిగి చేపడతాను. ఇందులో భాగస్వామ్యమైన వ్యక్తులతో రాజకీయ పార్టీలతో చర్చించిన మీదట ముందుకెళ్తాం. వ్యక్తులు ఎప్పుడూ శాశ్వతం కాదు... రాజ్యాంగ వ్యవస్థలు, అవి పాటించే విలువలే శాశ్వతం. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని ప్రమాణం చేసి ఆ పదవుల్లోకి వచ్చిన వారికి ఆ వ్యవస్థలను రక్షించాల్సిన ఆవశ్యకత, వాటి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంటాయి. - నిమ్మగడ్డ రమేశ్ కుమార్

ఇదీ చదవండి:

ప్రభుత్వానికి షాక్.. ఎస్​ఈసీగా మళ్లీ రమేశ్​ కుమార్ నియామకం

Last Updated : May 30, 2020, 9:40 AM IST

ABOUT THE AUTHOR

...view details