మాజీమంత్రి అచ్చెన్నాయుడి బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది . సాక్ష్యులను ప్రభావితం చేయరాదని, కేసు దర్యాప్తునకు సహకరించాలని పిటిషనర్‌ను ఆదేశించింది. రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో పాటు దేశం విడిచి వెళ్లరాదని నిబంధన విధించింది.
ఈఎస్ఐ కేసులో అరెస్టు
ఈఎస్ఐ ఔషధాల కొనుగోలు, టెలీ సర్వీసెస్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో మాజీ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును ఈ ఏడాది జూన్12 న ఉదయం 7:20 గంటలకు అవినీతి నిరోధక శాఖ అరెస్ట్ చేసింది. 2014-2019 మధ్య ఈఎస్‌ఐ ఆసుపత్రులకు రూ.988.77 కోట్లు కొనుగోలులో రూ.150కోట్లు అవినీతి జరిగినట్లు అనిశా అభియోగం మోపింది. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి ఆయన్ను అరెస్ట్ చేసి నేరుగా విజయవాడకు తరలించారు. అర్థరాత్రి విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఇంటివద్ద హాజరుపరిచి విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. అప్పటికే అచ్చెన్నాయుడు శస్త్రచికిత్స చేయించుకుని ఉండటం.. వందల కిలోమీటర్లు దూరం కారులో ప్రయాణించటంతో రక్తస్రావం జరిగింది. దీనిపై కోర్టులో ఆయన తరపు న్యాయవాదులు న్యాయమూర్తికి వివరించటంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించాలని ఆదేశించారు.
వాదనలు వినిపించిన సుప్రీంకోర్టు న్యాయవాది
మాజీ మంత్రి అచ్చెన్నాయుడు తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్ద లూత్ర వాదనలు వినిపించారు. అరెస్ట్ చేసి రెండు నెలలకు పైనే అయిందన్నారు. ప్రస్తుతం జైళ్లలో కరోనా విలయతాండవం చేస్తుందని....వందల మంది ఖైదీలకు కరోనా సోకిందని ప్రస్తావించారు. ప్రస్తుతం మాజీమంత్రి సైతం కరోనా చికిత్స పొందుతున్నారని వాదనలు వినిపించారు. రాజకీయ దురద్దేశంతో ఆయన్ను అరెస్ట్ చేశారని పిటిషనర్ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దర్యాప్తునకు పిటిషనర్ సహకరిస్తారని కోర్టుకు తెలిపారు. ఈఎస్ఐ కేసులో మంత్రికి సంబంధం లేదన్నారు. అచ్చెన్నాయుడికి బెయిల్ ఇస్తే కేసుపై ప్రభావం పడుతుందని..ఇంకా విచారణ దశలోనే ఉందని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులను అరెస్ట్ చేయాలని ఈ తరుణంలో బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది .
అచ్చెన్న కేసులో ఎప్పుడేం జరిగిందంటే:
- జూన్ 12 ఉదయం 7.20 నిమిషాలకు అచెన్నాయుడు అరెస్ట్... విజయవాడ తరలింపు
- జూన్ 13 ఉదయం 4 గంటలకు విజయవాడ జైలు నుంచి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- జులై 1 రాత్రి ఒంటి గంటకు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి విజయవాడ జైలుకు తరలింపు
- జులై 9 వరకు విజయవాడ జైలులో రిమాండ్‌లో ఉన్న అచ్చెన్నాయుడు
- జులై 9న హైకోర్టు ఆదేశాల మేరకు రాత్రి 7.30 ని.లకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు రమేశ్ ఆసుపత్రికి తరలింపు
- ఆసుపత్రిలో వైద్యం పొందుతుండగా కరోనా సోకడంతో ఈ నెల 22 ఎన్నారై ఆసుపత్రికి తరలింపు
- ఆగస్టు 28న షరతులతో కూడిన బెయిల్ మంజూరు
ఇదీ చదవండి
'రఘురామకృష్ణరాజును డిస్‌క్వాలిఫై చేయాలని స్పీకర్‌కు వినతిపత్రం ఇచ్చాం'