ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

గ్రీన్ ఎనర్జీ సంస్థ ఏర్పాటు వెనుక ఆలోచన ఇదే! - పీపీఏలపై ఏపీ ప్రభుత్వం సమీక్ష వార్తలు

ప్రతిపాదిత సౌర విద్యుత్తు ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే 10 వేల మెగావాట్ల విద్యుత్తును పూర్తిగా రాష్ట్రంలోనే వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కంపెనీ లిమిటెడ్​ను ఏర్పాటు చేసింది. దీని పరిధిలో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టుల్లో.. పూర్తి వాటా రాష్ట్రానికే దక్కనుంది.

andhrapradesh govt  has set up green energy company limited.
andhrapradesh govt has set up green energy company limited.

By

Published : Feb 17, 2020, 8:57 AM IST

సౌర విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిపాదిత ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే 10 వేల మెగావాట్ల విద్యుత్తును.. రాష్ట్రానికే వినియోగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా.. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సెకీ)కు 50 శాతం వాటా ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఏపీజీఈసీఎల్‌)ను ఏర్పాటు చేసింది.

ప్రస్తుతం ఉన్న రాష్ట్ర సోలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఈసీఎల్‌) ద్వారా ఏర్పాటయ్యే సౌర విద్యుదుత్పత్తి ప్రాజెక్టుల్లో 50 శాతం సెకీకి వాటా ఇవ్వాల్సి వస్తోంది. అలాగే.. గతంలో ఏర్పాటు చేసిన సోలార్‌ ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సెకీ నిర్ణయానికి అనుగుణంగా వ్యవహరించాలి. బహిరంగ టెండర్ల ద్వారా ప్రాజెక్టు పనులను అప్పగిస్తుంది. గుత్తేదారులనూ ఆ సంస్థే నిర్ణయిస్తుంది. వాటితో ఒప్పందం చేసుకునే అధికారం మాత్రమే రాష్ట్రానికి ఉంది.

ఏపీజీఈసీఎల్‌ ఏర్పాటుతో..

ఆంధ్రప్రదేశ్‌ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ కంపెనీ పరిధిలో ఏర్పాటు చేసే సోలార్‌ ప్రాజెక్టుల్లో పూర్తి వాటా రాష్ట్రానికే దక్కనుంది. ప్రాజెక్టుల ఏర్పాటుకు సంబంధించి టెండర్ల పక్రియ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుంది. ప్రాజెక్టుల నిర్మాణానికి నిధులు సమకూర్చుకోవటం.. అవసరమైన ఒప్పందాలు మొత్తం రాష్ట్రం పరిధిలో ఉంటాయి. పీపీపీ విధానంలో వెళ్లాలా? ప్రభుత్వమే సొంతంగా నిధులు సమకూర్చుకోవాలా? అనే నిర్ణయాన్ని తీసుకునే వెసులుబాటు కలుగుతుంది.

సౌర విద్యుత్‌ ప్రాజెక్టు సమగ్ర స్వరూపం

  • విద్యుత్తు ఉత్పత్తి లక్ష్యం: 10 వేల మెగావాట్లు
  • అంచనా వ్యయం: రూ.40 వేల కోట్లు
  • అవసరమైన భూమి: 50 వేల ఎకరాలు. ఇందులో సుమారు 40 వేల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది ఉంది.
  • ఏయే జిల్లాల్లో ఏర్పాటు: అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు, ప్రకాశం
  • దేని కోసం: వ్యవసాయానికి అందించే ఉచిత విద్యుత్తు సరఫరాకు
  • ప్రభుత్వానికి ఏంటి లబ్ధి: ఏటా రూ.10 వేల కోట్లను వ్యవసాయ విద్యుత్తు రాయితీగా ప్రభుత్వం భరిస్తోంది. సొంత ప్రాజెక్టు ఏర్పాటుతో ఇంత మొత్తం ఆదా కానుంది.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు కావలెను..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details