ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కలానికి కేసుల కళ్లెం - ycp govt media cases news

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పత్రికలు, టీవీ ఛానళ్లు నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక మాధ్యమాల్లో పెట్టే పోస్టులపైనా చర్యలు తీసుకోనుంది.

andhrapradesh govt go about media

By

Published : Oct 31, 2019, 6:59 AM IST

Updated : Oct 31, 2019, 7:22 AM IST

ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేలా పత్రికలు, టీవీ ఛానళ్లు నిరాధార వార్తలు ప్రచురించినా, ప్రసారం చేసినా కేసులు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ వార్తలు, కథనాలు నిరాధారమైనవని భావిస్తే, సంబంధిత ప్రచురణకర్తలు, సంపాదకులపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకే కట్టబెట్టింది. ఈ మేరకు సమాచార, పౌర సంబంధాల శాఖ ఎక్స్‌అఫీషియో స్పెషల్‌ సెక్రటరీ టి.విజయ్‌కుమార్‌రెడ్డి పేరుతో బుధవారం ఉత్తర్వులు (జీవో ఆర్‌టీ నెం.2430) జారీ అయ్యాయి.
‘‘ప్రభుత్వం, అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా పత్రికలు, ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో నిరాధార కథనాలు ప్రచురించినా, ప్రసారం చేసినా వాటిని ఖండిస్తూ ఆయా శాఖల కార్యదర్శులు ఖండన ఇవ్వాలి. సంబంధిత చట్టాలను అనుసరించి పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ ద్వారా ఫిర్యాదులు చేయాలి. కేసులు పెట్టాలి’’ అని ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది.
పత్రికలు, టీవీ ఛానళ్లలో నిరాధార వార్తలు వస్తే కేసులు పెట్టేందుకు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2007 ఫిబ్రవరి 20న జీవో (జీవో ఆర్‌టీ నెం.938) జారీ చేశారు. దానిపై అప్పట్లో వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఆ తర్వాత ప్రభుత్వం ఆ జీవోని అమలు చేయకపోయినా, రద్దు చేయలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఆ జీవోకి మరింత పదును పెడుతూ ఈ నెల 16న జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. దాని ప్రకారమే తాజా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
‘‘ప్రభుత్వం, అధికారుల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కొన్ని పత్రికలు, ఛానళ్లు, సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా వార్తలు వస్తున్నాయి. అలాంటి తప్పుడు, నిరాధార వార్తలు ప్రచురించేవారిపై చర్యలు తీసుకోవడానికి 2007లో ప్రభుత్వం జీవో ఆర్టీ నెం.938 తీసుకొచ్చింది. వివిధ సెక్షన్ల ప్రకారం వారిపై చర్యలు తీసుకునే అధికారాన్ని సమాచార శాఖ ప్రత్యేక కార్యదర్శికి కట్టబెట్టింది. కానీ ప్రభుత్వ శాఖలపై వచ్చే నిరాధార వార్తలపై ఆయా శాఖల కార్యదర్శులకే ఎక్కువ అవగాహన ఉంటుంది. వాటిలోని నిజానిజాలు విచారించేందుకు వారికి అధికారం ఉంటుంది. కాబట్టి కేసులు పెట్టే అధికారాన్నీ వారికే ఇస్తున్నాం’’ అని ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. నిజమైన, కచ్చితమైన సమాచారం ప్రజలకు చేరాలన్న ఉద్దేశంతోనే ఈ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపింది.

భావవ్యక్తీకరణ స్వేచ్ఛపై దాడే
ఈ జీవో ప్రజల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను హరించేలా ఉంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో దీన్ని తెచ్చారు. ప్రశ్నించడం, ప్రభుత్వ వైఫల్యాలను ప్రస్తావించడం ప్రజాస్వామ్యంలో ప్రాథమిక హక్కు. సామాజిక మాధ్యమాల్లో ప్రజల గొంతు నొక్కేలా, తప్పుడు కేసులతో మీడియా సంస్థలను వేధించేలా జీవో ఉంది. అవసరమైతే దీన్ని రద్దు చేసేదాకా పోరాడతాం.
- ట్విటర్‌లో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం
ప్రజాస్వామ్య మూలస్తంభాల్లో మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఉత్తర్వును వెంటనే రద్దు చేయాలి.
- పవన్‌కల్యాణ్‌, జనసేన అధినేత

తప్పులు బయటకు రాకూడదనే
ప్రభుత్వ తప్పులు బయటకు రాకుండా చేయాలనే ఉద్దేశంతోనే వైకాపా ప్రభుత్వం ఈ తరహాలో వ్యవహరిస్తోంది. అవినీతి రహిత, పారదర్శక పాలన అందిస్తామని.. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైకాపా 5 నెలల వ్యవధిలోనే వరుస తప్పులు చేస్తోంది.
- కన్నాలక్ష్మీనారాయణ, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి:తప్పుడు వార్తలు రాస్తే కేసులే...!

Last Updated : Oct 31, 2019, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details