ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వచ్చింది రూ.41వేల కోట్లు,  ఖర్చు 43వేల కోట్లు - ఏపీ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌, మే నెలల కరోనా కష్టకాలంలో కేంద్రసాయం, రుణాలు కలిపి ఆర్థిక అవసరాలను గట్టెక్కించాయి. మే 27 వరకు ఉన్న లెక్కల ప్రకారం గడిచిన రెండు నెలల్లో దాదాపు రూ.41,901 కోట్ల వరకు రాష్ట్ర మొత్తం వసూళ్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

andhrapradesh financial situation
andhrapradesh financial situation

By

Published : Jun 3, 2020, 8:06 AM IST


ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్‌, మే నెలల కరోనా కష్టకాలంలో కేంద్రసాయం, రుణాలు కలిపి ఆర్థిక అవసరాలను గట్టెక్కించాయి. రాష్ట్ర సొంత ఆదాయాలు నెలకు రూ.1300 కోట్లకు అటూ ఇటూ ఉండగా.. కేంద్రం నుంచి దాదాపు సగటున రూ.4000 కోట్లపైనే నిధులు అందాయి. మరోవైపు అంతర్గత రుణం, ప్రజాపద్దు కలిసి బండిని ముందుకు నడిపించాయి. మే 27 వరకు ఉన్న లెక్కల ప్రకారం గడిచిన రెండు నెలల్లో దాదాపు రూ.41,901 కోట్ల వరకు రాష్ట్ర మొత్తం వసూళ్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. (స్పష్టమైన లెక్కలు తేలిన తర్వాత అంకెలు కొంత మారవచ్చు). ఏప్రిల్‌ నెల మొత్తానికి రూ.7,224 కోట్లు రెవెన్యూ వసూళ్లుగా లెక్కించగా అన్నీ కలిపి రూ.24,879 కోట్ల ఆదాయంగా చూపారు. అదే సమయంలో మే 27 వరకు ఈ మొత్తం రూ.17,022 కోట్ల వరకు ఉంది.

ఖర్చు రూ.43,594 కోట్లు
మరోవైపు ఏప్రిల్‌, మే నెలల్లో ఇంతవరకు ఉన్న సమాచారం మేరకు మొత్తం రూ.41,901 కోట్లు వసూళ్లుగా చూపగా అంతకన్నా ఎక్కువగా రూ.43,594 కోట్ల వరకు ఖర్చయింది. ఇందులో రెవెన్యూ ఖర్చు రూ.36,292 కోట్లు కాగా, జీతాల కోసం రూ.6093 కోట్లు ఖర్చుచేశారు.

కేంద్రం ఆసరా..
ఈ రెండు నెలల్లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.8,909 కోట్లు దక్కింది. పన్నుల్లో వాటా రూ.3,690 కోట్లు వచ్చింది. ఇతరత్రా కేంద్రసాయం రూ.5,218 కోట్లు చేరింది. ఇందులో కేంద్రప్రభుత్వ పథకాలకు అందించే నిధులు, ఆర్థిక సంఘం గ్రాంట్లు ఉన్నాయి. ఆర్థిక సంఘం గ్రాంట్లుగా రూ.1,791 కోట్లు దక్కింది. ఇందులో రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు కేటగిరీలో రూ.982 కోట్లు వచ్చింది. రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధులు రూ.560 కోట్లు దక్కాయి. కేంద్రం నుంచి మే నెలలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.249 కోట్లు వచ్చాయి.

అంతర్గత రుణం రూ.10,819 కోట్లు
మరోవైపు అంతర్గత రుణం కింద పెద్ద మొత్తమే రాష్ట్రం తీసుకుంది. ఇందులో ఏప్రిల్‌ నెలలో రూ.4,999 కోట్లు రాగా మే నెలలో రూ.5,812 కోట్లు రుణంగా పొందింది. ప్రజాపద్దు రూపంలో మొత్తం రూ.19,231 కోట్లు దక్కినట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. పి.డి.ఖాతాల్లో ఉన్న మొత్తం, ప్రావిడెంట్‌ ఫండ్‌, స్థానికసంస్థల ద్వారా వసూలయ్యే పన్నులు, ఇతరత్రా మొత్తాలు, డిపాజిట్లు, అడ్వాన్సుల రూపంలో ఉన్న మొత్తాన్ని ప్రజాపద్దుగా పరిగణిస్తారు.

ఇదీ చదవండి:

కువైట్‌లో కష్టాల్లో 1900 మంది ప్రవాసాంధ్రులు

ABOUT THE AUTHOR

...view details