అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో భాగంగా విజయవాడలో పోలీసు మహిళా సిబ్బందికి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. పిల్లలను లింగ వివక్ష లేకుండా పెంచాలని తల్లిదండ్రులకు పోలీసు కమిషనర్ సూచించారు. నందిగామలో పోలీసు మహిళా సిబ్బంది కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నూజివీడులో విద్యార్థినిలు, వివిధ మహిళా సంఘాలు కాగడాల ప్రదర్శన చేశారు. గుడివాడలో జిల్లా ఎస్పీ రవీంద్రబాబుతో పాటు సబ్ డివిజన్ పోలీస్ సిబ్బంది, సచివాలయ మహిళా సంరక్షణ కార్యదర్శులు కలిసి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
రాష్ట్రవ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ
కాగడాల ప్రదర్శన..
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నంలో మహిళా పోలీసులు వారి కుటుంబసభ్యులకు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గుంటూరులో పోలీసుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తాడికొండలో జరిగిన ర్యాలీలో ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు. వినుకొండలో ప్రధాన వీధుల గుండా కాగడాల ప్రదర్శన నిర్వహించారు. నరసరావుపేటలో డీఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థినిలు పల్నాడు రోడ్ నుంచి మల్లమ్మ సెంటర్ వరకూ క్యాండిల్లతో ప్రదర్శన చేశారు.
పెద్ద ఎత్తున మహిళల మానవహారం..
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరంలో పోలీసులు భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. వైద్యులు క్యాన్సర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకినాడలో జాయింట్ కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో విద్యార్థులు మానవహారం చేశారు. మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని.. నరసాపురంలో నిర్వహించిన అవగాహన ర్యాలీలో సబ్ కలెక్టర్ విశ్వనాథ్ అన్నారు. ఏలూరు ఇండోర్ స్టేడియంలో మహిళా లోగో చుట్టూ మహిళలు పెద్దఎత్తున మనవహారంగా ఏర్పడి కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. నెల్లూరులో పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థులు కాగడాల ప్రదర్శన చేశారు. కందుకూరులో మహిళా పోలీసులు క్యాండిల్ల ప్రదర్శన నిర్వహించారు.