అక్కడక్కడా ఘర్షణలు, కొట్లాటలు, దాడులు.. అధికార, విపక్ష శ్రేణుల వాదోపవాదాలు, తోపులాటల మధ్య రాష్ట్రంలో పురపాలక ఎన్నికల పోలింగు ప్రక్రియ పూర్తయింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో 62.28 శాతం ఓటింగ్ నమోదైంది. తూర్పు గోదావరి జిల్లాలో గరిష్ఠంగా 75.93%, కర్నూలు జిల్లాలో కనిష్ఠంగా 55.87% పోలింగు నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
పోలింగు శాతాన్ని పెంచేందుకు ఎన్నికల సంఘం అనేక ఏర్పాట్లు చేసినా డివిజన్లు, వార్డుల పునర్విభజనతో ఎవరి ఓట్లు ఎక్కడున్నాయో తెలియక చాలాచోట్ల గందరగోళం నెలకొంది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన కొందరు.. తమ ఓటు అక్కడ లేక చాలామంది వెనుదిరిగారు. ఓటరు చిట్టీల పంపిణీ సరిగా జరక్కపోవడంతో చాలామంది ఇళ్ల నుంచి బయటకే రాలేదు.
పలుచోట్ల ప్రతిపక్షాల నిరసనలు..
వైకాపా నాయకులు దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు పలుచోట్ల నిరసనలు తెలిపారు. అధికార పార్టీ అభ్యర్థుల్ని పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతిస్తూ తమను మాత్రం అధికారులు అడ్డుకుంటున్నారని ఆందోళనలకు దిగారు. పోలీసులే వైకాపా అభ్యర్థులకు కొమ్ముకాస్తున్నారంటూ మరికొన్ని చోట్ల వివాదాలు చెలరేగాయి. గుంటూరులో వైకాపా నేత మోదుగుల వేణుగోపాలరెడ్డి బ్యాలెట్ బాక్సులు నేలకేసి కొట్టేందుకే ప్రయత్నించారంటూ తెదేపా పోలింగ్ ఏజెంట్లు అడ్డుకోవడంతో తోపులాట చోటుచేసుకుంది. వేణుగోపాలరెడ్డి వాహనంపై కొంతమంది రాళ్లు విసిరి అద్దాలు పగలగొట్టడంతో తీవ్రఉద్రిక్తత నెలకొంది.
మాజీ ఎమ్మెల్యే కారు అద్దాలు ధ్వంసం..