ముఖ్యమంత్రిగా ముప్ఫై సంవత్సరాలు రాజ్యం చేయడమే తన ‘బలమైన కోరిక’గా చెప్పుకొన్న జగన్మోహనరెడ్డి- మూడేళ్లలోనే ఆంధ్రప్రదేశ్‌ను దివాలా అంచులకు ఈడ్చుకుపోయారు. ‘నమ్మితి జగనన్న అంటే నట్టేట ముంచుతాను ఉండన్నా’ అన్నట్లుగా పరిపాలిస్తూ, తనకు ఓట్లు వేసి అధికారాన్ని అప్పగించిన నేరానికి ప్రజలకు భవిష్యత్తే లేకుండా చేస్తున్నారు. ఆర్థిక కార్యకలాపాల్లో జవాబుదారీతనానికి సమాధి కడుతున్న ఆయన సర్కారు- మార్చి నెలాఖరు నాటికి రాష్ట్రంపై మొత్తం చెల్లింపుల భారాన్ని రూ.7.76 లక్షల కోట్లకు చేర్చింది. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో సుమారు 76శాతమైన ఆ బరువు ఏపీ ఆర్థిక సంక్షోభ తీవ్రతను కళ్లకుకడుతోంది. అప్పుల గుట్టుమట్లను రట్టుచేశారంటూ కొందరు అధికారులపై నిరుడు వేటువేసిన ఏలినవారు, పాలనలో పారదర్శకతపై అలవిమాలిన అయిష్టతను ప్రదర్శించారు. ప్రజాధనానికి ప్రభుత్వం ధర్మకర్తగా వ్యవహరించాలి. సుస్థిరాభివృద్ధి, సామాన్య జనసంక్షేమాలకు దాన్ని జాగ్రత్తగా వెచ్చించాలి. జగన్ ఏలుబడిలో ఆ స్ఫూర్తి పూర్తిగా కొల్లబోతోంది. 204, 205 రాజ్యాంగ అధికరణలను ఉల్లంఘించి, శాసనసభను దారితప్పించి నిధుల వ్యయంలో విశృంఖలంగా వ్యవహరిస్తోందంటూ ‘కాగ్’ లోగడే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టింది. ఏపీ సర్కారు పరిమితికి మించి అప్పులు చేసిందని నాలుగు నెలల క్రితం కేంద్రమూ పార్లమెంటులో పేర్కొంది. అక్కడి కార్పొరేషన్లకు రుణాలు మంజూరు చేసే మునుపు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించుకోవాలని ఇటీవలే జాతీయబ్యాంకులను హెచ్చరించింది.
వాస్తవాలు అలా ఉంటే- వైకాపా వర్గాలు మాత్రం అబద్ధాల మనిషికి అరవైనాలుగు అసత్య ప్రమాణాలన్న చందంగా దబాయిస్తున్నాయి. ప్రజల కళ్లకు గంతలు కట్టడానికి విఫలయత్నాలు చేస్తున్నాయి. ప్రజల జీవన ప్రమాణాల పెంపుదలకు దోహదపడని తాత్కాలిక తాయిలాలతో తీవ్ర అనర్థాలు తప్పవని పదిహేనో ఆర్థిక సంఘం అధ్యక్షులు ఎన్.కె.సింగ్ తాజాగా హెచ్చరించారు. అటువంటి రాజకీయ సంస్కృతి నిష్పూచీగా అలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తప్పదని నీతిఆయోగ్ సభ్యులు రమేష్‌చంద్ ఆందోళన వ్యక్తపరచారు. చేసిన అప్పులు తీర్చేందుకు మళ్లీ ఎవరో ఒకరి దగ్గర చేతులుచాచాల్సిన స్థితిలోనూ జగన్ ప్రభుత్వం పూర్తిగా ప్రజాకర్షక విధానాలకే పరిమితమవుతోంది. ప్రజలకు శాశ్వత లబ్ధి చేకూర్చే ఉపాధి అవకాశాల సృష్టి వంటివాటిని తన రాజకీయ ప్రయోజనాలకు అది పణంగా పెడుతోంది!