ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Cinema Tickets Issue: సినిమా టికెట్లపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు.. ఏంటంటే..?

By

Published : Dec 16, 2021, 12:15 PM IST

Updated : Dec 17, 2021, 4:54 AM IST

Cinema tickets issue
Cinema tickets issue

12:12 December 16

Cinema tickets issue:సినిమా టిక్కెట్ల ధరల వ్యవహారంపై హైకోర్టు ఆదేశాలు

Cinema tickets issue: సినిమా టికెట్ల ధరల వ్యవహారంలో ప్రేక్షకుల ప్రయోజనాలే తమకు ముఖ్యమని ప్రభుత్వానికి, థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు స్పష్టంచేసింది. ధరల విషయంలో సినీ పరిశ్రమ భాగస్వాములు, ప్రభుత్వాధికారులతో కొత్త కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలంది. ధరలను తామే నిర్ణయించే పరిస్థితి తీసుకురావద్దని వ్యాఖ్యానించింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది. కోర్టును ఆశ్రయించిన థియేటర్ల యాజమాన్యాలు ముందస్తు సమాచారం ఇచ్చి సంయుక్త కలెక్టర్‌(జేసీ)లను సంప్రదించిన తర్వాతే టికెట్‌ ధరలను ఖరారు చేయాలని స్పష్టంచేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. సినిమా టికెట్‌ ధరలను తగ్గిస్తూ ఈఏడాది ఏప్రిల్‌ 8న హోంశాఖ జారీచేసిన జీవో 35ను సవాలు చేస్తూ పలు సినిమా థియేటర్‌ యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యాల్లో హైకోర్టు సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. జీవో 35కు పూర్వం అనుసరించిన విధానాన్ని ధరల ఖరారు విషయంలో పాటించాలని పిటిషనర్లను ఆదేశించారు. ఆ ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్‌ వేసింది.

ప్రేక్షకులపైనే ధరల పెంపు ప్రభావం: ధర్మాసనం

ఈ సందర్భంగా ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. సినిమా విడుదలైన ప్రతీసారి ధరల వివాదం కోర్టుముందు వస్తోందని గుర్తుచేసింది. యాజమాన్యాలు, ప్రభుత్వం మధ్య జరుగుతున్న పోరాటంలో కోర్టును తెరపైకి తెస్తున్నారని నవ్వుతూ వ్యాఖ్యానించింది. ధరల ఖరారు విషయంలో లోపాలు జరుగుతున్నాయంది. అంతిమంగా ధరల పెంపు ప్రభావం చూపేది ప్రేక్షకులపైనే అని వ్యాఖ్యానించింది. ధరలు పెంచి యాజమాన్యాలు, పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వమూ సంతోషంగా ఉన్నారంది. నష్టపోయేది సినీ ప్రేక్షకులు మాత్రమేనంది. ధరలు అసాధారణంగా పెంచినా ప్రేక్షకులు తగ్గి నష్టపోతామనే విషయాన్ని యాజమాన్యాలు గుర్తించుకోవాలంది.

జీవో 35 అమలులోనే ఉంది
హోం శాఖ ముఖ్య కార్యదర్శి విశ్వజిత్‌

సినిమా టికెట్ల ధరలకు సంబంధించి గతంలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 35 అమలులోనే ఉందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్‌ స్పష్టంచేశారు. ఆ జీవోపై కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, మినహాయింపులు ఏమైనా ఉంటే వారికే వర్తిస్తాయన్నారు. వెలగపూడి సచివాలయంలో గురువారం సాయంత్రం తనని కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. టికెట్ల ధరలకు సంబంధించి ఎలాంటి కమిటీని నియమించలేదన్నారు.

ఇదీ చదవండి:

Last Updated : Dec 17, 2021, 4:54 AM IST

ABOUT THE AUTHOR

...view details