రాజధాని కేసులపై హైకోర్టులో వరుసగా మూడో రోజు కూడా విచారణ జరిగింది. పాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది శ్యాం దివాన్ వాదనలు వినిపించారు. విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రజల హక్కులకు భంగం కలిగితే కోర్టులు జోక్యం చేసుకోవచ్చన్నారు. ‘‘మూడు రాజధానులతో మౌలిక సదుపాయాల అభివృద్ధి దెబ్బతిందని వాదించారు. మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేయలేదని ప్రభుత్వం చెబుతోందని.. కానీ, మాస్టర్ ప్లాన్ అమలు చేయకుండా నిలిపివేశారని తెలిపారు. రైతులకిచ్చిన ప్లాట్లకు విలువ లేకుండా చేశారుని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు.
'విధాన నిర్ణయాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. 3 రాజధానులతో మౌలిక వసతుల అభివృద్ధికి దెబ్బ. మాస్టర్‌ప్లాన్‌లో మార్పులు లేవని ప్రభుత్వం చెప్పింది. మాస్టర్‌ప్లాన్ అమలు చేయకుండా నిలిపారు. రైతులకు ఇచ్చిన ప్లాట్లకు విలువ లేకుండా చేశారు' - శ్యాం దివాన్ ,సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది
న్యాయ రాజధానికి నిర్వచనం ఏమిటని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు అధికారం లేదని మరో న్యాయవాది సురేశ్ తెలిపారు. న్యాయ రాజధాని అన్న పదమే లేదన్నారు. విభజన చట్టం ప్రకారం అమరావతిలోనే హైకోర్టు ఉండాలన్నారు. అమరావతిలో హైకోర్టు ఏర్పాటుకు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. హైకోర్టు తరలింపు అంత సులభం కాదని వాదనలు వినిపించారు.