ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

HIGH COURT ON CAPITAL AMARAVATI : 'అభివృద్ధికి యథాతథ స్థితి ఉత్తర్వులు అడ్డంకి కాదు' - ఏపీ అమరావతి వివాదం అప్​డేట్స్​

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులు(Status co on amaravathi capital) అడ్డంకి కాదని హైకోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానం జోక్యంతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. హైకోర్టు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర వివరాలతో కోర్టు ముందు మెమో దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలన్నారు. దీంతో విచారణను డిసెంబర్‌ 27కు వాయిదా పడింది.

high court on amaravathi petitions
high court on amaravathi petitions

By

Published : Nov 29, 2021, 12:35 PM IST

Updated : Nov 30, 2021, 4:29 AM IST

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి గతంలో తామిచ్చిన యథాతథ స్థితి (స్టేటస్‌ కో) ఉత్తర్వులు అడ్డంకి కాదని హైకోర్టు(High court Hearing on amaravathi) స్పష్టం చేసింది. సీఆర్‌డీఏ చట్ట నిబంధనల మేరకు అభివృద్ధి కొనసాగించవచ్చని పేర్కొంది. స్టేటస్‌కో కారణంగా అమరావతిలో అభివృద్ధి నిలిచిపోవడాన్ని తాము కోరుకోవడం లేదని తెలిపింది. న్యాయస్థానం జోక్యంతో అమరావతిలో అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోయాయనే భావన కలగకుండా చూడాల్సిన బాధ్యత తమపై ఉందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ పాలనను తాము చేయాలనుకోవడం లేదని, వారి ప్రతి నిర్ణయాన్ని అనుమానించాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. అమరావతి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు, ఉద్యోగుల తరలింపు, ఇళ్ల స్థలాల కేటాయింపును నిలువరిస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు అమల్లోనే ఉంటాయని తేల్చిచెప్పింది. సీఆర్‌డీఏ రద్దు చట్టం, పాలన వికేంద్రీకరణ చట్టాలను ‘రద్దు’ చేస్తూ శాసనసభ, మండలి ఆమోదించిన బిల్లుకు గవర్నర్‌ సమ్మతి తెలపాల్సి ఉందని, ఆయన అనారోగ్యంతో ఉన్నారని పేర్కొంది.

విచారణ డిసెంబర్‌ 27కు వాయిదా...

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం కోసం ఈ నెల 25న బిల్లును గవర్నర్‌కు పంపించామన్నారు. రెండున్నరేళ్లుగా ప్రభుత్వం ఏం చేసింది, భవిష్యత్తులో ఏం చేయబోతోంది, హైకోర్టు వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలు తదితర వివరాలతో కోర్టు ముందు మెమో దాఖలు చేసేందుకు నాలుగు వారాల సమయం కావాలన్నారు. దీంతో విచారణను డిసెంబర్‌ 27కు వాయిదా వేస్తూ.. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి, జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.

కారణాలతో అఫిడవిట్ దాఖలు చేయండి...

రాజధాని వ్యాజ్యాలపై ఈ నెల 22న విచారణ సందర్భంగా ఏజీ జోక్యం చేసుకుంటూ సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం(Cabinet meeting on amaravathi capital) నిర్ణయం తీసుకుందని, ఆ విషయాన్ని ముఖ్యమంత్రి శాసనసభలో ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. బిల్లును సభలో ప్రవేశపెట్టబోతున్నారన్నారు. దీంతో ధర్మాసనం.. బిల్లుతో పాటు, దాన్ని తీసుకురావడానికి కారణాలతో అఫిడవిట్‌ వేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి అఫిడవిట్‌ దాఖలు చేశారు. బిల్లులను ఈ నెల 22న శాసనసభ, 23న శాసనమండలి ఆమోదించాయని పేర్కొన్నారు. సోమవారం ఈ వ్యాజ్యాలు త్రిసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి.

విచారణ కొనసాగించాలన్న పిటిషనర్లు...

రాజధాని రైతు పరిరక్షణ సమితి, తదితరుల తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌, పీబీ సురేశ్‌ వాదనలు వినిపిస్తూ.. బిల్లు ఇంకా చట్టం కాలేదన్నారు. గవర్నర్‌ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. ప్రభుత్వం సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ బిల్లు పెడుతున్నాం అంటూనే.. మరోవైపు మూడు రాజధానుల(Three capital) కోసం బిల్లు తెస్తామని చెబుతోందన్నారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలనేది తమ వాదన అన్నారు. అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యాల్లో అభ్యర్థించామన్నారు. వాటిపై విచారణను కొనసాగించాలని కోరారు. సీజే స్పందిస్తూ.. సీనియర్‌ న్యాయవాది శ్యాం దివాన్‌ ఇటీవల వాదనలు వినిపిస్తూ రాజధాని అమరావతిని ప్రభుత్వం ఘోస్ట్‌ సిటీగా మార్చిందన్నారని గుర్తుచేశారు. ఈ వ్యాజ్యాలను అపరిష్కృతంగా ఉంచితే అవి కూడా ‘ఘోస్ట్‌ పిటిషన్లు’గా మారతాయని వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ చర్యలు విచారణలో జోక్యం చేసుకోవడమే...

రాజధాని రైతులు మరికొందరి తరఫున న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.. తాము దాఖలు చేసిన వ్యాజ్యాల్లో కోరిన అభ్యర్థనలు ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. వాటిపై విచారణ కొనసాగించాలన్నారు. ‘ఈ వ్యాజ్యాలను తేల్చకుండా ప్రభుత్వం మూడుసార్లు ప్రయత్నం చేసింది. ఈ తరహా చర్యలు కోర్టు విచారణ ప్రక్రియలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడమే. మూడు రాజధానుల నిర్ణయంతో అమరావతికి భూములిచ్చిన సుమారు 200 మంది రైతులు కన్నుమూశారు. ప్రభుత్వ నిర్ణయంతో ఖజానాకు భారీగా నష్టం వాటిల్లింది. అందుకు బాధ్యులెవరు? అమరావతి మాస్టర్‌ ప్లాన్‌ను సవరించేందుకు చర్యలు చేపట్టిందన్నారు. వివిధ శాఖల కార్యాలయాలు, ఉద్యోగులను తరలించేందుకు గతంలో ప్రయత్నం చేయగా.. హైకోర్టు నిలువరిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది’ అన్నారు. ఆ ఉత్తర్వులు అమలులో ఉండేలా చూడాలని కోరారు.

చట్టాలు చేయకుండా నిషేధించలేం: ధర్మాసనం

న్యాయవాది పీబీ సురేశ్‌ స్పందిస్తూ.. బిల్లుకు గవర్నర్‌ ఆమోదం తెలుపుతారా? పునఃపరిశీలన చేయమని కోరతారా? రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారా అని పలు సందేహాలున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భవిష్యత్తులో మూడు రాజధానుల చట్టాన్ని తీసుకొస్తామని చెబుతోందన్నారు. ఆ వాదనలపై ధర్మాసనం స్పందిస్తూ.. ప్రభుత్వం చట్టాలు చేయకుండా నిషేధ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. అవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని విచారిస్తామని స్పష్టం చేసింది.

  • పిటిషనర్ల తరఫు మరో న్యాయవాది వాసిరెడ్డి ప్రభునాథ్‌ స్పందిస్తూ.. మూడు రాజధానుల చట్టాన్ని (పాలన వికేంద్రీకరణ) చేసే శాసనాధికారం గానీ, దాన్ని రద్దు చేసే అధికారం గానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తాజా బిల్లును సవాలు చేస్తూ వ్యాజ్యం వేస్తానన్నారు.
  • శాసనసభ కార్యదర్శి తరఫున న్యాయవాది మెట్టా చంద్రశేఖర్‌ వాదనలు వినిపిస్తూ.. సీఆర్‌డీఏ రద్దు, పాలన వికేంద్రీకరణ చట్టాలను రద్దు చేస్తూ ప్రభుత్వం చట్టసభల్లో పెట్టిన బిల్లు ఆమోదం పొందాక.. ఆ చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలు వ్యర్థమవుతాయన్నారు. కొత్త చట్టం తెచ్చినప్పుడు దానిపై అభ్యంతరాలుంటే సవాలు చేసుకోవచ్చన్నారు.
  • తెదేపా ఎమ్మెల్సీ అశోక్‌బాబు తరఫున సీనియర్‌ న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ స్పందిస్తూ.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని వ్యాజ్యంలో కోరామన్నారు. రాజధానుల విషయంలో శాసనం చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదన్నారు. తమ వ్యాజ్యంపై విచారణ కొనసాగించేందుకు అనుమతివ్వాలన్నారు.

ఇదీ చదవండి:

NTR University Funds Transfer: ఎన్టీఆర్‌ వర్సిటీ నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు ముమ్మరం

Last Updated : Nov 30, 2021, 4:29 AM IST

ABOUT THE AUTHOR

...view details