హైదరాబాద్కు 'కరోనా' రాకతో ఏపీ అప్రమత్తం - తెలంగాణలో కరోనా కేసు
తెలంగాణలో కరోనా(కొవిడ్-19) వైరస్ తొలి కేసు నమోదుకావటంతో ఏపీ అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్ తెలిపారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు.
హైదరాబాద్లో కరోనా వైరస్ తొలి కేసు నమోదు కావటంతో ఆంధ్రప్రదేశ్లోనూ మరింత అప్రమత్తత ప్రకటించామని వైద్యారోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. వైరస్ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటివరకు ఒక్క కేసు కూడా ఏపీలో నమోదు కాలేదని తెలిపారు. ఏపీలో నిరంతరం అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులపైనా నిరంతర నిఘా కొనసాగుతోందని చెప్పారు. విమానాశ్రయాలు, నౌకాశ్రయాల్లో పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ ప్రక్రియను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకూ 19 ప్రభావిత దేశాల నుంచి 263 మంది రాష్ట్రానికి వచ్చారని వీరందరినీ పరిశీలనలో ఉంచామని పేర్కొన్నారు. ప్రస్తుతానికి రాష్ట్ర ప్రజలు కరోనాపై గందరగోళానికి గురికావొద్దని ఆయన సూచించారు.