గ్రూప్-1 సహా మిగిలిన పోస్టుల భర్తీకి జరిగే ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇకపై జరిపే ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు ఉండబోవని స్పష్టం చేసింది. పారదర్శక చర్యల్లో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం.. వెంటనే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే గ్రూప్-1 మినహా మిగిలిన పరీక్షలకు ప్రిలిమ్స్ లేకుండా ఒకే రాతపరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని కమిషన్ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇప్పుడు గ్రూప్-1 సహా ఇతర ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు ఉండవని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం చర్చనీయాంశంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సుమారు 20 రకాల పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. రాత పరీక్షల్లో సాధించిన మార్కుల ప్రతిపాదికన ఇంటర్వ్యూలకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. గ్రూప్-1, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులు, సంక్షేమశాఖల ఆఫీసర్లు, గెజిటెడ్ ఇంజినీరింగ్, ఇతర పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. గతంలో వీఆర్వో, గ్రూప్-3 స్థాయి పోస్టుల భర్తీకీ ఇంటర్వ్యూలు ఉండేవి. ఇటీవల వరకూ గ్రూప్-2 ఉద్యోగాలకూ ఇంటర్వ్యూలు పెట్టారు. కమిషన్ పని తీరుపై వచ్చిన విమర్శల నేపథ్యంలో 2011లో అప్పటి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జె.సత్యనారాయణ గ్రూప్-1 సర్వీసులకు మినహా మిగిలిన వాటికి ఇంటర్వ్యూల నిర్వహణను పరిమితం చేయాలని ప్రభుత్వానికి సూచించిన మేరకు పలు మార్పులు చేశారు. ప్రస్తుతం గ్రూప్-1 ఉద్యోగాల భర్తీలో భాగంగా 75 మార్కులకు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఆర్డీవో, డీఎస్పీ, డీఎస్పీ జైళ్లు, జిల్లా రిజిస్ట్రార్, ఇతర పోస్టుల భర్తీకి ప్రిలిమ్స్, మెయిన్స్ నిర్వహించి చివరిగా ఇంటర్వ్యూలు పెడతారు. ఇలాగే ప్రభుత్వ కళాశాలల లెక్చరర్ల పోస్టుల భర్తీకి ప్రస్తుతం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి.
పరీక్షల్లో ఉత్తమ మార్కులు..ఇంటర్వ్యూల్లో వెనుకంజ: ప్రభుత్వ తాజా నిర్ణయంవల్ల నియామకాల ప్రక్రియ త్వరగా పూర్తయ్యేందుకు వీలవుతుంది. బోర్డులను బట్టి ఒక్కోసారి ఇంటర్వ్యూలు నెలరోజుల వరకు జరుగుతున్నాయి. రాత పరీక్షల్లో మంచి మార్కులు వచ్చినా, పలువురు ఇంటర్వ్యూల్లో వెనుకబడుతున్నారు. రెండేళ్లు రేయింబవళ్లు కష్టపడి పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు.. బోర్డు సభ్యులు అడిగిన ప్రశ్నలకు తడబడితే అవకాశాలు చేజారిపోతున్నాయి. కొందరు అభ్యర్థులకు విషయ పరిజ్ఞానం బాగున్నా... జవాబు చెప్పే సమయంలో ఆందోళనకు గురవుతున్నారు. ఇలాంటివారు ఇంటర్వ్యూలో వెనుకబడి అవకాశం చేజార్చుకుంటున్నారు.