ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కారున్నా ఆరోగ్యశ్రీ... పదెకరాలున్నా బియ్యం కార్డు

రాష్ట్రంలో వివిధ సంక్షేమ పథకాల అర్హతల నిబంధనలను వైకాపా సర్కార్ సడలించింది. జనవరి 1 నుంచి లబ్ధిదారులకు కొత్తగా రేషన్‌ బియ్యం ,ఆరోగ్యశ్రీ, పింఛన్‌, బోధనా రుసుములకు వేర్వేరుగా కొత్త కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది.

cm jagan

By

Published : Nov 16, 2019, 5:06 AM IST

వివిధ పథకాలకు గతంలో ఉన్న అర్హత నిబంధనలను సడలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రేషన్‌ తీసుకునేందుకు నెలవారీ ఆదాయ పరిమితిని గ్రామీణ ప్రాంతాల్లో 5వేల నుంచి 10 వేలకు, పట్టణాల్లో 6వేల 250 నుంచి 12 వేల రూపాయలకు పెంచింది. గతంలో 2.5 ఎకరాల మాగాణి లేదా 5 ఎకరాల్లోపు మెట్ట భూమి ఉన్నవారు మాత్రమే రేషన్‌ తీసుకునేందుకు అర్హులు. కాగా ఇప్పుడు 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికి వర్తిస్తుందని.. మాగాణి,మెట్ట రెండు కలిపి 10 ఎకరాల్లోపు ఉన్నా వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. విద్యుత్‌ వినియోగ పరిమితినీ నెలకు 200 యూనిట్ల నుంచి 300 యూనిట్లకు పెంచింది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నపారిశుద్ధ్య కార్మికులకూ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనుంది. గతంలో ట్యాక్సీలు మినహా ఏ ఇతర నాలుగు చక్ర వాహనాలున్నవారికీ రేషన్‌ వర్తించదనే నిబంధననూ మార్చింది. ట్యాక్సీలతోపాటు,ఆటోలు, ట్రాక్టర్లు నడుపుకుంటున్న వారికీ రేషన్‌ కార్డులు ఇస్తామని తెలిపింది.

వైఎస్​ఆర్ పింఛన్​ కానుక

వైఎస్​ఆర్ పెన్షన్‌ కానుకకు సంబంధించి కూడా కీలక నిబంధనను సడలించారు. ప్రస్తుతం మార్చిన నిబంధనల ప్రకారం 5 ఎకరాల మాగాణి లేదా, 10 ఎకరాల్లోపు మెట్ట ఉన్నవారికీ, లేదా రెండూ కలిపి 10 ఎకరాలలోపు ఉన్నవారికి వర్తింస్తుందని తెలిపారు. దీనితో పాటు రేషన్​ కార్డు కోసం సడలించిన అర్హతలనూ వైఎస్​ఆర్ పెన్షన్‌ కానుకకూ వర్తింపుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ

వైఎస్​ఆర్ ఆరోగ్య శ్రీ విషయంలో ప్రభుత్వం తాజాగా ఉన్న నియమ నిబంధనల్లో భారీగా సడలింపులు ఇచ్చింది. తాజా నిబంధనల ప్రకారం సంవత్సరాదాయం రూ.5 లక్షల లోపు ఉన్న వారికి వైఎస్​ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. 12 ఎకరాల పల్లం, 35 ఎకరాల మెట్ట లేదా రెండూ కలిపి 35 ఎకరాలు ఉన్నవారు ఆరోగ్యశ్రీకి అర్హులేనని జీవో కూడా జారీ చేశారు. అలాగే కుటుంబంలో స్థిరాస్తి లేకుండా ఒక కారు ఉన్నవారికీ, పట్టణ ప్రాంతాల్లో 3వేల చదరపు అడుగుల స్థిరాస్తి ఉన్నవారికీ ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

ఫీజు రీయింబర్స్​మెంట్

బోధనా రుసుములకు ఉద్దేశించిన జగనన్న విద్యాదీవెన, హాస్టల్‌ వసతి ఖర్చుల కింద ఏటా 20వేలు ఇచ్చే జగనన్న విద్యా వసతి నిబంధనల్నీ మార్చింది. రెండున్నర లక్షల రూపాయల్లోపు వార్షికాదాయం ఉన్న అందరికీ జగనన్న విద్యా దీవెన, విద్యా వసతి పథకాలు వర్తిస్తాయని పేర్కొంది. పదెకల్లోపు మాగాణిగాని, 25 ఎకరాల్లోపు మెట్టగానీ, రెండూ కలిపి 25 ఎకరాల్లోపుఉన్నాగానీ వర్తిస్తాయని పేర్కొంది. పారిశుద్ధ్య కార్మిక కుటుంబాలతో పాటు కారు మినహా ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్‌ ఉన్నవారూ అర్హులేనని తెలిపింది. పట్టణాల్లో 1500 చదరవు అడుగుల స్థిరాస్థి దాటితే వర్తించదని వివరించింది. పాలిటెక్నిక్, ఐటీఐ, డిగ్రీ, ఆపై కోర్సులను ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్, అనుబంధ, విశ్వవిద్యాలయాలు బోర్డుల్లో చదివే విద్యార్థులందరికీ వర్తిస్తుందని స్పష్టంచేసింది.

జనవరి 1నుంచి కొత్త కార్డులు

రాష్ట్ర సర్కార్ కొత్తగా బియ్యంకార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కార్డులు జారీ చేయనుంది. నవంబర్‌ 20 నుంచి దీనికి సంబంధించి గ్రామ వాలంటీర్లు, సచివాలయాల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. డిసెంబర్‌ 20లోగా లబ్ధిదారుల జాబితాలను విడుదల చేయనుంది. జనవరి 1 నుంచి కొత్త కార్డులు జారీచేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ABOUT THE AUTHOR

...view details