2004 సెప్టెంబర్ 1 తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలలోని ఉద్యోగులకు నూతన ఫించను విధానం (సీపీఎస్) అమలు చేస్తోందని.. ఈ విధానం వల్ల ఉద్యోగులకు పదవీవిరమణ తరువాత న్యాయంగా, చట్టబద్ధంగా రావాల్సిన పెన్షన్, గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్, కమ్యుటేషన్ దక్కట్లేదని ఏపీసీపీఎస్ యూఎస్ నేతలు సి.యం.దాస్, రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎస్ ఉద్యోగుల జీవితాలకు ఆర్థిక, సామాజిక భద్రత లేకుండా చేసిందన్నారు. ఈ విధానం వల్ల ఒక్కో ఉద్యోగికి కోటి నుంచి కోటిన్నర రూపాయలు వస్తాయని మభ్యపెట్టారని, కానీ.. వాస్తవం లో ఒక్కో రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగికి రూ.650 నుంచి 1005 రూపాయలు పెన్షన్ గా వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
సెప్టెంబర్ 1న సీఎం జగన్ ఇంటిని ముట్టడిస్తాం - సీపీఎస్ పెన్షన్ స్కీం
రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లలో సీపీఎస్ విధానం రద్దు చేసినప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఎందుకు రద్దు చేయలేదు అని ఏపీసీపీఎస్ యూఎస్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రశ్నించారు. వైకాపా సర్కారు వెంటనే సీపీఎస్ రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దరించాలని డిమాండ్ చేశారు.
అప్పుడు ప్రతిపక్షనేతగా పాదయాత్ర చేసిన జగన్.. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తానని అనేక బహిరంగ సభలలో, మీడియా ఎదుట హామీ ఇచ్చారని చెప్పారు. జగన్ మాటలు నమ్మిన ఉద్యోగులు సంపూర్ణ మద్దతు ప్రకటించి గెలిపించారని, కానీ.. అధికారంలోకి వచ్చిన తరువాత సీపీఎస్ ను రద్దు చేయకుండా.. కమిటీల పేరుతో కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.
సీపీఎస్ విధానం రద్దు చేయకుండా.. గ్యారంటీ పెన్షన్ స్కీం (జీపీఎస్) పేరుతో కొత్త విధానాన్ని తీసుకువస్తామని చెప్పడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. రాజస్థాన్, చత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రలలో సీపీఎస్ విధానం రద్దు చేసి, పాత పెన్షన్ విధానం అమలు చేస్తుంటే.. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ చర్యలకు వ్యతిరేకంగా.. సెప్టెంబర్1న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి ఇంటిని ముట్టడించాలని నిర్ణయించినట్టు తెలిపారు.