ప్రభుత్వం అవలంబిస్తున్న అనేక విధానాలపై కొంతకాలంగా విమర్శలు చేస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణ రాజును.. సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు హైదరాబాద్‌లోని ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు.. నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. తొలుత రఘురామకృష్ణరాజుకు ఇంటికి వచ్చిన సీఐడీ పోలీసులను.. ఎంపీ భద్రతా విధుల్లో ఉన్న సీఆర్పీఎఫ్ సిబ్బంది, రఘురామ కుమారుడు భరత్ అడ్డుకునే యత్నంచేశారు. సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారులు అనుమతిస్తేనే ఎంపీని అదుపులోకి తీసుకునేందుకు అంగీకరిస్తామని భద్రతా సిబ్బంది సీఐడీ అధికారులకు తేల్చిచెప్పారు. ఫలితంగా కొంతసేపు వాగ్వివాదం చోటుచేసుకుంది.
పలు సెక్షన్ల కింద కేసు నమోదు..
ఆ తర్వాత సీఐడీ అధికారులు సీఆర్ఫీఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడి రఘురామకృష్ణరాజును అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు కుటుంబసభ్యులకు నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించగా వారు తీసుకోకపోవడంతో.. సీఐడీ అధికారులు ఎంపీ భార్య రమాదేవికి ఇస్తున్నట్లుగా ఇంటి ప్రధాన ద్వారం వద్ద గోడకు నోటీసు పత్రాన్ని అంటించారు. రఘురామపై ఐపీసీ సెక్షన్ 124 (1), 158, 505 రెడ్‌విత్ 1204 సెక్షన్ల కింద మంగళగిరిలోని సీఐడీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైందని.. ఈ కేసులోనే ఆయన్ను అరెస్టు చేస్తున్నట్లు నోటీసులో తెలిపారు. ఇది నాన్ బెయిలబుల్ కేసు అని.. న్యాయస్థానం ద్వారా మాత్రమే బెయిల్ పొందేందుకు వీలుందని పేర్కొంటూ సీఆర్పీసీలోని సెక్షన్ 50(2 ) ప్రకారం నోటీసు జారీచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
వాస్తవమని తేలటంతోనే కేసు: ఏడీజీ సునీల్‌కుమార్
రఘురామను రోడ్డు మార్గంలో గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. సీఐడీ ఏడీజీ సునీల్‌కుమార్.. ఎంపీని విచారించారు. రఘురామకృష్ణ రాజు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని, ప్రభుత్వం పట్ల అవిధేయతను ప్రొత్సహిస్తున్నారనే సమాచారం పై ప్రాథమిక విచారణ జరిపామని ఏడీజీ సునీల్‌కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అదంతా వాస్తవమని తేలటంతో కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వివరించారు. ఒక పథకం, ప్రణాళిక ప్రకారం కులాల మధ్య విద్వేషాలు, ఉద్రిక్తతలు రెచ్చగొట్టేలా రఘురామకృష్ణ రాజు నిత్యం ప్రసంగాలు చేస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. ప్రభుత్వంలో వివిధ హోదాల్లో ఉన్న వ్యక్తుల్ని ఎంపీ లక్ష్యంగా చేసుకుంటున్నారని.. ప్రభుత్వం పట్ల విశ్వాసం కోల్పోయేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఆయన ప్రసంగాలు, చర్యలు విద్వేషపూరితంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. పలు మీడియా ఛానెళ్లతో కలిసి రాష్ట్రంలో సామాజిక, ప్రజాశాంతి, భద్రతలకు భంగం కలిగించేందుకు కుట్ర చేశారని ప్రకటనలో వివరించారు.