ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

AP Cabinet Decisions: రాష్ట్ర మంత్రివర్గ భేటీ.. తీసుకున్న నిర్ణయాలు ఇవే.. - minister perni nani on Cabinet decessions

AP Cabinet Decisions: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈబీసీ నేస్తం నిధులు, వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగుల పదవీ విరమణ వయసు వంటి పలు అంశాలపై చర్చించారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి పేర్ని నాని వెల్లడించారు.

AP Cabinet Decisions
AP Cabinet Decisions

By

Published : Jan 21, 2022, 5:00 PM IST

Updated : Jan 21, 2022, 7:34 PM IST

AP Cabinet Decisions: కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కరోనా మరణాలు మరింత తగ్గేలా చూడాలని శాఖాధిపతులను కోరినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే మెరుగైన స్థితిలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.

కొవిడ్ కారణంగా మృతి చెందిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు గ్రామ వార్డు సచివాలయంలో కారుణ్య నియామకం చేపట్టేందుకు మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి పేర్ని నాని వెల్లడించారు. జగనన్న స్మార్ట్ టౌన్ లలో ఉద్యోగులకు 10 శాతం మేర స్థలాలను రిజర్వు చేయడం తో పాటు 20 శాతం మేర ధరలో రిబెటుకు ఆమోదం తెలిపారు. పెన్షనర్ లకు కూడా 5 శాతం మేర స్థలాలు రిజర్వు చేయనున్నారు. కృష్ణపట్నం థర్మల్ ప్లాంట్ 25 ఏళ్ల పాటు నిర్వహణకు సమర్థులైన సంస్థకు అప్పగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. కిలోవాట్ విద్యుత్ ఉత్పత్తి కి 3. 90 రూపాయలు వ్యయం అవుతుంటే సమీపంలో ప్లాంట్ లో 2.6 రూపాయల ఖర్చు అవుతోందని మంత్రి అన్నారు. ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములు గ్రోత్ పాలసీ కింద వినియోగానికి అంగీకారాన్ని కేబినెట్ ఇచ్చింది. తిరుపతిలో కిదాంబి శ్రీకాంత్ కు 5 ఎకరాల భూమి, తితిదే ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు అంగీకారం తెలిపారు. ఐసీడీఎస్ లో బాలామృతం, పాల సరఫరాను ఆమూల్ కు అప్పగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేలా వెసులుబాటు కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు...

  1. ఈబీసీ నేస్తం కింద ఇవ్వాల్సిన రూ.580 కోట్లకు ఆమోదం.
  2. రాష్ట్రంలో 16 వైద్య కళాశాల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం. వాటి కోసం రూ.7,880 కోట్లు ఖర్చు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
  3. ఇప్పటికే ఉన్న 11 వైద్య కళాశాలల అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం. వాటి అభివృద్ధికి రూ. 3,820 కోట్లు వ్యయానికి ఆమోదం.
  4. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపునకు కేబినెట్‌ ఆమోదం.
  5. కొవిడ్‌తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇచ్చేందుకు ఆమోదం.
  6. జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్‌ల్లో ఉద్యోగులకు 10 శాతం, పింఛన్‌దారులకు 5 శాతం రిజర్వేషన్‌కు ఆమోదం.
  7. ఈ నెల 25 నుంచి ఈబీసీ నేస్తం ప్రారంభం.
  8. కృష్ణపట్నం థర్మల్‌ ప్లాంట్‌ను మరొకరికి అప్పగించే నిర్ణయానికి ఆమోదం. నిర్వహణ ఖర్చు తగ్గించుకొనేందుకు బిడ్‌ ద్వారా 28 ఏళ్లపాటు అప్పగించేందుకు ఆమోదం లభించింది.
  9. అనకాపల్లి ప్రాంతీయ వ్యవసాయ సంస్థ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం.
  10. కొవిడ్ కోసం తాత్కాలిక నియామకాలు చేపట్టాలని వైద్యారోగ్య శాఖకు కేబినెట్ ఆదేశం.
  11. ఏపీఐఐసీ నిర్వహణలోని ఖాళీ భూములను గ్రోత్ పాలసీ కింద వినియోగానికి కేబినెట్ ఆమోదం.
  12. తిరుపతిలో బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు 5 ఎకరాల భూమి కేటాయింపునకు ఆమోదం.
  13. తిరుమల తిరుపతి వేవస్థానం బోర్డులో ప్రత్యేక ఆహ్వానితులను నియమించేలా దేవాదాయ చట్ట సవరణకు అంగీకారం.
  14. ఐసీడీఎస్‌లో బాలామృతం, పాల సరఫరాను ఆముల్‌కు అప్పగిస్తూ నిర్ణయం.
  15. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో స్వల్ప మార్పులు. రెండు వాయిదాల్లో ఓటీఎస్ సొమ్ము చెల్లించేలా వెసులుబాటుకు ఆమోదం.
  16. రూ.5వేల కోట్లు రుణాల సేకరణకు ఏపీ పౌరసరఫరాల శాఖకు వెసులుబాటు కల్పిస్తూ కేబినెట్ ఆమోదం.

సమ్మె విషయం మా దృష్టికి రాలేదు..

ప్రభుత్వ ఉద్యోగుల సహాయ నిరాకరణ అంశం ప్రభుత్వం దృష్టికి రాలేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. కేబినెట్‌ నిర్ణయాలు వెల్లడించిన అనంతరం ఉద్యోగుల సమ్మెపై మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు మంత్రి స్పందించారు. ఉద్యోగులతో మాట్లాడేందుకు సీఎస్, ప్రభుత్వ సలహాదారు, ముగ్గురు మంత్రులతో ఓ కమిటీని ఏర్పాటు చేసినట్టు తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అయితే ఉద్యోగులు రోడ్డెక్కవద్దనే ప్రభుత్వం తాపత్రయపడుతోందన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అసభ్యంగా మాట్లాడితే హెచ్ఆర్‌ఏ పెరుగుతుందా?అని ప్రశ్నించారు. ఏదైనా న్యాయంగా పోరాటం చేస్తేనే సాధించగలుగుతామని పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని నానా తిట్లు తిడుతూ.. రేపు పాఠశాలల్లో పిల్లలకు పాఠాలు ఎలా చెబుతారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

"ఉద్యొగులు రోడ్డెక్కవద్దనే మా ప్రభుత్వ తాపత్రయం. అసభ్య వ్యాఖ్యలు, శాపాలతో పీఆర్సీ, హెచ్‌ఆర్ఏ వస్తాయా? సీఎంను ఇంతగా తిడుతూ బడుల్లో పాఠాలెలా చెబుతారు? సీఎంను తిడితే ఏ ఆనందం వస్తుందో ఉద్యోగులు ఆలోచించాలి. గుడివాడలో ఏం జరిగిందని నిజనిర్ధరణకు వెళ్లారు?. మా పార్టీ ఎమ్మెల్యేపైనా కేసు నమోదైంది. తప్పు చేస్తే నాయకుడైనా, అధికారైనా, నటుడైనా ఒక్కటే" - పేర్ని నాని, రాష్ట్ర మంత్రి

ఇదీ చదవండి:

ap cabinet meeting: ముగిసిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం.. పీఆర్సీ జీవోలకు ఆమోదం

Last Updated : Jan 21, 2022, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details