పెట్రోలు, డీజిల్ వినియోగదారులకు దేశంలో 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఊరటనిచ్చాయి. వీటిపై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో.. తామూ సిద్ధమంటూ ముందుకొచ్చి లీటరుకు రూ.7 వరకు అమ్మకపు పన్ను కుదించుకున్నాయి. దీంతో అక్కడ పెట్రోలు, డీజిల్ ధరలు గణనీయంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్ సహా కొన్ని రాష్ట్రాలు మాత్రం కేంద్రం ప్రకటించిన ఎక్సైజ్ సుంకం, దానిపై విధించే వ్యాట్ తగ్గింపునకే పరిమితం కావడంతో ఊరట కొంతమేర మాత్రమే లభించింది. పెట్రో ధరలు ఇప్పటికీ గరిష్ఠంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్థాన్ తొలి, ఆంధ్రప్రదేశ్ రెండోస్థానంలో నిలవగా.. తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది. చాలా రాష్ట్రాల్లో శుక్రవారం లీటరు డీజిల్ రూ.90 దిగువకు చేరగా.. పెట్రోలు కూడా రూ.100 నుంచి రూ.102 లోపే ఉంది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర సహా కొన్ని రాష్ట్రాల్లోనే ధరలు అధికంగా ఉన్నాయి. పన్ను తగ్గింపుపై ఈ రాష్ట్రాలు తమ విధానం స్పష్టం చేయలేదు. ధరల తగ్గింపుపై ఈ నెల 9న జరిగే మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తామని పంజాబ్ ప్రకటించింది.
దక్షిణాదిన ఆంధ్రప్రదేశ్‌లోనే అధికం
శుక్రవారం దేశంలో ఇంధన ధరలు చూస్తే దక్షిణాదిన ఏపీలోనే ఎక్కువ. విజయవాడలో లీటరు పెట్రోలు రూ.110.35, డీజిల్ రూ.96.44 ఉన్నాయి. బెంగళూరు కంటే పెట్రోలుపై రూ.9.79, డీజిల్‌పై రూ.11.44 అధికం. హైదరాబాద్‌లోనూ లీటరు పెట్రోలు రూ.108.20, డీజిల్ రూ.94.62 చొప్పున విక్రయిస్తున్నారు. అమ్మకపు పన్ను తగ్గింపు తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూలో పెట్రోలు రూ.95.26, డీజిల్ రూ.86.80 అయింది.
* పెట్రోలు, డీజిల్ మూలధరకు కేంద్రం విధించే ఎక్సైజ్ సుంకం కలపగా వచ్చే మొత్తంపై రాష్ట్రాలు అమ్మకపు పన్ను/వ్యాట్ వసూలు చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలుపై 31% వ్యాట్, లీటరుకు రూ.4 అదనపు వ్యాట్‌తో పాటు రూ.1 చొప్పున (దీనిపై వ్యాట్ అదనం) రోడ్డు అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. డీజిల్‌పై 22.25% వ్యాట్, లీటరుకు రూ.4 చొప్పున అదనపు వ్యాట్, రూ.1 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ (దీనిపై వ్యాట్ అదనం) విధిస్తున్నారు. 2020-21లో ఈ పన్నుల రూపేణా రూ.11,014 కోట్ల రాబడి వచ్చింది. తెలంగాణలో పెట్రోలుపై 35.20%, డీజిల్‌పై 27% చొప్పున వ్యాట్ విధిస్తున్నారు. పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై గత ఆర్థిక సంవత్సరంలో రూ.8,691 కోట్ల రాబడి సాధించింది. హరియాణా పెట్రోలుపై 25% వ్యాట్ లేదా లీటరుకు రూ.15.62తో పాటు వ్యాట్‌పై 5% అదనపు పన్ను, డీజిల్‌పై 16.40% వ్యాట్ లేదా లీటరుకు రూ.10.08తో పాటు వ్యాట్‌పై 5% అదనపు పన్ను వసూలుచేస్తోంది. ఈ రాష్ట్రానికి గతేడాది వచ్చింది రూ.7,923 కోట్లు.. అయినా లీటరుకు రూ.7 తగ్గించింది.
* రాజస్థాన్‌లోనూ పెట్రోలుపై 36% వ్యాట్, లీటరుకు రూ.1.50 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్, డీజిల్‌పై 26% వ్యాట్, లీటరుకు రూ.1.75 చొప్పున రోడ్డు అభివృద్ధి సెస్ వసూలు చేస్తున్నారు. 2020-21లో పెట్రో అమ్మకాలపై పన్నుల ద్వారా రూ.15,119 కోట్ల మేర వసూలు చేసింది. అయినా తగ్గించలేదు.