అరాచకాలు, ఆగడాలు రాష్ట్రంలో నిత్య కృత్యమవుతున్నాయి. దౌర్జన్యాలు, దాడులు, వేధింపులు సర్వసాధారణంగా మారిపోయాయి. వీటన్నింటి వెనుక రాష్ట్రంలో కొందరు వైకాపా నాయకుల ప్రమేయం ఉండటం కలవరం రేపుతోంది. అధికార పార్టీ నేతలమన్న అహంతో చెలరేగిపోతున్న నాయకుల దందాలు, దౌర్జన్యాలకు రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒకచోట ఎవరో ఒకరు బలైపోతూనే ఉన్నారు. ఇటీవల వరకూ రాజకీయ ప్రత్యర్థులు, ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల్ని తప్పుడు కేసులు, దాడులు, దౌర్జన్యాలతో వేధించిన కొందరు నాయకులు ఇప్పుడు సామాన్య ప్రజానీకంపైనా జులుం ప్రదర్శిస్తున్నారు. ‘అధికారం మా చేతిలో ఉంది. పోలీసులు మేం చెప్పినదానికల్లా తలాడిస్తారు. మాకు అడ్డేముంది?’ అంటూ రెచ్చిపోతున్నారు. ఆగడాలను అరికట్టాల్సిన పోలీసులూ అధికార పార్టీ నేతలకే వత్తాసు పలుకుతున్న ఘటనలు..
బాధితుల్ని మరింత నిస్సహాయులుగా మారుస్తున్నాయి. తమను ఇంకెవరూ ఆదుకోలేరనే భయంతో ఈ ఏడాదిలోనే చాలామంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. మరికొందరు సర్వం కోల్పోయి మౌనంగా రోదిస్తున్నారు. తాజాగా వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్, దళిత యువకుడైన సుబ్రహ్మణ్యం అనుమానాస్పద స్థితిలో మరణించడం, తన భర్తను అనంతబాబే చంపేశారని హతుడి భార్య ఆరోపించిన నేపథ్యంలో వైకాపా నేతల దాష్టీకాలపై మరోమారు తీవ్ర చర్చ జరుగుతోంది.
మహిళలపై వేధింపులు, అమ్మాయిలతో అసభ్య ప్రవర్తన మొదలుకుని అత్యాచారాల వరకూ అనేక ఘటనల్లో కొందరు వైకాపా నాయకుల ప్రమేయం వెలుగు చూస్తోంది. తన కుమార్తె స్కూల్ టాపర్‌గా నిలిచేందుకు... ప్రతిభావంతురాలైన మరో సహచర విద్యార్థిని అడ్డంకిగా ఉందంటూ ఓ వైకాపా కార్యకర్త వేధించడంతో ఆ చిన్నారి ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పోటీ చేశాడని తప్పుడు కేసులు పెట్టించి, పోలీసులతో కొట్టించి ఓ ఎస్సీ యువకుడి బలవన్మరణానికి కారణమయ్యారు అధికార పార్టీ నాయకుడొకరు. యువతిని వేధించటం సరికాదని హితవు పలికినందుకు ఓ యువకుణ్ని రాళ్లతో కొట్టి, అవమానించి.. అతని ఆత్మహత్యకు కారకులయ్యారు మరికొందరు వైకాపా నాయకులు. ఓ మహిళను శారీరకంగా, మానసికంగా వేధించి ఆమె ప్రాణాలు తీసుకునేలా చేశారు ఇంకో నాయకుడు. ఇలాంటివి నిత్యం ఎక్కడో ఒకచోట వెలుగుచూస్తున్నా వైకాపా అధిష్ఠానం ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వపరంగానూ చర్యల్లేక నాయకులు మరింత రెచ్చిపోతున్నారు.
5-1-2022 ఎస్సీ యువకుడి బలవన్మరణం :
కాకినాడ జిల్లా సామర్లకోటలోని బులుసుపేటకు చెందిన ఎస్సీ యువకుడు అలపు గిరీష్‌బాబు గతేడాది మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. తమకు వ్యతిరేకంగా పోటీ చేశాడని అతనిపై కక్ష పెంచుకున్న వైకాపా నాయకులు.. తప్పుడు ఫిర్యాదుతో కేసు పెట్టించారు. పోలీసుల వేధింపులు తాళలేక గిరీష్ బలవన్మరణానికి పాల్పడ్డారు. వైకాపా నాయకుల ఒత్తిడితో తన తమ్ముణ్ని రోజూ పోలీసు స్టేషన్‌కు పిలిపించి హింసించడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని గిరీష్ సోదరుడు ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. మృతదేహాన్ని సామర్లకోట పోలీసుస్టేషన్ మెట్లపై ఉంచి ఆందోళన చేశారు.
17-3-2022 నాయకుడి వేధింపులు.. ప్రాణాలు తీసుకున్న మహిళ :కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం భోగిరెడ్డిపల్లె గ్రామ వైకాపా నాయకుడు గరికపాటి నరసింహారావు తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారంటూ వీవోఏ గరికపాటి నాగలక్ష్మి ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు నరసింహారావుపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేయలేదు సరికదా... ఫిర్యాదు ఉపసంహరించుకోవాలంటూ ఆమెపైనే ఒత్తిడి తీసుకొచ్చారు. న్యాయం కోసం ఆమె ఎస్పీకి ఫిర్యాదు చేసినా మూడు రోజులపాటు కనీస స్పందన లేదు. వైకాపా నాయకుడి వేధింపులు పెరిగిపోవడంతో నిస్సహాయ స్థితిలో ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ‘నరసింహారావు, అధికారులు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ కలిసి నా సోదరిని హత్య చేశారు’ అని నాగలక్ష్మి సోదరుడు భోగాది వినయ్‌బాబు ఆరోపించారు.
23-3-2022 , చదువుల తల్లిని బలిగొన్న దౌర్జన్యం :
పలమనేరుకు చెందిన వైకాపా కార్యకర్త సునీల్‌కుమార్ దాష్టీకం బంగారు భవిష్యత్తు కలిగిన, ముస్లిం మైనారిటీ వర్గానికి చెందిన మిస్బాను బలి తీసుకుంది. పదో తరగతిలో తన కూతురే స్కూల్ టాపర్‌గా నిలవాలని, ఆమెకు పోటీగా ఎవరూ ఉండకూడదంటూ... ఆమె కంటే బాగా చదివే, ఎక్కువ మార్కులు తెచ్చుకునే మిస్బాపై వేధింపులకు తెగబడ్డారు. వార్షిక పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో ఆ చిన్నారిని పాఠశాల నుంచి తొలగించేలా చేశారు. దీంతో తీవ్ర మనోవేదనకు గురైన మిస్బా ఆత్మహత్యకు పాల్పడింది. ‘నాన్నా పేదలు చదువుకోకూడదా? డబ్బున్న వాళ్లే చదువుకుని ఉన్నత స్థానానికి వెళ్లాలా? నాకు మంచి మార్కులొస్తే స్నేహితురాలే ఓర్వలేకపోతోంది. నేను మళ్లీ పాఠశాలకు వెళ్లాలంటే ఆ అమ్మాయి తండ్రి అనుమతి తీసుకోవాలంటూ మా ఉపాధ్యాయుడు వేధిస్తున్నారు’ అంటూ చనిపోయే ముందు ఆవేదనతో తన తండ్రికి లేఖ రాసింది. ఈ ఘటనకు కారకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. బాధిత కుటుంబాన్నే డీఎస్పీ కార్యాలయానికి పిలిపించడం, మిస్బా రాసిన లేఖ స్వాధీనానికి అర్ధరాత్రి వేళ వారి ఇంట్లో సోదాలు చేయడం వివాదాస్పదమైంది.
11-4-2022, అసభ్య ప్రవర్తనపై ప్రశ్నిస్తే.. అంతు చూశారు..
యువతితో అసభ్యంగా ప్రవర్తించడం సరికాదంటూ అనకాపల్లి జిల్లా కశింకోట మండలం కొత్తపల్లిలో గ్రామ సర్పంచి, వైకాపా నాయకుడు కన్నం శ్యామ్‌ను ఉద్దేశించి... శ్రీనివాస్ అనే యువకుడు వాట్సప్ స్టేటస్ పెట్టారు. అదే అతని నేరమైపోయింది. మమ్మల్నే ప్రశ్నిస్తావా అంటూ శ్యామ్, అతని అనుచరుడు అద్దేపల్లి శ్రీనివాసరావు తదితరులు శ్రీనివాస్‌ను రాళ్లతో కొట్టారు. అవమానంగా భావించిన ఆ కుర్రాడు బలవన్మరణానికి పాల్పడ్డారు. ‘నేనేం తప్పు చేశానని కొట్టారు? అధికారం ఉంటే ఏమైనా చేస్తారా? నా చావు తర్వాతైనా నిజాలు బయటకు వస్తాయి’ అంటూ ఆత్మహత్యకు ముందు తన స్నేహితులందరికీ వాయిస్ మెసేజ్‌లు పంపించారు.
16-2-2022, ఎంపీ నందిగం సురేష్ హల్చల్ :
అర్ధరాత్రి వేళ వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులు తన సమీప బంధువులను అదుపులోకి తీసుకుని వదిలి పెట్టలేదంటూ.. వైకాపా ఎంపీ నందిగం సురేష్ తన అనుచరులతో ఫిబ్రవరి 16న విజయవాడ కృష్ణలంక పోలీసు స్టేషన్లో హల్చల్ చేశారు. 30 మందికి పైగా అనుచరులతో అర్ధరాత్రి దాటిన తర్వాత స్టేషన్లోకి వెళ్లి దాదాపు గంటకు పైగా వీరంగం వేశారు. విధుల్లో ఉన్న ఎస్సై, హెడ్‌కానిస్టేబుల్ తదితరులపై ఆగ్రహంతో ఊగిపోయారు. హెడ్‌కానిస్టేబుల్ సెల్ఫోన్లో ఆ దృశ్యాల్ని చిత్రీకరిస్తుండగా ఎంపీ అనుచరులు ఫోన్ లాక్కొని దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
16-3-2022, అనుచరగణం వీరంగం.. మంత్రి పెద్దిరెడ్డి అనుయాయుడి వేధింపులు :
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడైన శ్రీనాథ్‌రెడ్డి... గ్రామ వాలంటీర్లు, పోలీసులతో కలిసి తనను వేధిస్తున్నారంటూ చల్లావారిపల్లెకు చెందిన మధు అనే వ్యక్తి మార్చి 16న ఆత్మహత్యకు యత్నించారు. రొంపిచెర్ల మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ చల్లా లక్ష్మి భర్త శ్రీనాథ్‌రెడ్డి అధికార బలాన్ని వినియోగించి తనను వేధిస్తున్నారని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్యకు యత్నించారు. అప్రమత్తమైన స్నేహితులు ఆయన్ని కాపాడుకున్నారు.
3-4-2022, టోల్‌ప్లాజా సిబ్బందిపై ఎమ్మెల్యే శ్రీదేవి వర్గీయుల దాడి:
ఏప్రిల్ 3న కర్నూలు జిల్లాలోని 44వ జాతీయ రహదారిపై అమకతాడు టోల్‌ప్లాజా వద్ద తమను నేరుగా అనుమతించలేదంటూ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరుల వీరంగం సృష్టించారు. ‘మా కారు వస్తే గేటు ఎందుకు ఎత్తట్లేదు?’ అంటూ కర్రలతో దాడి చేయడంతో కొందరు టోల్‌ప్లాజా సిబ్బంది గాయపడ్డారు.
* తాము అడిగినంత కమీషన్ ఇవ్వట్లేదంటూ మద్దికెర పరిధిలో రైల్వే పనులు చేస్తున్న గుత్తేదారులపై ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు దాడికి పాల్పడ్డారు. సిబ్బంది, కూలీలను రాళ్లతో కొట్టి గాయపరిచారు. అక్కడున్న వాహనాలు, యంత్రాల్ని తమతోపాటు తీసుకెళ్లి కొద్ది దూరంలో పడేశారు.
28-3-2022
‘రాయదుర్గం ఎమ్మెల్యే అనుచరుల నుంచి ప్రాణహాని’