ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ఐదేళ్లయినా ఇంకా నివేదికల స్థాయిలోనే అనంతపురం- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే

By

Published : Feb 18, 2021, 7:15 AM IST

కోస్తా, రాయలసీమలను అనుసంధానించే అత్యంత కీలకమైన అనంతపురం- అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణం అడుగు ముందుకుపడటం లేదు. అయిదేళ్ల కిందట ప్రతిపాదించిన దీని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తున్నా... ప్రతిపాదనలు మార్చుతుండటంతో ఎడతెగని జాప్యం జరుగుతోంది. స్వరూపం మార్చినా అసలు ఇది ఉంటుందా, ఉండదా? ఉంటే ఎప్పటికి పనులు ప్రారంభమవుతాయి అనే ప్రశ్నలకు ఇప్పట్లో సమాధానాలు దొరికేలా లేవు. దీని తరువాత ఇతర రాష్ట్రాల్లో ప్రతిపాదించిన పలుప్రాజెక్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నా.. ఈ రహదారికి  మాత్రం మోక్షం కలగటం లేదు.

Anantapur- Amravati
Anantapur- Amravati

నాడు వద్దన్నదే.. మళ్లీ విస్తరణ!

నంతపురం నుంచి తాడిపత్రి, అవుకు, బనగానపల్లె, గిద్దలూరు, కంభం, వినుకొండ, నరసరావుపేట మీదగా గుంటూరు వరకు జాతీయ రహదారి-544డిని విస్తరించేందుకు ఇటీవల కేంద్రం ఆమోదించింది. దీనికి గతంలోనే ఎన్‌హెచ్‌ఏఐ టెండర్లు పిలిచింది. అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే మంజూరవడంతో వాటిని రద్దు చేసింది. ఇప్పుడు మళ్లీ ఆ రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు.

అనంత రహదారిపై సందేహాలు

బెంగళూరు - మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే, అనంతపురం - గుంటూరు జాతీయ రహదారి -544డి విస్తరణ తదితర పరిణామాలు చూస్తుంటే.. అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వే పట్టాలెక్కడం సందేహమేనని అధికారులు పేర్కొంటున్నారు. బెంగళూరు - విజయవాడ ఎక్స్‌ప్రెస్‌ వేతోపాటు, అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వే కూడా కొనసాగితే ఇబ్బంది ఉండదని, అయితే ఒకే ప్రాంతానికి ఇన్ని రహదారులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించటం కష్టమని చెబుతున్నారు.

ప్రతిపాదనలు మారుస్తూ..

మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చాక ఎక్స్‌ప్రెస్‌ వేను అమరావతి అవుటర్‌ రింగ్‌రోడ్‌లో కాకుండా చిలకలూరిపేట బైపాస్‌ వద్ద జాతీయ రహదారి-16లో కలిసేలా ప్రతిపాదించారు. దీన్ని జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఆమోదించింది. దీంతో తొలుత అనుకున్న 384 కి.మీ.మార్గంలో 47 కి.మీ. తగ్గుతుంది. ఈ మేరకు డీపీఆర్‌ మార్చి ఇస్తే పని మొదలుపెడతామని ఎన్‌హెచ్‌ఏఐ చెప్పింది. రాష్ట్రం భూసేకరణకు రూ.100 కోట్లు కేటాయించినా డీపీఆర్‌ల తయారీ, భూసేకరణ వేగవంతంపై దృష్టి పెట్టలేదు.

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం బెంగళూరుకు ఎక్స్‌ప్రెస్‌వే మంజూరు చేయాలని కోరింది. అనంతపురం జిల్లా కొడికొండ సమీపంలో జాతీయ రహదారి-44 వద్ద మొదలై పులివెందుల, మైదుకూరు మీదుగా ప్రకాశం జిల్లాలోని మేదరమెట్ల వద్ద జాతీయ రహదారి-16లో కలిసేలా ప్రతిపాదించింది. భూసేకరణ భారాన్ని కేంద్రమే భరించేలా భారత్‌మాల పరియోజన్‌ మొదటి దశలోనే దీన్ని చేర్చాలని కోరింది. ఇందుకోసం డీపీఆర్‌ సిద్ధం చేయాలని కేంద్ర ఉపరితల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను ఆదేశించారు.

రాజధాని అమరావతి నుంచి రాయలసీమ జిల్లాలకు తక్కువ సమయంలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మలుపులు లేని అనంతపురం-అమరావతి ఆరు వరుసల యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించాలని 2016లో ప్రతిపాదించారు. కడప, కర్నూలుల నుంచి నాలుగు వరసల ఫీడర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేలు నిర్మించి దీనికి కలపాలని పేర్కొన్నారు. రూ.27 వేల కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టును 2017-18లో భారతమాల పరియోజన్‌ గ్రాండ్‌ ఛాలెంజ్‌ కింద కేంద్రం ఆమోదించింది. జాతీయ రహదారి-544 ఎఫ్‌గా నంబరు కూడా కేటాయించింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలో జాతీయ రహదారి-44 నుంచి గుంటూరు జిల్లాలోని అమరావతి రింగ్‌రోడ్‌లో కలిసేలా 384 కి.మీ. రహదారిని 19 ప్యాకేజీలుగా నిర్మించాలి. అంతా సిద్ధమయ్యాక భూసేకరణ సమస్య ఎదురైంది.

విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, కేంద్రమే ఈ ఖర్చు భరించాలని రాష్ట్రం కోరింది. దీంతో చాలారోజులపాటు పెండింగ్‌ పడింది. చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి సగం భరించేందుకు అంగీకారం కుదిరింది. దాదాపు 15 ప్యాకేజీల డ్రాఫ్ట్‌ డీపీఆర్‌లు సైతం సిద్ధమయ్యాయి. భూసేకరణ కోసం ప్రత్యేక యూనిట్లు ఏర్పాటయ్యాయి. తరువాత అనంతపురం- అమరావతి మధ్య ఆరు వరుసల్ని నాలుగుకు కుదించారు. కర్నూలు, కడపల నుంచి ఫీడర్‌ ఎక్స్‌ప్రెస్‌వేలను రెండో దశలో నిర్మించాలనుకున్నారు. వ్యయం రూ.20 వేల కోట్లకు తగ్గించారు.

రాజధానిగా అమరావతి ఉన్నా, విశాఖపట్నమైనా.. రాయలసీమ నుంచి ఈ ప్రాంతానికి రావాలంటే విజయవాడ వరకు నేరుగా మలుపుల్లేని ఎక్స్‌ప్రెస్‌వే ఉంటే రెండు గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ప్రయాణానికి సౌలభ్యంగానూ ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే అనంతపురం- అమరావతి ఆరు వరుసల రహదారిని కడప, కర్నూలు ఫీడర్‌ రోడ్లతో కలిపి ప్రతిపాదించారు. ఇది పూర్తయితే చిత్తూరు మినహా మూడు సీమ జిల్లాలకు.. కోస్తా నడిబొడ్డునన్ను విజయవాడ వరకు మెరుగైన రహదారి సమకూరుతుంది. మూడు రాజధానుల ప్రతిపాదనతో అమరావతి అవుటర్‌ రింగ్‌ రోడ్డు అటకెక్కింది. అనంతపురం నుంచి చిలకలూరిపేట బైపాస్‌ వరకు చాలు అనటంతో సుమారు 70 కిలోమీటర్ల దిగువనే ఎన్‌హెచ్‌-16లో కలుస్తుంది.

ఇది కాకుండా బెంగళూరు- మేదరమెట్ల ఎక్స్‌ప్రెస్‌వే మంజూరు చేస్తే ఏకంగా 122 కి.మీ. కుదించుకుపోతుంది. ఈ మేరకు ఎన్‌హెచ్‌-16 పైనే ప్రయాణించి విజయవాడకు చేరుకోవాలి. ఇప్పటికే విపరీతమైన రద్దీతో ఉండే ఈ జాతీయ రహదారికి రాయలసీమ నుంచి కొత్తగా వచ్చే మార్గాన్ని సైతం అంత దిగువన కలిపితే రద్దీ మరింత పెరుగుతుంది. కోస్తాకు తుపాన్ల ప్రభావం అధికం. అలాంటి సమయంలో సమాంతరంగా మరో జాతీయ రహదారి ఉండటం మేలు. అమరావతి ఓఆర్‌ఆర్‌ ఉన్నా, లేకున్నా అనంతపురం ఎక్స్‌ప్రెస్‌వేను నేరుగా విజయవాడ సమీప ప్రాంతానికి అనుసంధానిస్తేనే ఉపయోగకరమని రవాణారంగ నిపుణులు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌ దూకుడు

నాలుగు వరుసలు, ఆరు వరుసల జాతీయ రహదారులను కాదని.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత వేగంగా గమ్యాన్ని చేరుకోవటానికి యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణంపై దృష్టి పెడుతున్నాయి.

* ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రమైతే ఏకంగా ఎక్స్‌ప్రెస్‌ వేస్‌ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీనే ఏర్పాటు చేసింది.

* ఆగ్రా-లక్నో మధ్య 302 కి.మీ.పొడవైన ఆరు వరసల రహదారి నిర్మాణాన్ని 2015లో రూ.11,526 కోట్ల వ్యయంతో ప్రారంభించి 2016 నవంబర్‌ నాటికే పూర్తి చేసింది.

* పూర్వాంచల్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరిట లక్నో-ఘాజీపూర్‌ మధ్య రూ.23,349 కోట్ల వ్యయంతో 340 కి.మీ. పొడవున ఆరు వరుసల రహదారి 2016లో మంజూరైంది. ఈ ఏడాది చివరికి నిర్మాణం పూర్తవుతుంది.

* గోరఖ్‌పూర్‌ లింక్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో గోరఖ్‌పూర్‌ నుంచి అజాంఘర్‌ వరకు 91 కి.మీ. పొడవైన రహదారి నిర్మాణం 2019లో ప్రారంభమైంది. దీని వ్యయం రూ.5,876 కోట్లు.

* బుందేల్‌ఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో ఇటావా నుంచి చిత్రకూట్‌ వరకు 296 కి.మీ. పొడవున రూ.14,849 కోట్ల అంచనాతో నిర్మిస్తున్న ప్రాజెక్టు 2017లో మంజూరైంది. 2019లో పనులు ప్రారంభమై 25 శాతం పూర్తయింది.

* మీరట్‌ నుంచి అలహాబాద్‌ వరకు గంగా ఎక్స్‌ప్రెస్‌వే పేరుతో రూ.36,402 కోట్ల వ్యయంతో 596 కి.మీ. మేర మరో రోడ్డు నిర్మాణం చేపడుతున్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ: హైకోర్టు న్యాయవాద దంపతుల దారుణ హత్య

ABOUT THE AUTHOR

...view details