ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఊరి కోసం..నాసా పర్యటననే వదులుకున్న యువతి - swarga foundation

పైసా ఖర్చు లేకుండా అమెరికా వెళ్లే అవకాశం వస్తే ఎవరైనా ఎగిరి గంతేస్తారు కదా! కానీ 17 ఏళ్ల జయలక్ష్మి మాత్రం తనకొచ్చిన అవకాశాన్ని కాదనుకుని ఆ డబ్బుని తమ గ్రామ సమస్యల్ని తీర్చడానికే వినియోగించింది. ఎందుకో తెలుసా..మీరే చదవండి..

An young woman gave up her NASA trip for hometown
ఊరి కోసం..నాసా పర్యటననే వదులుకున్న యువతి

By

Published : Oct 20, 2020, 2:38 PM IST

తమిళనాడులోని ఆదనకోట్టై గ్రామానికి చెందిన జయలక్ష్మి చిన్నప్పుడే.. తండ్రి కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. తర్వాత తల్లి అళగువల్లి మతి స్థిమితం కోల్పోయింది. తల్లితోపాటు తమ్ముడి బాధ్యతా తీసుకుని తొమ్మిదో ఏట నుంచే కుటుంబానికి పెద్దదిక్కుగా నిలిచింది జయలక్ష్మి. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూనే సెలవు రోజుల్లో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. ఇంటర్‌ చదువుతున్న ఆమె గతేడాది నాసా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో పాల్గొంది. జిల్లాలో ప్రథమర్యాంకు సాధించి నాసా పర్యటనకు ఆహ్వానాన్ని అందుకుంది.

ఆమె అమెరికా వెళ్లేందుకు అవసరమైన విమాన ఛార్జీలను భరించడానికి ‘స్వర్గా ఫౌండేషన్‌’ అనే స్వచ్ఛంద సంస్థ రూ.1.6లక్షలు ఇవ్వడానికి సిద్ధమయ్యింది. మరొకరైతే, ఎంచక్కా అమెరికా వెళ్లొస్తారు కదా. కానీ ‘ఆ డబ్బుని మా ఊరికోసం ఖర్చు చేయండ’ని ఆ స్వచ్ఛంద సంస్థని కోరింది జయలక్ష్మి.

“ మా ఊళ్లో 125 కుటుంబాలుంటే ఒక్క ఇంటికీ మరుగుదొడ్డి సౌకర్యం లేదు. చిన్నప్పట్నుంచి బహిర్భూమికి వెళ్లాలంటే భయం. రాత్రిపూట ఎవరినైనా తోడు తీసుకుని వెళ్లాలి. ఈ సమస్యని పరిష్కరించాలంటే చాలా ఖర్చవుతుందన్నారు. నేను అమెరికా వెళ్లడం కన్నా ఆ డబ్బుతో గ్రామ సమస్యని పరిష్కరించడమే ముఖ్యం అనుకున్నా. ఆ నగదును మా ఊళ్లో టాయిలెట్ల నిర్మాణానికి అందించమని ఎన్జీవోను కోరా. అందుకువాళ్లు ఒప్పుకోవడం నా అదృష్టం. ఊళ్లోని 125 ఇళ్లకూ రూ.20వేలు చొప్పున నగదు సహాయాన్ని అందించారు. ఆ మొత్తంతో యువత సాయం తీసుకుని గ్రామవాసులే సొంతంగా నిర్మాణాలను చేపట్టారు. అలా జులైలో ప్రారంభించిన టాయిలెట్ల నిర్మాణం ఇటీవలే పూర్తయింది.” ఎంతో ఆనందంగా చెబుతోంది జయలక్ష్మీ..

“ ఈ విషయం తెలుసుకున్న మా జిల్లా కలెక్టర్‌, మరో ఎన్జీవో నన్ను అమెరికాకు పంపడానికి అయ్యే ఖర్చులను ఏర్పాటుచేశారు. కానీ కొవిడ్‌ వల్ల వచ్చే ఏడాదికి నా ప్రయాణం వాయిదాపడింది. పెద్దయ్యాక నేను కలెక్టరై గ్రామాభివృద్ధికి కృషి చేస్తా”..అంటూ చిరునవ్వులు చిందిస్తోందీ 17ఏళ్ల యువతి.

పిన్న వయసులోనే..ఎంతో ఉదారతతో సమాజానికి తన వంతుగా ఏదో ఒకటి చేయాలనే స్ఫూర్తి నింపుతోన్న జయలక్ష్మికి మనమూ అభినందనలు తెలుపుదామా..

ఇవీ చదవండి:రెండు పోర్టులు.. నాలుగు చేపల రేవుల అభివృద్ధి

ABOUT THE AUTHOR

...view details