పంచాయతీ ఎన్నికలపై ప్రతిష్టంభన తొలగలేదు... ఉత్కంఠకు తెరపడలేదు... ఎన్నికల సంఘం వెనకడుగు వేయలేదు... ప్రభుత్వం పట్టు వీడలేదు..! ముందు చెప్పినట్టుగానే ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నాలుగు దశలకూ ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేశారు. దాన్ని ప్రభుత్వం లెక్క చేయలేదు. ఇప్పట్లో ఎన్నికలు సాధ్యం కాదన్న వైఖరి పునరుద్ఘాటించింది. ఎస్‌ఈసీ తలపెట్టిన వీడియో సమావేశానికి అధికారులంతా ముఖం చాటేశారు. ఉద్యోగ సంఘాల నాయకులు ఎస్‌ఈసీపై విమర్శల జోరు మరింత పెంచారు. టీకా వేయకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ఉన్న ఎస్‌ఈసీ.. ఎన్నికలను అడ్డుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉద్యోగసంఘాల వైఖరినీ తప్పుబట్టారు. పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగిస్తే.. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రభుత్వం మాత్రం తన వైఖరిని వీడలేదు. ఎస్‌ఈసీ వీడియో సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ సహా అధికారులెవరూ వెళ్లలేదు సరికదా, జిల్లా కలెక్టర్లనూ వెళ్లనివ్వలేదు. తాజా పరిణామాలపై ఉన్నతాధికారులు, న్యాయనిపుణులతో సీఎం జగన్ చర్చించినట్లు సమాచారం. సోమవారం నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలు కానున్న తరుణంలో.. అందరి చూపూ సుప్రీంకోర్టు వైపే ఉంది. ఎన్నికలపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సోమవారం విచారించనున్న సుప్రీంకోర్టు ఏం చెప్పబోతోందోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఎన్నికల్ని అడ్డుకుంటే మూల్యం తప్పదు...
పంచాయతీ ఎన్నికల్ని ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటే దానికి ప్రభుత్వ వ్యవస్థే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు తలెత్తినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. శనివారం ఉదయం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన సందర్భంగా.. ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘ఎన్నికలు జరపాల్సిన రాజ్యాంగబద్ధమైన బాధ్యత పూర్తిగా ప్రభుత్వంపైనే ఉంది. ఎన్నికల సంఘంలో వేళ్లమీద లెక్కించదగ్గ సంఖ్యలోనే సిబ్బంది ఉంటారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉద్యోగుల ద్వారా జిల్లా కలెక్టర్లు ఎన్నికలు నిర్వహించాలి. ఎన్నికల ప్రక్రియకు ఎలాంటి అవరోధాలు ఎదురైనా దానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది, ప్రభుత్వ యంత్రాంగానిదే. ఎన్నికలకు అవరోధం కలిగించేందుకు ఎవరు ప్రయత్నించినా దానిపై గవర్నరుకు నివేదిక అందజేస్తా. సోమవారం కేసు విచారణ సందర్భంగా.. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందని సుప్రీంకోర్టుకూ నివేదించాల్సిన పరిస్థితి వస్తుందని అనుకోవడం లేదు. అవసరమైతే నివేదిస్తాను. ఉన్న పరిస్థితుల్ని దాచలేను’ అని ఆయన స్పష్టం చేశారు. అనేక సవాళ్లు ఎదురైనప్పటికీ, అవరోధాలన్నీ అధిగమించి ఎన్నికలు జరపాలన్న కృత నిశ్చయంతో, జరపగలమన్న నమ్మకంతో ఎన్నికల సంఘం ఉందన్నారు. సోమవారం సుప్రీంకోర్టులో కేసు విచారణకు వస్తుంది కాబట్టి ఎన్నికల ప్రక్రియ వాయిదా వేయాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తి సహేతుకంగా లేనందునే తిరస్కరించామన్నారు.
ఎన్నికల నిర్వహణలో ఎదురయ్యే సమస్యల్ని ఎప్పటికప్పుడు గవర్నరు, న్యాయ వ్యవస్థ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించి, రాజ్యాంగ స్ఫూర్తిని అమలు చేయాలని దృఢ నిశ్చయంతో ఉన్నాం. ఇది నా వ్యక్తిగత నిర్ణయం కానేకాదు. నాకున్న రాజ్యాంగ బాధ్యతల్ని మాత్రమే నిర్వహిస్తున్నా. ఇకపైనా అలాగే వ్యవహరిస్తా. - ఎస్‌ఈసీ రమేశ్‌కుమార్
పంచాయతీరాజ్‌శాఖది బాధ్యతారాహిత్యం
‘ప్రభుత్వపరంగా లభించాల్సిన తోడ్పాటుపై కమిషన్‌కు మిశ్రమ అనుభవాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ పరిణతి చెందిన అధికారులు. వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ వారితో నాకు సత్సంబంధాలున్నాయి. ఎలాంటి సమస్యనైనా చర్చలతో పరిష్కరించాలన్న తత్వం ఎన్నికల సంఘానికి మొదటి నుంచీ ఉంది. 2021 ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహిస్తామని హైకోర్టుకు తెలియజేశాం. కానీ దాన్ని పూర్తి చేయలేకపోయాం. తాజా ఓటర్ల జాబితాల్ని సిద్ధం చేయడంలో పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనరు పూర్తిగా విఫలమయ్యారు. విధిలేని పరిస్థితుల్లోనే 2019 సంవత్సరం ఓటర్ల జాబితాలతో ఎన్నికలు నిర్వహించాల్సి వస్తోంది. కొత్త ఓటర్ల జాబితా సిద్ధం చేయకపోవడంవల్ల 18 ఏళ్ల వయసు నిండిన సుమారు 3.6 లక్షల మంది యువత.. ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారు. ఈ విషయంలో పంచాయతీరాజ్‌శాఖ అలసత్వం, బాధ్యతారాహిత్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణిస్తోంది. బాధ్యులపై తగిన సమయంలో తగిన చర్యలు ఉంటాయి’ అని రమేశ్‌కుమార్ స్పష్టం చేశారు.
ఉద్యోగ సంఘాల తీరు సరికాదు
‘ఎన్నికల్లో అక్రమాల్ని సహించం. ముఖ్యంగా ఏకగ్రీవాలపై కమిషన్ ప్రత్యేక దృష్టి పెడుతుంది. ఐజీ స్థాయి పోలీసు అధికారి పర్యవేక్షణలో అక్రమాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలన్న దృఢసంకల్పంతో కమిషన్ ఉంది. ఎన్నికలపై కొన్ని ఉద్యోగ సంఘాలు కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. దేశమంతటా ఎన్నికలు జరుగుతుంటే రాష్ట్రంలో ఎన్నికలు వద్దని కోరుకోవడం సరికాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలే పాలకులు. మనం సేవకులం. మనం నిబద్ధతతో ప్రజాహితం, సంక్షేమం కోసం పనిచేయాలన్న వాదనను విస్మరిస్తే దుష్ఫలితాలుంటాయి. ఎన్నికల్ని నిరవధికంగాగానీ, పాక్షికంగాగానీ వాయిదా వేయాలన్న వాదనలో హేతబద్ధత కనపడనందుకే తిరస్కరించా తప్ప వేరే కారణం లేదు. ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయడానికి గవర్నరు నుంచి పూర్తి తోడ్పాటు లభిస్తుందన్న భరోసాతో ఉన్నాం. కమిషన్‌కు న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం, గౌరవం, విశ్వాసం, విధేయత ఉన్నాయి. ఇకపైనా ఉంటాయి. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కమిషన్ వెంటనే అమలు చేసింది. సోమవారం సుప్రీంకోర్టులో తుది నిర్ణయం ఏదైనా వస్తే దాన్నీ తప్పనిసరిగా పాటిస్తాం’ అని తెలిపారు.
సీఎస్ లేఖ నాకంటే ముందే మీడియాకా?
‘గవర్నరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వంటి రాజ్యాంగబద్ధ, ఉన్నత పదవుల్లో ఉన్నవారి మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలు గోప్యంగా ఉంచాలి. ఇంత వరకు గవర్నరు, సీఎస్‌లతో ఎస్‌ఈసీ నిర్వహించిన సంప్రదింపులేవీ పత్రికాముఖంగా బహిరంగపరచలేదు. కానీ శుక్రవారం సీఎస్ రాసిన లేఖ నాకు చేరడానికి ముందే పత్రికలు, ఛానళ్లకు వెళ్లింది. ఇక మీదటైనా విధివిధానాల్ని, మంచి సంస్కృతిని, గోప్యతను పాటించాలని కోరుతున్నా. మన మధ్య జరిగే ఉత్తర ప్రత్యుత్తరాలకు సమాచార హక్కు చట్టం నుంచీ మినహాయింపు ఉంది. ఆ నిబంధనల్ని మనమే తోసిరాజనడం సరికాదని కమిషన్ భావిస్తోంది’ అని ఎస్‌ఈసీ పేర్కొన్నారు.
ఇవి చరిత్రాత్మక ఎన్నికలు