Sister Stody: ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు పడుకున్న చెల్లిని కనిపెట్టుకుని కూర్చున్న బాలిక పేరు రేవతి. మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. వ్యవసాయమే వీరి కుటుంబానికి జీవనాధారం. తండ్రి తనకున్న మూడెకరాలలో వ్యవసాయం చేస్తుండగా తల్లి కూలి పనులకు వెళ్తుంది. కొన్ని రోజులుగా రేవతి తల్లిదండ్రులు సాగు పనులతో విరామం లేకుండా ఉండటంతో.. తన చిన్న చెల్లి వర్షిణిని ఉదయం తనతోపాటే బడికి తీసుకువచ్చి సాయంత్రం వరకు ఉంచుకుంటోంది.
Good Sister: ఆలనలో అమ్మ..చదువులో సరస్వతీ.. ఇది ఓ అక్క కథ
సాధారణంగా చిన్న వయస్సులో బడికి వెళ్లాలంటేనే కొంతమంది మారాం చేస్తారు.. ఎప్పుడు పాఠశాలకు సెలవులు వస్తాయా.. ఇంటి దగ్గర టీవీ చూస్తూ, ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేద్దామా అనుకుంటారు నేటికాలం పిల్లలు. కానీ ఈ అమ్మాయి మాత్రం చిన్న వయస్సులోనే బాధ్యతలు తెలిసిన ఓ అక్కగా తల్లిదండ్రులు బడికి వద్దన్నా.. చదువుకోవాలనే జిజ్ఞాసతో.. ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు తన చెల్లిని పాఠశాలకు తీసుకెళ్లి ఆలనాపాలనా చూసుకుంటోంది.
చిన్నారిని అంగన్‌వాడీలో చేర్పించే ప్రయత్నం చేయగా.. అక్కడ ఉండకపోవడంతో తల్లిదండ్రులు రేవతిని ఇంటివద్దే ఉండి చెల్లిని చూసుకోవాలని సూచించారు. కాగా.. చదువు మీద శ్రద్ధతో ఆమె చిన్నారిని తన వెంట ఇలా పాఠశాలకు తీసుకువస్తోంది. రేవతి మరో ఇద్దరు చెల్లెళ్లు సింధు, నందిక కూడా ఇదే బడిలో నాలుగు, రెండో తరగతి చదువుతున్నారు. వారు చిన్నగా ఉన్నప్పుడు రేవతి ఇలాగే పాఠశాలకు తీసుకువచ్చి జాగ్రత్తగా చూసుకునేదని, చదువులోనూ చురుగ్గా ఉంటుందని ప్రధానోపాధ్యాయురాలు హేమలత తెలిపారు.
ఇవీ చదవండి..