ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మరుగుదొడ్డే ఆ అవ్వ నివాసం!

వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కొడుకులు లేరు. కష్టసుఖాల్లో చివరి వరకు అండగా ఉంటాడనుకున్న జీవిత భాగస్వామి 16 ఏళ్ల క్రితమే కన్నుమూశాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. పొట్ట నింపుకోవడానికి పనికెళ్లాలన్నా వయసు సహకరించడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే పింఛనే.. ఆ అవ్వకు ఆసరాగా మారింది. స్వచ్ఛభారత్‌ పథకంలో నిర్మాణం చేసిన మరుగుదొడ్డి నివాసమైంది. ఇదీ.. రామన్న పేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు లక్ష్మమ్మ దీనగాథ. నా అనే వాళ్లు లేక, ఉండటానికి నివాసం లేక వృద్ధాప్యంలో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న ఆ అభాగ్యురాలి వ్యథపై ‘ఈటీవీ భారత్​ కథనం.

an-old-women-residence-in-the-toilet

By

Published : Oct 28, 2019, 2:06 PM IST

ఆ అవ్వకు మరుగుదొడ్డే నివాసం

తెలంగాణ రాష్ట్రం... యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామానికి చెందిన గట్టు లక్ష్మమ్మది నిరుపేద కుటుంబం. ఆమె భర్త చెన్నయ్య 16 ఏళ్ల క్రితం మృతి చెందాడు. భర్త మరణం తర్వాత తనకున్న పూరి గుడిసెలో జీవనం సాగిస్తూ కూలి పనులు చేసుకుంటూ కుమార్తెను పోషించేది. కూతురికి ఆరేళ్ల క్రితం వివాహం జరిపించింది. మూడు నెలల క్రితం ఈదురుగాలులు, వర్షాలకు లక్ష్మమ్మ పూరి గుడిసె నేలమట్టమైంది. తన గూడు చెదిరిపోవడంతో లక్ష్మమ్మకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది.

మరుగుదొడ్డిలో జీవనం

కొద్దిరోజులు ఆరుబయట వండుకొని తింటూ చుట్టుపక్కల వాళ్ల ఇళ్లలో నిద్రించేది. మరికొద్ది రోజులు కూతురు వద్ద ఉంది. ప్రస్తుతం లక్ష్మమ్మ స్వచ్ఛభారత్ మిషన్‌లో భాగంగా నిర్మించిన మరుగుదొడ్డిలో జీవనం సాగిస్తోంది. వర్షాలు లేనపుడు ఆరుబయట వంట చేసుకుంటుంది. వర్షాలు పడిన సమయాల్లో చాలా కష్టం అవుతోందని లక్ష్మమ్మ ఆవేదన వ్యక్తంచేస్తోంది.

చేయూతనిస్తే...

రేషన్​ సరుకులు, ఆసరా పింఛన్​ కోసమైనా లక్ష్మమ్మ ఊర్లో ఉండాల్సిన పరిస్థితి. మోత్కూర్​లో ఉంటున్న తన కూతురుకు భారం కాకూడదని దుబ్బాకలోనే ఉంటుంది లక్ష్మమ్మ. వృద్ధాప్యం రావడంతో కూలిపనులకు వెళ్లడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ఆసరా పింఛన్​, తన కూతురు పంపించే డబ్బులతో కాలం గడుపుతోంది. తనకు గూడు కట్టివ్వాలని దీనంగా వేడుకుంటోంది.

ABOUT THE AUTHOR

...view details