తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం పిల్లిగుండ్లతండాకు చెందిన బాదావత్ శ్రీరామ్ (65) భార్య కొంతకాలం కిందట మృతి చెందింది. ఇద్దరు కుమార్తెలకు వివాహం చేశారు. కుమారుడు ఉపాధి కోసం వేరే గ్రామంలో ఉంటున్నాడు. అప్పటినుంచి శ్రీరామ్ ఒంటరిగా జీవిస్తున్నారు. మూడు రోజుల కిందట కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లిన ఆయన... ఇంటి సమీపంలో ఉన్న ఇనుప కంచెలో చిక్కుకున్నారు.
దానిని విడిపించుకుని బయటకు వచ్చే శక్తిలేక... అక్కడే ఉండిపోయాడు. మూడు రోజులుగా అక్కడే పడి ఉన్న వృద్ధుడిని ఎవరూ గుర్తించలేకపోయారు. బుధవారం అంగన్‌వాడీ టీచర్ సుజాత గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తొర్రూరు ఎస్సై సతీష్, కానిస్టేబుల్ సాయికృష్ణ అక్కడికి వచ్చారు. వృద్ధుడిని కంచె నుంచి బయటకు తీసుకొచ్చి, జిల్లా కేంద్రంలోని వృద్ధాశ్రమానికి తరలించారు.