ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఆ యునివర్సిటీలో వసూళ్లు.. అడిగినంత ఇవ్వకుంటే వేధింపులు.. - వర్సిటీలో వసూల్‌ రాజా

Telangana University News: తెలంగాణ యూనివర్సిటీలో తనిఖీల పేరిట ఓ కీలక అధికారి ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘అడిగినంత ఇవ్వండి.. లేకుంటే మీ ఇష్టమ’ని బెదిరిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని యాజమాన్యాలు వాపోతున్నాయి.

Telangana University News
తెలంగాణ యూనివర్సిటీలో వసూళ్లు

By

Published : Jul 2, 2022, 10:25 AM IST

Telangana University News: తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఓ కీలక అధికారి తనిఖీల పేరుతో ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘అడిగినంత ఇవ్వండి.. లేకుంటే మీ ఇష్టమ’ని బెదిరిస్తున్నట్లు సమాచారం. అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న చిన్నాచితకా కళాశాలల యజమానులు ఆయన నుంచి ఫోన్‌ వచ్చినా.. పిలుపు వచ్చినా వణికిపోతున్నారు. పలువురు ఎమ్మెల్యేలతోపాటు ఇద్దరు ముగ్గురు మంత్రులను కొన్ని కళాశాలల యజమానులు కలిసి తమ గోడును వెల్లబోసుకున్నట్లు తెలిసింది. అయినా ఫలితం లేదని వారు వాపోతున్నారు.

ఉన్నతాధికారుల హెచ్చరికలూ బేఖాతరు..

విశ్వవిద్యాలయంలో కీలక పదవిలో ఉన్న ఆ అధికారి వచ్చీరావడంతోనే ‘ఆదాయ మార్గాల’ అన్వేషణ మొదలుపెట్టారు. తాను పెద్దమొత్తంలో ఖర్చు చేసి ఈ పదవిని చేజిక్కించుకున్నానని స్వయంగా చెప్పుకొనే ఆయన.. దాన్ని రాబట్టేందుకు పరికరాలను, వస్తువులను ఇష్టారాజ్యంగా కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇప్పటికే ఎక్కువ మంది ఉన్నా.. పదుల సంఖ్యలో కొత్త నియామకాలు చేపట్టారు. అందుకు బేరాలు కుదుర్చుకున్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని నియామకాలను నిలిపివేసింది. ఆయనను ఉన్నతాధికారులు పలుమార్లు హైదరాబాద్‌కు పిలిపించి హెచ్చరించినా మార్పు రాలేదు. నియామకాలు ఆగిపోవడం.. బోధన, బోధనేతర ఉద్యోగాలను ఉమ్మడి బోర్డు ద్వారా భర్తీ చేస్తుండటంతో ఆయన కొత్త ఆదాయ మార్గాలను వెతికారు. ప్రైవేట్‌ డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుబంధ గుర్తింపు, తనిఖీలను ఇందుకు ఆసరాగా చేసుకున్నారు. చిన్న చిన్న కళాశాలలనే కాదు.. యూజీసీ స్వయంప్రతిపత్తి ఉన్న కాలేజీలనూ వదలడం లేదు.

విద్యార్థికి రూ.వెయ్యి చొప్పున..

ర్సిటీ పరిధిలో సుమారు 60 కళాశాలలున్నాయి. కొద్ది నెలల క్రితం ఆ అధికారి కళాశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేయించారు. వాటి నివేదికలను బయటపెడతానంటూ భయపెట్టి... ఎంపిక చేసిన కాలేజీల నుంచి భారీగా వసూలు చేశారు. తాజాగా కొత్త విద్యా సంవత్సరానికి(2022-23) కళాశాలలో ఉన్న ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి చొప్పున ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంటే ఒక కళాశాలలో 200 మంది ఉంటే రూ.2 లక్షలు సమర్పించుకోవాలన్నమాట. అంతంతమాత్రంగా నడుస్తున్న ఓ కళాశాల యజమాని.. సొంత ఇంటి నిర్మాణం ప్రారంభించారు. రూ.లక్షలు ఇవ్వాలని ఆయనను డిమాండ్‌ చేయడంతో ఇటీవల ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది.

ఎక్కడ తనిఖీల పేరిట ఇబ్బంది పెడతారోనని వసూళ్ల పర్వం గురించి బహిరంగంగా చెప్పేందుకు రాజకీయ పలుకుబడి ఉన్న యజమానులూ జంకుతున్నారు. నిజామాబాద్‌లో తనది ప్రముఖ కళాశాల అయినా ఇబ్బంది పడుతున్నానని, ఎక్కువ మంది విద్యార్థులు ఉండటంతో రూ.15 లక్షలు డిమాండ్‌ చేస్తున్నారని ఓ యజమాని ఈటీవీ-భారత్​తో వాపోయారు. ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల రాష్ట్ర సంఘం దృష్టికి ఈ వ్యవహారాన్ని తీసుకెళ్లారు. ఆ సంఘం రాష్ట్ర ప్రతినిధులు ఇటీవల నిజామాబాద్‌కు వెళ్లి రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధుల దృష్టికీ తీసుకెళ్తామని, ఎవరూ భయపడొద్దని, ఆత్మహత్య ఆలోచనలు మానుకోవాలని భరోసా ఇచ్చారు. ఆ అధికారిపై చర్య తీసుకుంటే తమ ప్రభుత్వం ఎక్కడ ఇరుకున పడుతుందోనని రాష్ట్రస్థాయి ప్రజాప్రతినిధులు సైతం తమ నిస్సహాయతను వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details