రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిన ఉద్దండరాయునిపాలెం వద్ద రైతులు, మహిళలు మరోసారి ఆందోళనకు దిగారు. రాజధానికి మకుటాయమానంగా మారుతుందనుకున్న ఐకానిక్ వంతెన ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బృహత్తర ప్రణాళిక (మాస్టర్ ప్లాన్) మేరకు రాజధానికి ముఖద్వారంలా కూచిపూడి భంగిమలో ఉద్దండరాయునిపాలెం వద్ద ఐకానిక్ వంతెన నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. జాతీయ రహదారికి అనుసంధానంగా గుంటూరు, కృష్ణా జిల్లాలను కలుపుతూ దీన్ని నిర్మించాలనుకున్నారు. జనవరి 11, 2019న నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఉద్దండరాయునిపాలెం నుంచి కృష్ణా జిల్లాలోని గొల్లపూడి వరకు 3.2 కి.మీ. పొడవునా నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్‌అండ్‌టీ పనులు చేపట్టింది.
కృష్ణా నది కరకట్టకు ఆనుకొని వంతెన ప్రారంభమయ్యే ప్రాంతంలో గుత్తేదారు సంస్థ ర్యాంపులను ఏర్పాటు చేసింది. కొద్ది రోజులుగా సంస్థ ప్రతినిధులు వాటిని జేసీబీలతో పగులగొడుతున్నారు. విషయం తెలుసుకున్న రాజధాని రైతులు, మహిళలు శనివారం అక్కడికి చేరుకొని అడుకున్నారు. పగులగొట్టిన ప్లాట్‌ఫాంపై నిల్చొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దళిత ఐకాస నాయకులు, మహిళలు మాట్లాడుతూ రాజధానిని నిర్వీర్యం చేయడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. బిల్లులు చెల్లించలేదన్న గుత్తేదారు సంస్థ పనిగట్టుకొని ప్లాట్‌ఫాంను ఎందుకు కూల్చివేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం కావాలనే ఆ సంస్థ చేత అలా చెప్పిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు.