రాజధాని అమరావతికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా శాఖల కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేసేందుకు ఆ ప్రాంత రైతులు దిల్లీకి పయనమయ్యారు. రాజధాని అమరావతి ఉద్యమంలో భాగస్వాములైన అన్ని ఐకాసల ప్రతినిధులు, రైతులు, మహిళలు వెళ్లారు. రైతు ఐకాస కన్వీనర్ సుధాకర్, అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుడు బాలకోటయ్య, మహిళా ఐకాస నేతలు సుంకర పద్మశ్రీ, శిరీష తదితరుల నేతృత్వంలో 115 మందితో కూడిన బృందం దిల్లీ బయలుదేరి వెళ్లింది.
హస్తినకు అమరావతి అన్నదాతలు... నాలుగు రోజుల పాటు.. - Amravati farmers news
దిల్లీకి అమరావతి రైతులు పయనమయ్యారు. నాలుగు రోజుల పాటు అక్కడ పలువురు కేంద్రమంత్రులను కలువనున్నారు. రాజధాని అమరావతికి కేటాయించిన కేంద్ర ప్రభుత్వ సంస్థలను త్వరితగతిన ప్రారంభించాలని ఆయా శాఖల కేంద్రమంత్రులను కలిసి విజ్ఞప్తి చేయనున్నారు.
అమరావతిలో 42 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు భూములు కేటాయించారు. కేంద్రమంత్రులతో పాటు ఆయా సంస్థల హెచ్‌వోడీ అధికారులను కలిసి త్వరితగతిన నిర్మాణాలను చేపట్టాలని కోరనున్నారు. కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్‌నాథ్‌సింగ్, నితిన్ గడ్కరీ, రామ్‌దాస్ అథవాలే, పీయూష్ గోయల్ తదితర మంత్రులను కలవనున్నారు. వీరిలో కొందరు మంత్రుల అపాయింట్‌మెంట్ ఇప్పటికే ఖరారైనట్టు సమాచారం. అన్ని పార్టీల పెద్దలను కలిసి రాజధాని అమరావతి నిర్మాణానికి సహకారం అందించాలని కోరనున్నారు. నాలుగు రోజులపాటు రైతులు దిల్లీలో పర్యటించనున్నారు.