రాజధాని ప్రాంత ప్రాధికార అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)కు అమరావతి రాజధాని రైతులు నోటీసులు ఇచ్చారు. నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. రెరా సుమోటోగా సీఆర్‌డీఏనే తమ పరిధిలోకి తీసుకోవాలని రైతులు కోరారు.నిర్ణీత గడువులోగా తమ ప్లాట్లను అభివృద్ధి చేసి ఇవ్వనందుకు ఆలస్యానికి పరిహారం చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. 'మాకు వంశపారంపర్యంగా వచ్చిన భూమిని రాజధాని కోసం త్యాగం చేశాం. మా జీవనానికి ఇబ్బంది అని తెలిసినా, ఆ భూమితో ఉన్న భావోద్వేగ అనుబంధాన్నీ తెంచుకుని సమీకరణలో ఇచ్చేశాం. బదులుగా సీఆర్‌డీఏ చట్టం కింద... రాజధానిలో అభివృద్ధి చేసిన నివాస, వాణిజ్య ప్లాట్లను ఇస్తామన్నారు. ఇప్పటికీ హామీని నిలబెట్టుకోలేదు’ అని రాజధాని రైతులు సీఆర్‌డీఏ కమిషనరు దృష్టికి తీసుకొచ్చారు. అభివృద్ధి చేసిన ప్లాట్ల స్వాధీనంలో జరుగుతున్న జాప్యంపై హైకోర్టు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ద్వారా కంచర్ల ఓంకార్, తదితర రైతులు సీఆర్‌డీఏ కమిషనరుకు లీగల్ నోటీసులిచ్చారు. పరిహారం చెల్లించాలని డిమాండు చేశారు.
నోటీసుల్లో ఏం ఉందంటే...
‘భూ సమీకరణ పథకంలోని నిబంధనల ప్రకారం తుది ప్రకటన ఇచ్చిన ఏడాదిలోగా ప్లాట్ల విభజన, రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. భౌతికంగా ప్లాట్లను స్వాధీనం చేయాల్సి ఉంది. మూడేళ్లలోగా మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేయాల్సి ఉంది. తుది ప్రకటనను 2016 డిసెంబరు 30న సీఆర్‌డీఏ ఇచ్చింది. 2019 నుంచి రాజధానిలో అన్ని రకాల అభివృద్ధి, మౌలిక వసతుల పనులూ ఆగిపోయాయి. ఈ చర్యలు మమ్మల్ని ఆర్థికంగా, మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆదాయం కోల్పోయి అప్పులతో బతుకులీడ్చాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని భూ సమీకరణ చట్టంలో పేర్కొన్న విధంగా అభివృద్ధి చేయాలి. మౌలిక వసతులతో కూడిన ప్లాట్లను అప్పగించాలి. దీంతోపాటు జాప్యం జరిగిన కాలానికి నివాస ప్లాట్‌కు చ.గజానికి నెలకు రూ.100 చొప్పున, వాణిజ్య ప్లాట్‌కు నెలకు రూ.150 పరిహారంగా చెల్లించాలి. సీఆర్‌డీఏకు స్వాధీనం చేసిన ప్రతి ఎకరా వ్యవసాయ భూమికీ రూ.3 లక్షలు తక్కువ కాకుండా చెల్లించాలి. విఫలమైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మా హక్కుల పరిరక్షణకు హైకోర్టును ఆశ్రయిస్తాం’ అని పేర్కొన్నారు.