ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'తమది ధర్మపోరాటం...ఉద్యమాన్ని ఆపేది లేదు' - capital city vishakapatnam

కరోనా వైరస్ భయపెడుతున్నా... జోరు వర్షాలు ఇబ్బంది పెడుతున్నా...రాజధాని రైతులు మాత్రం పట్టు వీడటం లేదు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా వరుసగా 244వ రోజూ నిరసనలు కొనసాగించారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాల కేటాయింపు, ఆర్ 5 జోన్లపై రాష్ట్రప్రభుత్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో రాజధాని రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు.

Amravati farmers
Amravati farmers

By

Published : Aug 17, 2020, 10:21 PM IST

రాజధాని అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రైతులు, మహిళలు నిరసనోద్యమాన్ని ఉద్ధృతం చేశారు. ప్రతికూల పరిస్థితులకు ఎదురొడ్డి పోరాడుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, సీఆర్డీయే చట్టం రద్దుకు గవర్నర్ ఆమోదం తర్వాత రైతులు, మహిళలు ఇళ్లను వదిలి మలిదశ ఉద్యమాన్ని శిబిరాల్లోనే చేపడుతున్నారు. కరోనా నేపథ్యంలో ఓవైపు భౌతికదూరం పాటిస్తూనే... మూడు రాజధానులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపిస్తున్నారు.

సుప్రీం తీర్పుపై హర్షం...

రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు, ఆర్​-5 జోన్​పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రైతులు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ వివాదానికి సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులనే సుప్రీంకోర్టు సమర్థించిందన్న రైతులు.. రాజధాని కోసం ఇచ్చిన భూముల్లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లస్థలాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఓవైపు తాము ఉనికి, భవిష్యత్​ కోసం 244 రోజులుగా పోరాడుతుంటే ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ మండిపడ్డారు. గత ప్రభుత్వం చెప్పిన మాదిరిగానే ఇక్కడ నవనగరాలు నిర్మించాలని రైతులు, మహిళలు డిమాండ్ చేశారు.

రాజధాని అమరావతి పరిరక్షణ కోసం జరుగుతున్న పోరాటం 29 గ్రామాలది కాదని.... 13 జిల్లాలకు చెందిన 5కోట్ల మంది ప్రజలదని రైతులు, మహిళలు స్పష్టం చేశారు. తమ ఉద్యమానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతాలకతీతంగా సంఘీభావం తెలపాలంటూ తుళ్లూరులో రైతులు, మహిళలు జోలెపట్టి అభ్యర్థించారు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రాభివృద్ధి ప్రమాదంలో పడిందని... తమ మనోవేదనను 13 జిల్లాల ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. తమది న్యాయపోరాటం, ధర్మపోరాటమన్న రైతులు, మహిళలు... న్యాయం జరిగే వరకు పోరుబాటను వీడబోమని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి

'అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీపై హైకోర్టు తీర్పును సమర్ధించిన సుప్రీం'

ABOUT THE AUTHOR

...view details