రాజధాని అమరావతిలో ప్రస్తుతం ఉన్న 25 గ్రామపంచాయతీలతో పాటు, కొత్తగా మూడు పంచాయతీలను కలిపి అమరావతి కేపిటల్ సిటీ మున్సిపల్ కార్పొరేషన్ (ఏసీసీఎంసీ) ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ చట్టం రద్దు బిల్లులు ఇంకా చట్టరూపం దాల్చకముందే.. ప్రభుత్వం ఏసీసీఎంసీ ఏర్పాటుకు తెరతీసింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల్లో 25 గ్రామ పంచాయతీలు (శివారు గ్రామాలతో కలిపి మొత్తం 29 గ్రామాలు) ప్రస్తుతం రాజధాని పరిధిలో ఉన్నాయి. తుళ్లూరు మండలంలో 19 పంచాయతీలుండగా, ఇదివరకు 16 పంచాయతీల్నే రాజధాని పరిధిలోకి తెచ్చారు. పెదపరిమి, వడ్డమాను, హరిశ్చంద్రపురం పంచాయతీలనూ ఇప్పుడు ఏసీసీఎంసీ పరిధిలోకి తేనున్నారు. దీనిపై ఆయా గ్రామాల ప్రజల నుంచి అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియ ప్రారంభించారు. పెదపరిమిలో శుక్రవారం గ్రామసభ నిర్వహించారు. దీనిపై గ్రామస్థులకు సమాచారం లేక ఎక్కువమంది రాలేదు. విలీనానికి గ్రామప్రజలు ఆమోదం చెబుతూ తీర్మానం ఆమోదించినట్లు అధికారులు పేర్కొన్నారు. అందరికీ సమాచారం ఇవ్వకుండానే గ్రామసభ ఎలా నిర్వహించారని అధికారులను మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. మంగళవారం రాత్రి గ్రామంలోని మైకులో చెప్పామని, 200 మంది వరకు వచ్చారని మొదట చెప్పారు. శుక్రవారం సాయంత్రం పెదపరిమి గ్రామ ప్రత్యేకాధికారి ఇ.సత్యకుమార్ పేరుతో ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు తక్కువగా రావడంతో గ్రామసభను సోమవారానికి వాయిదా వేసినట్టు పేర్కొన్నారు. పెదపరిమితో పాటు, వడ్డమాను, హరిశ్చంద్రపురం గ్రామాల్లోనూ సోమవారం గ్రామసభలు నిర్వహించనున్నారు.
ఈ నెల 9నే ఉత్తర్వులు..!
రాజధాని పరిధిలోని 25 గ్రామపంచాయతీలను ఏసీసీఎంసీలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఆయా పంచాయతీలకు షోకాజ్ నోటీసులు జారీచేసి, అభిప్రాయాలు, అభ్యంతరాలు స్వీకరించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ గిరిజాశంకర్ జనవరి 9న గుంటూరు జిల్లా పంచాయతీ అధికారికి మెమో జారీచేశారు. నోటీసు అందిన 10 రోజుల్లోగా అభిప్రాయాలు, అభ్యంతరాలు తెలియజేయాలని సూచించారు.