ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

అమ్మఒడి పథకం లబ్ధికి ఎదురుచూపులు.. తేలని అర్హుల జాబితా..! - ammavodi beneficiaries latest news

పేద వర్గాల విద్యార్థులకు చదువును చేరువ చేయడంతో పాటు నూరు శాతం అక్షరాస్యత సాధించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న అమ్మఒడి పథకం ద్వారా కొందరికి లబ్ధి చేకూరగా.. మరికొందరిలో నిరాశను మిగిల్చింది. అర్హులైనా తమకు నగదు జమ చేయలేదని పలువురు ఆరోపిస్తున్నారు. మరో 36 వేల మంది దరఖాస్తులు పునః పరిశీలనలో ఉండటంతో వారు ఆశావహ దృక్పథంతో ఎదురుచూస్తున్నారు.

ammavodi beneficiaries waiting for  payments
అమ్మఒడి పథకం లబ్ధికి ఎదురు చూపులు

By

Published : Jan 17, 2021, 3:30 PM IST

అమ్మఒడి పథకం ద్వారా ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ చదివే విద్యార్థి వరకూ కుటుంబానికి ఒకరు చొప్పున వారి తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం రూ.15 వేలు జమ చేస్తోంది. గత ఏడాది ప్రారంభించిన ఈ పథకం ద్వారా లబ్ధి పొందేందుకు జిల్లాలోని అన్ని యాజమాన్య విద్యాసంస్థలకు చెందిన 6.22 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు కుటుంబ ఆదాయం, విద్యుత్‌ బిల్లులు, ఆదాయపన్ను చెల్లింపు, తదితర అంశాలను ప్రామాణికంగా తొలుత 5.16 లక్షల మంది విద్యార్థులను ఎంపిక చేసినా.. రెండో విడత పరిశీలన అనంతరం 3.30 లక్షల మందిని అర్హులుగా నిర్ధరించి వారి తల్లుల ఖాతాలలో నగదు జమ చేశారు. హాజరు శాతం, విద్యుత్ బిల్లు విషయంలో సడలింపు వంటి వెసులుబాటు కల్పించి అందుకు తగిన విధంగా అర్హులైన వారికి మరో విడత లబ్ధి చేకూర్చేలా చేస్తామని ప్రకటించారు.

విద్యార్థులకు సంబంధించిన సమాచార సేకరణలో దొర్లిన పొరపాట్లు, కొన్నిచోట్ల ఉద్దేశపూర్వకంగా కొందరిని పక్కన పెట్టడం వంటి చర్యల కారణంగా అర్హులైన పలువురికి ప్రయోజనం చేకూరలేదన్న విమర్శలొచ్చాయి. ప్రస్తుత సంవత్సరానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాలను గడిచిన నవంబరు నాటికే సిద్ధం చేయాలని సూచించినా.. అర్హుల పరిశీలనా కార్యక్రమం, సర్వర్‌ ఇబ్బందులు వంటి కారణాలతో డిసెంబరు నెలాఖరులో తుది జాబితాను సిద్ధం చేశారు. ప్రభుత్వం చేసిన తాజా సూచనల మేరకు గత ఏడాది లబ్ధిపొందిన వారిలో పలువురు ఈ ఏడాది అనర్హులుగా లెక్కతేలారు.

తొలిగా 5.34 లక్షలమంది అర్హులు..

ప్రస్తుత సంవత్సరానికి అధికార యంత్రాంగం తొలిగా 5.34 లక్షల మందిని పథకానికి అర్హులుగా భావించారు. తొలి పరిశీలన అనంతరం వారిలో అర్హులు (ఎలిజిబుల్‌), అనర్హులు (ఇన్‌ఎలిజిబుల్‌), విత్‌హెల్డ్‌ పేరుతో జాబితాలను విడుదల చేశారు. తక్కువ వేతనాలతో పనిచేసే అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తలు, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది, సచివాలయాల్లో పనిచేసే వారి పిల్లలు, ఆదాయపన్ను చెల్లించే వారు తదితర అంశాల ఆధారంగా కొందరి పేర్లను పథకానికి అనర్హులుగా గుర్తించారు. ఆధార్‌ నెంబరు, బ్యాంకు ఖాతా నెంబర్లలో పొరపాట్లు ఉన్న వారిని అర్హులుగా ఎంపిక చేయకుండా వారి జాబితాను విత్‌హెల్డ్‌లో ఉంచారు.

ప్రథమంగా విడుదల చేసిన జాబితా ప్రకారం వివిధ కారణాలతో దాదాపు 80,936 మంది విద్యార్థులను అనర్హుల జాబితాలో, 6,162 మందిని విత్‌హెల్డ్‌లో ఉంచారు. వీరి విషయంలో విద్యార్థులు తల్లిదండ్రుల ఆందోళన చెందడంతో అన్ని స్థాయిలో అనర్హుల జాబితాలను పరిశీలించి అందులో అర్హులను ఎంపిక చేసి అమ్మఒడి పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. మొత్తం మీద ఈ ఏడాది అత్యధిక సంఖ్యలో విజయవాడ అర్బన్‌ మండల పరిధిలో 1.64 లక్షల మంది విద్యార్థులు లబ్ధిపొందగా.. అత్యల్పంగా పెదపారుపూడి మండల పరిధిలో 2,596 మందికి ప్రయోజనం చేకూరింది. తిరస్కరణకు గురైన వారిలో 45,794 మందితో విజయవాడ అర్బన్‌ మొదటి స్థానంలో ఉండగా 238 మందితో తోట్లవల్లూరు మండలం ఆఖరి స్థానంలో ఉంది.

ప్రారంభమైన పునఃపరిశీలన..

తుది జాబితాల్లో మొత్తం 36వేలకు పైగా దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. బ్యాంకు ఖాతాలు సక్రమంగా లేకపోవడం, ఆధార్‌ నమోదులో పొరపాట్లు వంటి కారణాలతో వీటిని పునః పరిశీలన కోసం ఉంచారు. వీటిని తక్షణం పరిశీలించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు మంగళవారం నుంచి పరిశీలన ప్రారంభించారు. వెబ్‌సైట్‌లో ఎడిట్‌ ఆప్షన్‌కూడా అందుబాటులోకి వచ్చినట్టు విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. పరిశీలన అనంతరం అర్హులకు లబ్ధి చేకూర్చేలా చర్యలు తీసుకుంటామన్నారు.

ఆరో దశ పరిశీలన అనంతరం..

పథకం పొందేందుకు అర్హులుగా గుర్తించిన వారు 5,15,408 మంది

అనర్హులు 1,25,035 మంది

పునఃపరిశీలనలో ఉన్న దరఖాస్తులు 36,913

ఇప్పటివరకు జమ చేసిన నగదు రూ.77.31 కోట్లు

ఇదీ చదవండి: ఇంటర్‌ ప్రవేశాల్లో రాయితీల రద్దు.. పేదల చదువుకు పెను భారం

ABOUT THE AUTHOR

...view details