నదుల్లో నీటి లభ్యత తగ్గిన నేపథ్యంలో నదీపరీవాహక ప్రాంత రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపిణీ విధానాన్ని పున:సమీక్షించాలని దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కోరారు. అందుబాటులో ఉన్న జలాల్ని ఎగువ రాష్ట్రాలు తమకు కేటాయించిన వాటా ప్రకారం వాడేసుకోవటం వల్ల దిగువ రాష్ట్రాలు ఇబ్బందులు పడుతున్నాయని ప్రస్తావించారు. 15 రోజులకోసారి నదుల్లో నీటి లభ్యతను సమీక్షించుకుని, ఆయా రాష్ట్రాలకు నిర్ణయించిన కేటాయింపుల దామాషాలో నీటి పంపిణీ జరగాలని జగన్ ప్రతిపాదించారు. సమావేశంలో 26 ఎజెండా అంశాలపై చర్చ జరిగింది.
పోలవరం ప్రాజెక్టుకు కొత్త డీపీఆర్ ప్రకారం కేంద్రం నిధులు కేటాయించాలని, పెట్టుబడి అనుమతివ్వాలని, విభజన చట్టంలోని అంశాలన్నీ నెరవేర్చాలని ఆంధ్రప్రదేశ్ ప్రధానంగా కోరింది. అధికార వర్గాల సమాచారం ప్రకారం.. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) ప్రతిపాదించిన గోదావరి నుంచి కావేరి వరకు నదుల అనుసంధానంపై చర్చ జరిగింది. గోదావరిలో నీటి లభ్యత తగ్గినందున రాష్ట్ర అవసరాలు తీరిన తర్వాతే నీటిని తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ స్పష్టం చేసింది. గోదావరి- కృష్ణా నదుల్ని అనుసంధానిస్తే ఎగువ రాష్ట్రాలకు నీరివ్వాలన్న కేడబ్ల్యూడీ అవార్డు ప్రకారం తమకు జలాలు కేటాయించాలని కర్ణాటక కోరింది. అమిత్‌షా స్పందిస్తూ.. నదుల అనుసంధానంపై రాష్ట్రాలు ఓ అంగీకారానికి వస్తే, వాటి అభిప్రాయాల్నీ పరిగణనలోకి తీసుకుని డీపీఆర్ సిద్ధం చేసి ముందుకెళతామని చెప్పినట్టు తెలిసింది.
*తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నై తాగునీటి అవసరాలకు ఆంధ్రప్రదేశ్ 16-17 టీఎంసీల నీళ్లిస్తున్నామని.. కుప్పం సమీపంలో పాలార్ నదిపై 0.6 టీఎంసీలిచ్చే బ్యారేజీ నిర్మాణానికి తమిళనాడు సహకరించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. కుప్పం ప్రజల తాగునీటి అవసరాలు తీర్చేందుకు సహకరించాలంది. దీనికి అటవీశాఖ నుంచి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై తమిళనాడు సానుకూలంగా స్పందించలేదని సమాచారం. పాలార్‌పై ఎగువన తమకూ ప్రాజెక్ట్‌లు అవసరం ఉందని, ఏపీ విజ్ఞప్తిని పరిశీలిస్తామని చెప్పినట్టు తెలిసింది.
*తెలుగుగంగ ప్రాజెక్టు ద్వారా చెన్నైకి నీరు సరఫరా చేసినందుకు తమిళనాడు ఇవ్వాల్సిన రూ.340 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏపీ కోరింది. ఆంధ్రప్రదేశ్ కంటే తమిళనాడు పెద్ద రాష్ట్రమని, వారికి ఆదాయాన్నిచ్చే చెన్నై వంటి మహానగరం కూడా ఉందని జగన్ నవ్వుతూ వ్యాఖ్యానించినట్టు సమాచారం. చెన్నైను వరదలు ముంచెత్తాయని, తమకూ సమస్యలున్నాయని, వీలు చూసుకుని బకాయిలు చెల్లిస్తామని ఆ రాష్ట్ర ప్రతినిధులు చెప్పినట్టు సమాచారం.
*తెలంగాణ చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాలపై కర్ణాటక అభ్యంతరం తెలియజేసింది. వాటి డీపీఆర్‌లు కేంద్రానికి పంపించాలని అమిత్‌షా సూచించినట్టు తెలిసింది.
విద్యుత్ బకాయిలపై త్వరలో సమావేశం
తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిల్ని వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ కోరింది. ఇరు రాష్ట్రాల మధ్య విద్యుత్ కంపెనీల లావాదేవీల ప్రక్రియ తేలనందున బకాయిలు చెల్లించలేమని తెలంగాణ స్పష్టం చేసినట్టు తెలిసింది. దీనిపై రెండు రాష్ట్రాలు బలంగా వాదనలు వినిపించాయి. అమిత్‌షా జోక్యం చేసుకుని త్వరలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి, సమస్యను సామరస్యంగా పరిష్కరిద్దామని చెప్పారు.
గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి నిధులిస్తాం
ఏపీలో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రానికి నిధులు కేటాయించేందుకు అమిత్‌షా అంగీకరించారు.అయితే దానిలో సగం మంది కేంద్ర బలగాలకు శిక్షణ ఇవ్వాలని స్పష్టంచేశారు.