తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కమలనాథులు (bjp) అందివచ్చిన ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవటానికి ఇష్టపడడం లేదు. తెరాస ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ వస్తోన్న భాజపా నాయకులు... కేసీఆర్ (kcr) నియంతృత్వ, అవినీతి, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) ఇప్పటికే ప్రజా సంగ్రామ యాత్ర (praja sangrama yatra) పేరుతో ప్రజల్లోకి వెళ్లారు. తెరాస ఇచ్చిన హామీలను అమలు చేయించడంతో పాటు ప్రజా వ్యతిరేక విధానాలను తెలంగాణ సమాజానికి వివరిస్తూ పాదయాత్రలో బండి సంజయ్ ముందుకు సాగుతున్నారు.
సభకు అమిత్ షా హాజరు
అసెంబ్లీ ఎన్నికల వరకు పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఉండాలని కమలనాథులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికార తెరాసకు అసలైన ప్రత్యామ్నాయం భాజపాయేనన్న స్పష్టమైన సందేశం ప్రజలకు చేరవేయాలని యోచిస్తున్నారు. ఇందులో భాగంగా సెప్టెంబర్ 17న నిర్మల్‌లో నిర్వహించే సభకు (BJP public meeting) కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah )హాజరుకానుండడంతో సభను విజయవంతం చేయాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. సభను లక్షలాది మందితో నిర్వహించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాలని భావిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ...
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపాలని చాలా కాలంగా ప్రభుత్వాన్ని భాజపా డిమాండ్ చేస్తూ వస్తోంది. ఈసారి పార్టీ అధ్యక్షుడి పాదయాత్ర సాగుతోన్న సమయంలోనే వస్తుండటంతో దీనిని భాజపా ఒక అవకాశంగా భావిస్తోంది. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని రజాకార్లు మర్రిచెట్టుకు ఊచకోత కోసిన నిర్మల్ జిల్లా వెయ్యి ఊడలమర్రి వద్ధ భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. ఈ సభా వేదిక నుంచి మజ్లిస్ పార్టీ ఒత్తిడికి తలొగ్గే తెరాస సర్కార్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించటం లేదన్న విషయాన్ని సమాజానికి వివరించాలని నిర్ణయించింది. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామం ఇచ్చి నిర్మల్ సభలో పాల్గొననున్నట్లు భాజపా వర్గాలు వెల్లడించాయి.