ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Agriculture Problems in India: సాగు విధానం, పంట మార్పిడి అంశాలపై నిపుణుల మాటేంటి? - తెలంగాణ లేటెస్ట్ అప్డేట్స్

farmer needs in india: మద్దతు ధర ప్రకటించడం అనే విధానం అమెరికాలో లేదు. రైతులు ప్రభుత్వంతో కలసి గిట్టుబాటు ధర వచ్చేలా మార్కెటింగ్‌ అవకాశాలు కల్పించుకుంటారు. ఒకే రకమైన పంట పండించే రైతులు సంఘంగా ఏర్పడి బేరమాడి ఎక్కువ ధరకు అమ్ముకుంటారని అమెరికా వెళ్లి వ్యవసాయ శాస్త్రవేత్తగా స్థిరపడిన డాక్టర్‌ పీవీ వరప్రసాద్‌ చెప్పారు.

agriculture problems in India
agriculture problems in India

By

Published : Nov 30, 2021, 12:51 PM IST

Agricultural problems and solutions in india : రాష్ట్రంలో సాగు విధానం, పంట మార్పిడి, మార్కెటింగ్ సౌలభ్యం వంటి అంశాలపై నిపుణులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ‘‘సాగునీటి సమస్యలు, కూలీల కొరత వంటివి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. వాటిని అధిగమించాలంటే నీటి పొదుపు, అధునాతన టెక్నాలజీ ద్వారా పంటల సాగు వంటివి చేపట్టాలి.. ఇప్పుడు సాగుచేసే పంటలను కాకుండా ఇతర పంటలు వేస్తే ఏం ప్రయోజనాలుంటాయో రైతులకు వివరించగలిగితే వారు అటు మళ్లుతారు’’ అని డాక్టర్‌ పీవీ వరప్రసాద్‌ చెప్పారు. అమెరికాలోని కాన్సస్‌ రాష్ట్ర విశ్వవిద్యాలయం డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన వ్యవసాయం, సాగునీటిపై జరిగిన పరిశోధనల్లో పాలుపంచుకున్నారు. అమెరికా ప్రభుత్వం చేపట్టిన ‘సుస్థిర వ్యవసాయం’పై ప్రస్తుతం పరిశోధనలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా కాటూరు గ్రామానికి చెందిన వరప్రసాద్‌ హైదరాబాద్‌లో వ్యవసాయ పీజీ డిగ్రీ చదివి అమెరికా వెళ్లి వ్యవసాయ శాస్త్రవేత్తగా స్థిరపడ్డారు. హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంగా ఆయన ‘ఈనాడు-ఈటీవీభారత్​’కు ప్రత్యేక ఇంటర్య్వూ ఇచ్చారు.

  • అమెరికాలో సాగునీటి వివాదాలు, పంటలకు సాగునీటి కొరత వంటి ఇబ్బందులున్నాయా?
    American agriculture technology : అవును భూగర్భ జలాల వినియోగంపై ఒక్లహామా, టెక్సాస్‌, న్యూమెక్సికో తదితర 9 రాష్ట్రాల మధ్య గొడవలున్నాయి. అమెరికాలోని 9 రాష్ట్రాల భూగర్భంలో అతిపెద్ద జలనిధి విస్తరించి ఉంది. ఈ నీటిని వాడుకోవడంలో వాటి మధ్య వివాదాలున్నాయి. ఎగువ రాష్ట్రాల్లో ఎక్కువ బోర్లు వేసి అధికంగా వాడేస్తున్నారని దిగువ రాష్ట్రాల రైతులు గొడవలు చేస్తున్నారు. చేసేదిలేక భూగర్భజలాల వాడకంపై ఆంక్షలతోపాటు ఆ రాష్ట్రాల్లో పంటల మార్పిడి వైపు రైతులను ప్రోత్సహిస్తున్నారు. అధికంగా నీటిని వాడే మొక్కజొన్న వంటి పంటలు వద్దని తక్కువ నీటితో పండే జొన్న, పత్తి వంటివి సాగుచేయాలని చెబుతున్నారు.
  • పంటల మార్పిడిలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్యలేమిటి?
    మార్కెటింగ్‌ సమస్య ప్రధానం. కొత్త పంటలకు మళ్లితే వాటిని ఎక్కడ అమ్ముకోవాలనేది పెద్ద సమస్య అని అమెరికా రైతులు చెబుతున్నారు. ట్రంప్‌ ఉన్నప్పుడు చైనాతో వివాదాల కారణంగా సోయా దిగుమతులు ఆపేయడంతో దాన్ని అమ్మడానికి కొత్త మార్కెట్లను వెదకాల్సి వచ్చింది. ఇతర పంటల సాగుకు రైతులు వెంటనే మళ్లకపోవడంతో సోయాకు కొత్త మార్కెట్లను వెదికిపెట్టడానికి అమెరికా ప్రభుత్వం చాలా ప్రయత్నాలు చేసింది.
  • పంటల మార్పిడికి అక్కడి రైతులు సహకరిస్తున్నారా?
    American agricultural system : సాగునీటిని అధికంగా వాడే మొక్కజొన్న వంటి పంటలు సాగుచేస్తే కొన్నేళ్ల తరవాత భూగర్భజలాలు పూర్తిగా అడుగంటి కరవు పరిస్థితులొస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడే తక్కువ నీటిని వాడే ఇతర పంటలను సాగుచేస్తే భూగర్భ జలాలు ఎక్కువకాలం లభిస్తాయనడంతో కొందరు రైతులు అంగీకరించి పంటల మార్పిడికి ముందుకొచ్చారు. అలా వారికి అర్థమయ్యేలా చెప్పి, కలిగే లాభాలను వివరిస్తే కొత్తవాటికి మళ్లుతారు. ఇవేవీ చెప్పకుండా పంటల మార్పిడికి వెళ్లమంటే రైతులు వెళ్లరు. ఇప్పటికీ అమెరికాలోనూ కొందరు రైతులు వినడం లేదు.
  • వ్యవసాయ వర్సిటీల పరిశోధనలు పేద రైతులకు పెద్దగా ఉపయోగపడటం లేదనే విమర్శలున్నాయి కదా..?
    కాన్సస్‌ రాష్ట్రంలో ఎక్కువగా గోధుమ పంటను పండిస్తారు. వారు అమ్మే పంటపై వచ్చే సొమ్ము నుంచి కొంత నిధి ఏర్పాటుచేస్తారు. ఈ నిధి నుంచే వ్యవసాయ వర్సిటీలకు డబ్బు ఇచ్చి వారికేం కావాలో రైతులు చెబుతారు. శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. ఇప్పుడు అమెరికా, ఐరోపా దేశాల్లోని వ్యవసాయ వర్సిటీలు ‘కలసి సృష్టిస్తాం.. కలసి అభివృద్ధి చేస్తాం’ అనే విధానంతో పరిశోధనలు చేస్తున్నాయి. గతంలో శాస్త్రవేత్తలకు నచ్చిన అంశాలపై పరిశోధనలు చేసి వాటి ఆధారంగానే పంటలు సాగుచేసుకోండని రైతులకు చెప్పేవారు. భారత్‌లో వ్యవసాయ పరిశోధనా సంస్థలు ఇంకా అదే అనుసరిస్తున్నాయి. ఆ విధానం ఇప్పుడు పనికిరాదు. రైతులను కలసి వారి సమస్యలు, అవసరాలు తెలుసుకుని పరిశోధనలు చేసే విధానం రానంతకాలం పరిశోధన ఫలాలు పొలాలకు చేరవు.
  • ప్రభుత్వాలు రైతులకు ఏం చేయాలి?
    అమెరికా, ఐరోపాలో రైతుల అవసరాల మేరకు అక్కడి ప్రభుత్వాలు సాయపడతాయి. ఇక్కడా రైతుల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి మార్గాలు చూపాలి. అమెరికాలో పరిశోధన ఫలాలను వాడుకోవడంలో ఏం ఇబ్బందులున్నాయో తెలుసుకుని వాటిని అధిగమించేలా రాష్ట్ర ప్రభుత్వాలతో వర్సిటీలు మాట్లాడతాయి. ఇక్కడా అలా రైతుల సమస్యల పరిష్కారానికి వ్యవసాయ వర్సిటీలు, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ప్రణాళికను అమలుచేయాలి.
  • కూలీల కొరత అమెరికాతో పాటు ప్రపంచంలో ఎలా ఉంది?
    ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కూలీల కొరత తీవ్రంగా ఉంది. అమెరికాలో కూలీలు దొరకడం చాలా కష్టం. ఒక కూలీ రావాలంటే గంటకు 15 డాలర్లు తీసుకుంటారు. ఒక ఇంటిలో పనిచేయడానికి రోజుకు 150 డాలర్లు అడుగుతారు. ఇళ్లలో లేదా పొలాల్లో పనిచేసేవారు కావాలంటే చాలా ఖరీదైన వ్యవహారం. పంటల సాగు పనులన్నీ యంత్రాలతోనే చేస్తారు.
  • రైతుకు ఆదాయం పెరగాలంటే ఏం చేయాలి?

కాంబోడియాలో మా వర్సిటీ తరఫున ఒక ప్రయోగం చేశాం. గ్రామాల్లో ప్రతి రైతు పెరట్లో కూరగాయలు, పండ్లు పండించేలా మహిళలకు శిక్షణ ఇచ్చాం. వాటి వల్ల ఇల్లు గడవటానికి అవసరమైన సొమ్ము వస్తోంది. ఇలా రైతు కుటుంబాల్లో సామాజిక విప్లవం రావాలి. చిన్న, సన్న కారు రైతులు సంఘంగా ఏర్పడి పంటలు అమ్ముకోవాలి. తానే ధర చెప్పి అంతకు అమ్ముకునే స్థాయికి ఎదగనంత కాలం సన్నకారు రైతులకు ఆదాయం పెరగదు.

  • ఇండియాలో సన్న, చిన్నకారు రైతులకు ఆదాయం, లాభాలు రావాలంటే ఏం చేయాలి?
    పంటలకు సరైన ధర కల్పించడంతో పాటు వారి సామాజిక సమస్యల పైనా దృష్టిపెట్టాలి. అమెరికా, ఐరోపా దేశాల్లో రైతులకు అక్కడి ప్రభుత్వాలు సాయపడుతున్నాయి. వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా మార్చాలి. టెక్నాలజీ ఇవ్వడంతో సరిపోదు. ఆదాయం పెంచే పంటలను ప్రోత్సహించాలి.
  • పంట సాగు వ్యయం బాగా పెరుగుతోంది కదా, దాన్ని తగ్గించాలంటే ఏం చేయాలి?
    పొలం దున్నడం అనే పాత పద్ధతులను వదిలేస్తే సాగు ఖర్చు బాగా తగ్గుతుందని మా పరిశోధనల్లో తేలింది. వరికోతలు అయ్యాక గడ్డి తీయకుండా పొలంలోనే పరిస్తే అది కుళ్లి భూమిలో కలసి పోషకాలు అందుతాయి. బ్రెజిల్‌లో తొలుత మొక్కజొన్న వేసి అది కోసే యంత్రంతోనే వెంటనే సోయా విత్తనాలు నాటుతారు. భారతదేశంలో ఒక పంట కోయగానే పొలం దున్నుతారు. అసలు భూమి దున్నే విధానం కొన్ని దేశాల్లో పోయింది.

ఇదీ చదవండి:

Public Examinations: కరోనాతో పబ్లిక్‌ పరీక్షలు ప్రశ్నార్థకం.. అంతర్గత పరీక్షలే కీలకం!

ABOUT THE AUTHOR

...view details