నవరత్నాల్లో భాగంగా వ్యవసాయ ఉచిత విద్యుత్తుకు రూ. 8400 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం వెల్లడించింది. 18 లక్షల వ్యవసాయ వినియోగదారులకు 12 వేల మిలియన్ యూనిట్లు సరఫరా చేస్తోన్నట్టు స్పష్టం చేసింది. రాబోయే 30 ఏళ్లపాటు రైతులపై భారం పడకుండా ఉచిత విద్యుత్ పథకం అమలుకు కసరత్తు చేస్తోంది.
ఇకపై రైతుల ఖాతాల్లోకే విద్యుత్ ఉచిత రాయితీ - ఏపీ తాజా వార్తలు
వ్యవసాయ ఉచిత విద్యుత్ సరఫరా పథకంలో కీలక మార్పులు జరిగాయి. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇకపై విద్యుత్ ఉచిత రాయితీ మొత్తాన్ని రైతులకు ప్రభుత్వం చెల్లించనుంది. విద్యుత్ బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు విడుదల చేసింది.
10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొంది. రూ. 1700 కోట్లతో పగటిపూట 9 గంటలు ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం చేపట్టనుంది. కేంద్ర సూచనలకు అనుగుణంగా వ్యవసాయ విద్యుత్ కోసం రైతులకు నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయం తీసుకుంది. 2021-22 ఆర్ధిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లోకి విద్యుత్ నగదు బదిలీ కానున్నట్లు తెలిపింది. రైతు ఖాతాల్లోని నగదు నుంచే నేరుగా విద్యుత్ కంపెనీలకు చెల్లించేలా కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నెలవారీ నమోదైన బిల్లును రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం చెల్లించనుంది.