ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కొవిడ్ టీకా తీసుకున్న కొన్ని గంటలకే అంబులెన్స్ డ్రైవర్ మృతి - ambulance driver died after vaccination

కరోనా టీకా తీసుకున్న ఓ అంబులెన్సు డ్రైవర్‌ గుండెపోటుతో మరణించడం కలకలం రేకెత్తించింది. తెలంగాణలోని నిర్మల్‌ జిల్లా కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం 'కొవిషీల్డ్‌' టీకా వేయించుకున్న విఠల్‌రావు... అదే రోజు అర్ధరాత్రి దాటాక గుండెపోటుతో చనిపోయారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను వైద్యారోగ్య శాఖ ఆదేశించింది.

తెలంగాణ: కొవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి మృతి
తెలంగాణ: కొవిడ్ టీకా తీసుకున్న వ్యక్తి మృతి

By

Published : Jan 21, 2021, 4:44 PM IST

కొవిడ్‌ టీకా తీసుకున్న కొన్ని గంటలకే వ్యక్తి మరణించడం కలకలం రేకెత్తించింది. తెలంగాణ నిర్మల్‌ జిల్లా కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఉదయం 11.30 గంటలకు 'కొవిషీల్డ్‌' టీకా వేయించుకున్నాడు అంబులెన్స్ డ్రైవర్​గా పని చేసే విఠల్‌రావు. అయితే అదేరోజు అర్ధరాత్రి దాటాక గుండెపోటుతో చనిపోయాడు. అతడి మరణానికి టీకాయే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించామని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు.

ఏం జరిగింది?

నిర్మల్‌ జిల్లా ఓల గ్రామానికి చెందిన విఠల్‌రావు కుంటాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 108 అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈనెల 19న అదే ఆరోగ్య కేంద్రంలో ఉదయం 11.30 గంటలకు టీకా తీసుకున్నారు. దాదాపు 2 గంటలు అధికారుల పర్యవేక్షణలో ఉన్నారు. ఇక్కడ అతనితో సహా 79 మందికి టీకాలిచ్చారు. సాయంత్రం 5 గంటల వరకూ పీహెచ్‌సీలో డ్యూటీ చేసిన విఠల్‌రావు... ఇంటికి వెళ్లాక అర్ధరాత్రి 2.30 గంటలకు ఛాతీలో నొప్పిగా ఉందని కుటుంబ సభ్యులకు చెప్పారు. తానే అంబులెన్సుకు ఫోన్‌ చేసి రమ్మన్నారు. అనంతరం అంబులెన్స్​లో నిర్మల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

తన బావకు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవని, టీకా తీసుకున్న తర్వాతే అనారోగ్యానికి గురయ్యారని విఠల్‌రావు బావమరిది సదాశివ్‌ ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. విఠల్‌రావుకు రూ.10 లక్షల వరకూ బీమా సొమ్ము వచ్చే అవకాశం ఉందని, అతని భార్యకు విద్యార్హతలను బట్టి సంస్థలో ఉద్యోగాన్ని ఇస్తామని 108 అంబులెన్స్​ల నిర్వాహణ సంస్థ ఈఎంఆర్‌ఐ చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి పి.బ్రహ్మనందరావు వెల్లడించారు.

టీకా వల్ల కాకపోవచ్చు

విఠల్‌రావు మరణం టీకా దుష్ఫలితాల వల్ల జరిగి ఉండదని వైద్యారోగ్యశాఖ తేల్చిచెప్పింది. నివేదికలు వచ్చాక పూర్తి వివరాలు వెల్లడవుతాయని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తెలిపారు. 'ఒక వాయిల్‌లో 10 మందికి టీకా ఇస్తారు. ఒకవేళ దుష్ప్రభావం కలిగితే అందరికీ రావాలి. ఆ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం 79 మందికి టీకాలిచ్చారు. సాధారణంగా టీకా వల్ల దుష్ఫలితాలు ఎదురైతే వెంటనే కనిపిస్తాయి. కానీ విఠల్‌రావు టీకా తీసుకున్నాక సాయంత్రం వరకూ డ్యూటీలోనే ఉన్నారు. టీకా వల్ల మరణించాడని భావించడానికి అవకాశాలు లేవు' అని శ్రీనివాసరావు తెలిపారు.

సమగ్ర విచారణకు ఆదేశం

కొవిడ్‌ టీకా తీసుకున్న 24 గంటల్లోపే వ్యక్తి మృతి చెందడం వల్ల ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 'దుష్ఫలితాల పర్యవేక్షక కమిటీ'కి చెందిన 15 మంది జిల్లా సభ్యులు సమగ్ర విచారణ చేపట్టారు. నిపుణుల సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించారు. టీకా ఇచ్చిన దగ్గర చర్మం, కండరాన్ని సేకరించారు. గుండె, ఊపిరితిత్తులు, జీర్ణకోశం తదితర అవయవాల నమూనాలు, రక్తనమూనాలను సేకరించి పరీక్షలకు పంపినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పాథాలజీ పరీక్షలతో మరణానికి కారణంపై స్పష్టత వస్తుందని నిపుణులు తెలిపారు. టీకా వాయల్స్‌ నమూనాలను కూడా సేకరించి పరీక్షలకు పంపించారు.

కొవిడ్‌ టీకాలు పొందిన తర్వాత ఇప్పటి వరకూ దేశంలో ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందగా.. ఇది మూడో మరణం. అయితే ఈ ముగ్గురు టీకాల వల్ల కాకుండా ఇతరత్రా కారణాల వల్లే మరణించారని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ ఘటనపై కేంద్ర ఆరోగ్యశాఖ ఆరాతీసింది. సమగ్ర నివేదికను అందజేయాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:కేటీఆర్​ను అందుకే సీఎం చేయాలనుకుంటున్నారు: పొన్నాల

ABOUT THE AUTHOR

...view details