వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు అక్రమ మైనింగ్ చేస్తున్నారంటూ... హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. హైకోర్టు న్యాయవాది ఎం.నాగరఘు ఈ పిటిషన్ దాఖలు చేశారు. రాజుపాలెం వైకాపా కార్యకర్తల తరఫున ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. రాజుపాలెం మండలం కోట నెమలిపురి, కొండమోడులో అక్రమ మైనింగ్ జరిగిందని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్ విచారణ అర్హతపై ధర్మాసనం ప్రశ్నలు లేవనెత్తింది.
అక్రమ మైనింగ్ జరుగుతున్నందునే పిటిషన్ వేశానని పిటిషనర్ పేర్కొన్నారు. రాజకీయ దురుద్దేశంతో పిటిషన్ దాఖలు చేశారని ప్రభుత్వ తరఫు న్యాయవాది వివరించారు. పిటిషన్‌కు విచారణ అర్హత లేదని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వైట్ లైమ్ స్టోన్, మొజాయిక్ చిప్స్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని... రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగిస్తున్నారని పిటిషనర్ ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని సీబీఐతో విచారణ జరిపించాలని కోరారు.